అశోక్ లేలాండ్ ‘దోస్త్ ప్లస్’
► 2.75 టన్నుల తేలికపాటి రవాణా వాహనం
► ఎక్స్‌షోరూం ధర రూ.5.47 లక్షల నుంచి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ ‘దోస్త్ ప్లస్’ పేరుతో 2.75 టన్నుల తేలికపాటి రవాణా వాహనాన్ని (ఎల్సీవీ) హైదరాబాద్ వేదికగా సోమవారమిక్కడ భారత మార్కెట్లో విడుదల చేసింది. పేలోడ్ సామర్థ్యం 1.475 టన్నులు. 170 ఎన్ఎమ్ టార్క్, 60 హెచ్‌పీ పవర్‌తో 1.5 టీడీసీఆర్ ఇంజన్‌ను పొందుపరిచారు.
రెండేళ్ల అదనపు వారంటీ ఉంది. మూడు వర్షన్లలో లభిస్తుంది. టాప్ ఎండ్ వర్షన్‌కు ఏసీ, పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లను జోడించారు. ఈ వాహనం 2–3.5 టన్నుల విభాగంలో పోటీపడుతుందని కంపెనీ ఎల్సీవీ విభాగం ప్రెసిడెంట్ నితిన్ సేథ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. దోస్త్ బ్రాండ్‌లో 1.7 లక్షలకుపైగా వాహనాలు అమ్ముడయ్యాయని చెప్పారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.5.47 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.
మూడేళ్లలో లక్ష యూనిట్లు..
గత ఆర్థిక సంవత్సరంలో అశోక్ లేలాండ్ 20 శాతం వృద్ధితో 32,000 ఎల్‌సీవీలను విక్రయించింది. 2020 నాటికి అమ్మకాలు ఒక లక్ష యూనిట్లకు చేరుకోవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు నితిన్ సేథ్ తెలిపారు. అలాగే 5 శాతం ఉన్న ఎగుమతుల వాటాను 20 శాతానికి చేరుస్తామన్నారు. ‘ఎల్‌సీవీల విభాగంలో ప్రతి ఆరు నెలలకో కొత్త మోడల్‌ను విడుదల చేస్తాం.
ఏటా 4.5 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్న ఈ పరిశ్రమలో 2–3.5 టన్నుల విభాగం 60 శాతం కైవసం చేసుకుంది. ఈ సెగ్మెంట్లో మరిన్ని మోడళ్లు తీసుకొస్తాం. ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాత వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఇది ఎల్సీవీ అమ్మకాలకు బూస్ట్‌నిచ్చింది. అయితే 90 శాతం విక్రయాలు ఫైనాన్స్ ద్వారా జరుగుతాయి. క్యాష్ ద్వారా వాహనాన్ని కొనే 10 శాతం కస్టమర్లపైనే డీమోనిటైజేషన్ తీవ్ర ప్రభావం చూపింది’ అని వివరించారు.