గ్రహాల పుట్టుకకు జీవరేఖ!
మనకు 450 కాంతి సంవత్సరాల దూరంలో.. వృషభరాశి(టారస్)లో ఉన్న ‘జీజీ టారీ-ఏ’ అనే ద్వినక్షత్ర వ్యవస్థ చిత్రం ఇది. మధ్యలో ఉన్నవి జంట నక్షత్రాలు కాగా, రెండింటి చుట్టూ ఉన్నది వాయువులు, పదార్థంతో కూడిన భారీ వలయం. దీనికి లోపల నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న మరో వాయువుల వలయం కూడా ఉంది. బయటి వలయం నుంచి లోపలి వ లయానికి, అక్కడి నుంచి పెద్ద నక్షత్రానికి పదార్థం, వాయువులు నెమ్మదిగా ప్రవహిస్తున్నాయట.
అయితే.. రెండు వలయాల మధ్య కొంత పదార్థం, వాయువులు పోగుపడుతున్నాయని, కాలక్రమంలో అక్కడ గ్రహాలు ఏర్పడే అవకాశం ఉందని యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ పరిశోధకులు వెల్లడించారు. అటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్మిల్లీమీటర్ అర్రే(అల్మా) టెలిస్కోపుతో ఈ నక్షత్ర వ్యవస్థను పరిశీలించడంతో ఈ విషయం తెలిసిందట. మన సూర్యుడు కూడా ఒకప్పుడు ఇలాంటి జంట నక్షత్ర వ్యవస్థలో ఒకడిగా ఉండేవాడట. జీజీ టారీ-ఏపై పరిశోధనలు ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల అన్వేషణకూ ఉపయోగపడతాయని భావిస్తున్నారు.