అధికారమే లక్ష్యం
దుష్ట శక్తుల కుట్రల భగ్నానికి పిలుపు
ఎంజీఆర్ వర్ధంతిలో అన్నాడీఎంకే వర్గాల ప్రతిజ్ఞ
సమాధి వద్ద జయలలిత నివాళి
అసెంబ్లీ ఎన్నికల్లో దుష్ట శక్తుల కుట్రల్ని భగ్నం చేసి, మళ్లీ అధికారమే లక్ష్యంగా పనిచేద్దాం...సుపరి పాలనను కొనసాగించుకుందాం... అంటూ అన్నాడీఎంకే వర్గాలు ప్రతిన బూనాయి. దివంగత డాక్టర్ ఎంజీఆర్ వర్ధంతిని గురువారం వాడవాడల్లో జరుపుకున్నారు. మెరీనా తీరంలోని ఎంజీఆర్ సమాధి వద్ద సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పుష్పాంజలి ఘటించారు.
సాక్షి, చెన్నై: నటుడిగా, విప్లవ నాయకుడిగా, తమిళుల ఆరాధ్యుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న భారత రత్న డాక్టర్ ఎంజీ రామచంద్రన్ ఈ లోకాన్ని వీడి గురువారంతో 28 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ మహా నాయకుడ్ని స్మరించుకుంటూ అన్నాడీఎంకే వర్గాలు వర్ధంతిని రాష్ట్రంలో వాడవాడలా జరుపుకున్నాయి. ఎంజీఆర్ చిత్ర పటాలను కొలువు దీర్చి పుష్పాంజలి ఘటించారు. ఆయన విగ్రహాలకు నిలువెత్తు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. మౌన ప్రదర్శనలు, శాంతి ర్యాలీలు నిర్వహించారు. మెరీనా తీరంలోని ఎంజీఆర్ సమాధి వద్ద సీఎం జయలలిత పుష్పాంజలి ఘటించారు.
పోయెస్ గార్డెన్ నుంచి బయలు దేరిన జయలలితకు దారి పొడవునా అన్నాడీఎంకే వర్గాలు సాదర స్వాగతం పలికారు. పార్టీ వర్గాలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల నాయకులతో కలసి సమాధి వద్దకు చేరుకున్న జయలలిత తొలుత పుష్పగుచ్ఛం ఉంచారు. తదుపరి సమాధి వద్ద పుష్పాలను చల్లి నమస్కరిస్తూ కాసేపు మౌనంగా నివాళి అర్పించారు. తదుపరి అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది పార్టీ శ్రేణులకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదిక మీద నుంచి పార్టీ కోశాధికారి , ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం పార్టీ వర్గాలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల చేత ప్రతిజ్ఞ చేయించారు.
మళ్లీ అధికారం లక్ష్యం : పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ఎంజీఆర్ ఆశయ సాధనలో భాగంగా అహర్నిశలు ప్రజల కోసం శ్రమిస్తున్న అధినేత్రి జయలలిత చేతికి మళ్లీ అధికార పగ్గాలు అప్పగించడం లక్ష్యంగా ఈ ప్రతిజ్ఞ సాగింది. రాష్ట్రాన్ని శాంతి వనంగా, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా, విద్యా, వైద్య, ఉపాధి రంగాల్లో మరింతగా మెరుగైన ఫలితాల సాధన, మహిళా సంక్షేమాన్ని కాంక్షిస్తూ కార్యక్రమాల్ని విస్తృతం చేయడంతో పాటుగా సుపరిపాలన కొనసాగింపునకు ప్రతి ఒక్కరం అహర్నిశలు శ్రమిద్దామని ఈ ప్రతిజ్ఞ ద్వారా పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహా విజయం లక్ష్యం అని, ‘అమ్మ’ సుపరిపాలనలో రాష్ట్రం సుభిక్షం కావాలన్న ధ్యేయంగా ప్రతి ఒక్కరం ఇప్పటి నుంచి విస్తృతంగా శ్రమిద్దామని, ఇందుకు అందరూ కంకణ బద్దులు కావాలని సూచించారు. దుష్ట శక్తులు అధికారం కోసం కుట్రలు చేస్తున్నాయని, వాటన్నింటిని భగ్నం చేయడానికి సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. చేసిన తప్పునకు పాప పరిహారం చేసుకునే రీతిలో పయనాలు సాగిస్తున్నారని, వ్యాపార దృష్టితో ప్రకటనల్ని హోరెత్తిస్తున్నారని..., ఈ దుష్ట శక్తుల కుట్రలు, వ్యూహాల్ని తిప్పి కొట్టి, సుపరిపాలన కొనసాగింపునకు, అమ్మను మళ్లీ..మళ్లీ సీఎంగా చూడడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా పనిచేద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఇదే ప్రతిజ్ఞ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల్లోనూ అన్నాడీఎంకే వర్గాల చేత ముఖ్య నాయకులు చేయించడం గమనార్హం.