ప్యాకేజీలు కాదు.. ప్రత్యేక హోదా కావాలి
నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీలు వద్దని, ప్రత్యేక హోదా కావాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రత్యేక హోదాపై గళమెత్తారు.
- హామీల సాధన కమిటీ ఎన్నిక
మధురానగర్ : నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీలు వద్దని ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి. గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీనగర్‌లోని చాంబర్ ఆప్ కామర్స్ హాలులో సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని దోనేపూడి శంకర్ అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్ర నటిస్తున్నాయని నిద్రపోయేవారిని లేపవచ్చని నటిస్తున్నవారిని లేపలేమన్నారు. ప్రత్యేక హోదావస్తే పన్నుల్లో భారీగా రాయితీలు లభిస్తాయన్నారు. నెలకు మూడు వేలు సంపాదించేవారు సైతం ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించిన 500 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మళ్లించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ కేంద్రమంత్రులు వెంటనే రాజీనామా చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
అనంతరం మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, లోక్‌సత్తా నగర అధ్యక్షుడు అశోక్‌కుమార్, విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, చాంబర్ ప్రతినిధి పొట్లూరి భాస్కరరావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు కోనేరు రమేష్, ఈశ్వరరావు, పెనుమత్స సత్యనారాయణ రాజు, ఓల్గా ఆర్చరీ అకాడమీ అధినేత చెరుకూరి సత్యనారాయణ, డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి. కోటేశ్వరరావు, పోతిన రాము, ఎస్వీ గ్రిటన్ వివిధ సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక హోదా విభజన బిల్లులోని హామీల సాధనకమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా వక్కలగడ్డ భాస్కరరావు, అధ్యక్షుడిగా ఎంసీ దాస్, ప్రధాన కార్యదర్శిగా దోనేపూడి శంకర్ ఎన్నికయ్యారు.