నాకు పళ్ల చిగుర్ల మధ్య సందులు వస్తున్నాయి. దాంతో అక్కడ ఆహారపదార్థాలు ఇరుక్కుంటున్నాయి. ఎప్పుడు నాన్‌వెజ్ తిన్నా టూత్‌పిక్ ఉపయోగించాల్సి వస్తోంది. మాది చాలా చిన్న టౌన్. దగ్గర్లోని పెద్ద టౌన్‌లో సంప్రదిస్తే హైదరాబాద్ వెళ్లమని అన్నారు. నేను తక్షణం చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి.
- సూర్యనారాయణ, పెబ్బేరు
మీరు లేఖలో రాసిన పరిమిత వివరాలను బట్టి మీకు చిగుర్ల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. చిగుర్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అంటారు. దీనికి వచ్చే ఇన్ఫెక్షన్‌ను జింజివైటిస్‌గా చెబుతారు. ఈ జింజివైటిస్ సమస్య తీవ్రమైతే చిగుర్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకు కూడా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ కాస్తా ఎముకకు చేరితే ఆ కండిషన్‌ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుళ్ల వ్యాధి మొదటిదశలో ఉన్నప్పుడు అనస్థీషియా అవసరం లేకుండానే నొప్పి ఏమాత్రం తెలియకుండా లేజర్ చికిత్స చేయవచ్చు. ఒకవేళ చిగుళ్ల వ్యాధి అడ్వాన్స్‌డ్ దశలోకి వెళ్తే ఆ సమయంలోనూ ఫ్లాప్ సర్జరీ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఈ సమయంలో ఎముక చుట్టూ ఉన్న చెడిపోయిన కణజాలాన్ని తొగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియలో సైతం లేజర్ చికిత్స ద్వారా అతితక్కువ రక్తస్రావంతో చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా సంప్రదాయ చికిత్స చేసినప్పటి కంటే లేజర్‌తో చికిత్స చేసినప్పుడు రోగి చాలా వేగంగా కోలుకుంటాడు. మీరు వెంటనే మీకు దగ్గర్లోని పెద్ద సెంటర్‌లో ఉన్న దంతవైద్యనిపుణులను కలవండి.
డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి
ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్
డెంటల్ కౌన్సెలింగ్
Published Thu, May 21 2015 11:51 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM
Advertisement