Dr. Narendranath Reddy
-
డెంటల్ కౌన్సెలింగ్
చిగుర్ల వ్యాధిలో నొప్పి తెలియదని ఎక్కడో చదివాను. మరి చిగుర్లకు వ్యాధి ఉన్నట్లు గుర్తించడం ఎలాగో తెలపండి. - ఉదయ్‌కుమార్, అనంతపురం చిగుర్లను జింజివా అనీ, వాటికి వచ్చే ఇన్ఫెక్షన్ను జింజివైటిస్ అనీ అంటారు. వ్యాధి జింజివైటిస్ దశలో ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. చిగుళ్లు ఎర్రగా మారడం, ముట్టుకుంటే జివ్వుమనడం, ఉబ్బినట్లుగా ఉండటం వంటివి జింజివైటిస్ లక్షణాలు. మీకు ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వెంటనే డెంటిస్ట్‌ను కలవండి. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్ -
డెంటల్ కౌన్సెలింగ్
నాకు పళ్ల చిగుర్ల మధ్య సందులు వస్తున్నాయి. దాంతో అక్కడ ఆహారపదార్థాలు ఇరుక్కుంటున్నాయి. ఎప్పుడు నాన్‌వెజ్ తిన్నా టూత్‌పిక్ ఉపయోగించాల్సి వస్తోంది. మాది చాలా చిన్న టౌన్. దగ్గర్లోని పెద్ద టౌన్లో సంప్రదిస్తే హైదరాబాద్ వెళ్లమని అన్నారు. నేను తక్షణం చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. - సూర్యనారాయణ, పెబ్బేరు మీరు లేఖలో రాసిన పరిమిత వివరాలను బట్టి మీకు చిగుర్ల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. చిగుర్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అంటారు. దీనికి వచ్చే ఇన్ఫెక్షన్ను జింజివైటిస్‌గా చెబుతారు. ఈ జింజివైటిస్ సమస్య తీవ్రమైతే చిగుర్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకు కూడా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ కాస్తా ఎముకకు చేరితే ఆ కండిషన్‌ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుళ్ల వ్యాధి మొదటిదశలో ఉన్నప్పుడు అనస్థీషియా అవసరం లేకుండానే నొప్పి ఏమాత్రం తెలియకుండా లేజర్ చికిత్స చేయవచ్చు. ఒకవేళ చిగుళ్ల వ్యాధి అడ్వాన్స్డ్ దశలోకి వెళ్తే ఆ సమయంలోనూ ఫ్లాప్ సర్జరీ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఈ సమయంలో ఎముక చుట్టూ ఉన్న చెడిపోయిన కణజాలాన్ని తొగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియలో సైతం లేజర్ చికిత్స ద్వారా అతితక్కువ రక్తస్రావంతో చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా సంప్రదాయ చికిత్స చేసినప్పటి కంటే లేజర్‌తో చికిత్స చేసినప్పుడు రోగి చాలా వేగంగా కోలుకుంటాడు. మీరు వెంటనే మీకు దగ్గర్లోని పెద్ద సెంటర్లో ఉన్న దంతవైద్యనిపుణులను కలవండి. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్ -
డెంటల్ కౌన్సెలింగ్
నాకు ఆర్నెల్ల క్రితం పంటి నొప్పి వచ్చింది. దాంతో డెంటిస్ట్ పై వరసలో పళ్లలో, కింది వరస పళ్లలో రెండు కొత్త క్యాప్స్ పెట్టారు. మళ్లీ రెండు నెలలకు నొప్పి, చిగురువాపు వచ్చాయి. అప్పుడు డెంటిస్ట్ క్యాప్స్ తొలగించి క్లీన్ చేసి మళ్లీ వాటిని తిరిగి అమర్చారు. కొంతకాలంలోనే ఇలా రెండుమూడుసార్లు చేయాల్సి వచ్చింది. నొప్పి నివారణ మందులు వాడుతున్నప్పుడు బాగానే ఉన్నా మళ్లీ మళ్లీ నొప్పి వస్తోంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - బాలయ్య, విశాఖపట్నం ఇన్నిసార్లు చికిత్స జరిగాక కూడా మీరు చెప్పిన విధంగా మాటిమాటికీ పంటి నొప్పి, చిగురు వాపు రావడం పంటి ఆరోగ్యానికి సరైన సూచన కాదు. మాటిమాటికీ క్యాప్‌ను తీసి మళ్లీ అమర్చడం వల్ల మీకు ఉన్న సమస్య తీరదు. నొప్పి నివారణ మందుల్ని మాటిమాటికీ వాడటంతో డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి మళ్లీ అదో సమస్య కావచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వ్యాధినిర్ధారణలోగాని, చికిత్సలో ఏదో లోపం ఉన్నట్లుగా అనిపిస్తోంది. మీకు నొప్పి వచ్చినప్పుడు మందులు వాడుతూ ఉండటం కంటే... సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా అవసరాన్ని బట్టి సరైన చికిత్స చేయించాల్సి ఉంటుంది. మీరు మరో డెంటిస్ట్‌ను కలిసి వారి అభిప్రాయం తీసుకోండి. - డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్ -
డెంటల్ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు నాలుగేళ్లు. వాడి పాలపళ్లన్నీ ఇప్పటికే పిప్పిపళ్లయ్యాయి. ఎందుకిలా జరిగింది? తర్వాత వచ్చే శాశ్వత దంతాలపై దీని దుష్ర్పభావం ఉంటుందా? - ఎమ్. రాజేశ్వరరావు, కరీంనగర్ పిల్లల్లో పాలపళ్లు చాలా ప్రధానమైనవి. ఆహారం నమలడానికి, మాట్లాడటానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ దంతాలు చాలా దోహదపడతాయి. పాలపళ్లు సరిగా ఉంటే భవిష్యత్తుల్లో శాశ్వత దంతాలు సక్రమంగా రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలపళ్లు ఊడకముందే శాశ్వత దంతాలు వస్తే పళ్లు ఎగుడుదిగుడుగా ఉండేందుకు అవకాశం ఉంది. సాధారణంగా ఆర్నెల్ల వయసులో వచ్చే పాలపళ్లు వచ్చినప్పటి నుంచీ అవి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. తీపిపదార్థాలు, చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువగా తాగడం, పిల్లలు ఏడ్వకుండా ఉండటానికి పాలపీకను నోట్లో ఉంచేయడం వంటి అలవాట్లతో పళ్లు పాడవుతాయి. పళ్లన్నీ పిప్పిపళ్లుగా మారితే- పాడైన వాటినన్నింటినీ తొలగించాలి, ఇలా పళ్లు పాడయ్యే ప్రమాదాన్ని చాలామట్టుకు నివారించవచ్చు. ఆ స్థానంలో కొత్త పళ్లను అమర్చాల్సి రావచ్చు. మా పాపకు తొమ్మిదేళ్లు. ఆమె పై పళ్ల వరుసలో ఒక చిన్న సందు ఏర్పడింది. అది క్రమంగా పెరుగుతోంది. ఇది ఇలానే కొనసాగితే పెద్దయ్యాక అసహ్యంగా ఉంటుందని మా ఆందోళన. దీనికి సరైన చికిత్సను సూచించగలరు. - వంశీమోహన్, సికింద్రాబాద్ ఎదిగే పిల్లల్లో అంటే 9-10 సంవత్సరాల మధ్య వయసులో పళ్ల వరుసలో సందులు ఏర్పడటమనేది చాలా సాధారణమైనదీ, సహజమైనదీ. ఈ దశను అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటారు. దీనికి ఏ విధమైన చికిత్సా అవసరం లేదు. 11-12 సంవత్సరాలు వచ్చేసరికి సందులు వాటంతట అవే పూడుకుపోతాయి. ఒకవేళ అప్పటికీ పళ్ల మధ్య సందులు అదేవిధంగానే ఉంటే గనుక అప్పుడు మీరు దంతవైద్యులను కలసి వారి సలహా మేరకు చికిత్స తీసుకోవచ్చు. కాబట్టి దీని గురించి మీరేమీ ఆందోళన పడనవసరం లేదు. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి,ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్ మీకు ఎదురయే రకరకాల అనారోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యుల బృందం ద్వారా తగిన వైద్య సలహాలు పొందండి. ఇందుకు మీరు చేయవలసిందల్లా మీ సమస్యలను వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34కు రాయండి. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com