నిప్పులు కక్కిన సూరీడు
►రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
►ఇళ్లకే పరిమితం అవుతున్న జనం
►పార్వతీపురంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలు తాళలేక ప్రజలు భయపడుతున్నారు. అగ్నిపర్వతం బద్దలైందా అన్నట్టుగా ఎండ వేడి చండప్రచండగా ఉంది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే ఎండవేడిమి అధికంగా ఉండడంతో ఇళ్లకే పరితమవుతున్నారు. కూలీలు మాత్రం మొండిధైర్యం చేసి పనులకెళ్తున్నారు.
విజయనగరం వ్యవసాయం : జిల్లాలో మంగళవారంం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, బుధవారానికి 41 డిగ్రీలకు పెరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వీ స్తున్న వేడిగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయని శా స్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం పార్వతీపురంలో మంగళవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, విజయనగరంలో 39 డిగ్రీలు, కొత్తవలసలో 39 డిగ్రీలు, సాలురులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. టోపీ , హెల్మెట్, కళ్లాద్దాలు వంటి రక్షణ కవచాలు ధరించినప్పటికీ ఎండలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండతీవ్రత ఎక్కువుగా ఉండడంతో జనం అవస్థలు పడుతున్నారు. గత ఏడాది మే 20 తేదీ నాటికి గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలుండగా, ఈ ఏడాది 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
ఉదయాన్నే పనులకెళ్తున్న వేతనదారులు: ఎండ తీవ్రతను తట్టుకోలేక ఉపాధి హామీ పథకం వేతనదారులు ఉదయం 6 గంటలకే పనికి వెళ్లి 10 గంటలయ్యేసరికి ఇళ్లకు చేరుకుంటున్నారు. టెంటలున్నా ఉపయోగంలేకుండా పోతోంది. సాగులో ఉన్న నువ్వు పంట సూర్య ప్రతాపానికి ఎండిపోయింది. చెరువుల్లో నీరు లేకపోవడంతో పశుపక్ష్యాదులు దాహార్తితో అల్లాడిపోతున్నాయి. గీత కార్మికులు, ఇటుకబట్టీల కార్మికులు, పరిశ్రమల్లో పనిచేస్తున్నవారు విధులు నిర్వహించలేకపోతున్నారు. తోపుడు బళ్ల పై వ్యాపారం చేసుకునే వారు ఎండలో తిరగలేక ఏదో ఒకచోటకే పరిమితమవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. దీర్ఘకాల వ్యాధిగ్రస్తుల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి.
ఎండలో బయటకు వెళ్లొద్దు
వేడి ఎక్కువగా ఉన్నందున మరీ అవసరమైతే తప్పా బయటకు వెళ్లకుండా ఉంటే మంచింది. ఒక వేళ వెళ్లవలసి వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా మజ్జిగ, కొబ్బరినీళ్లు, గంజి వాటిని తీసుకోవాలి. లేదంటే డిహైడ్రిషన్ గురై కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
-డాక్టర్ బోళెం పద్మావతి, జనరల్ పిజీషియన్ , కేంద్రాస్పత్రి, విజయనగరం.