గురుశిష్యుల సంవాదమే... కేనోపనిషత్తు
గతవారం ఈశావాస్యోపనిషత్తు గురించి తెలుసుకున్నాం కదా, ఈ వారం కేనోపనిషత్తు గురించి తెలుసుకుందాం. కేనోపనిషత్తులో నాలుగు ఖండాలున్నాయి. మొత్తం ముప్ఫయి నాలుగు మంత్రాలు ఉన్నాయి. గురుశిష్యుల మధ్య జరిగిన ప్రశ్న- సమాధానాలుగా ఈ ఉపనిషత్తు ఏర్పడింది. మొదటి మంత్రంలో శిష్యుడు కేనేషితం పతతి ప్రేషిత మనః అంటే ఎవరి ప్రేరేపణతో మనస్సు పరుగెత్తుతోంది? అనే ప్రశ్న వేస్తాడు. ఇందులో మొదటిపదం ‘కేన (ఎవని చేత, దేని చేత) అనేది ప్రశ్న వాచకం.
అందుచేత ఇది కేనోపనిషత్తు అయింది. యువతరం ప్రశ్నించాలి. సందేహాలు నివృత్తి చేసుకోవాలి. గుడ్డిగా నమ్మకూడదు. మొండిగా వ్యతిరేకించకూడదు. గురువు దగ్గర కూర్చొని వినాలి. చర్చించాలి. అదే ఉపనిషత్తుల ఉద్దేశం, ప్రయోజనం!
సామవేద ఉపనిషత్తులు మొత్తం పదహారు. వాటిలో మొదటిది, దశోపనిషత్తుల్లో రెండవది కేనోపనిషత్తు. సామవేదానికి చెందిన ఏ ఉపనిషత్తు అయినా మొదటా చివరా చదివే శాంతిమంత్రం అందరికీ తెలిసిందే.
ఓం సహనా వవతు సహనోభువన్తు సహవీర్యం కరవావహై
తేజస్వినావ ధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
(మేము ఇద్దరమూ శక్తిమంతులం అగుదుముగాక! కలిసి భుజింతుము గాక కలసి మహాకార్యాలను చేయుదుముగాక! అధ్యయనంతో తేజోవంతులం అగుదుముగాక ఒకరినొకరు ద్వేషించకుందుముగాక!) ఈ శాంతిమంత్రంలో మేమిద్దరం అనేది గురుశిష్యులకు, జీవబ్రహ్మములకు వర్తిస్తుంది.
మొదటి ఖండం మొదటి మంత్రంలో శిష్యుడు గురువుగారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ‘‘గురుదేవా! ఎవరి ప్రేరణతో మనస్సు దూకుతోంది? ఎవరి చేత నియోగించబడి ప్రాణం కదులుతోంది? ఎవనిచేత మాట్లాడే శక్తి వాక్కుకు, చూసే శక్తి కంటికి, వినే శక్తి చెవికి వస్తున్నాయి? ఏ దేవుడు వీటినన్నిటినీ వినియోగిస్తున్నాడు?’’ అనే ప్రశ్నలు అడిగాడు. గురువు సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేస్తున్నాడు -
‘‘ఆత్మ శక్తితోనే చెవి వినగలుగుతోంది. మనస్సు గ్రహిస్తోంది. వాక్కు పలుకుతోంది. ప్రాణం ఉంటోంది. కన్ను చూస్తోంది. ఈ సత్యాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవారు అమృతత్వాన్ని పొందుతారు’’ అన్నాడు.
ఈ ఆత్మను అనగా బ్రహ్మపదార్థాన్ని ఎలా చూడాలి? ఎలా చెప్పాలి? మొదలైన ప్రశ్నలు శిష్యునికి వస్తాయని గురువే ఊహించి సమాధానం చెబుతున్నాడు. ‘దానిని కళ్లతో చూడలేము. వాక్కుతో చెప్పలేము. మనసుతో తెలుసుకోలేము. దానిని మేము తెలుసుకోలేకపోయాము. అది మనకు తెలిసిన వాటన్నింటికీ వేరైనది. తెలియని వాటికి పైన ఉంటుంది. ఇట్లా మా పూర్వికులు మాకు వివరించారు’ అనే సమాధానం తరతరాలుగా జరుగుతున్న అన్వేషణను తెలుపుతోంది.
తెలియనిదానిని గురించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఊహించి అదే సత్యం అనుకుంటారు. నలుగురు గుడ్డివాళ్లు ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు. ఒకడు తొండం పట్టుకుని తొండమే ఏనుగు అన్నాడు. మరొకడు తోక పట్టుకొని తోకే ఏనుగు అన్నాడు. ఇంకొకడు కాలు, మరొకడు దంతాన్ని పట్టుకుని అవే ఏనుగు అనుకున్నారు. వారికి తెలిసిన పాక్షిక సత్యాన్ని అజ్ఞానంతో అహంకారంతో సంపూర్ణ సత్యంగా ప్రకటిస్తున్నారు. పాక్షిక సత్యాన్ని విని మోసపోవద్దని గురువు శిష్యునికి పదే పదే చెప్పడం ఈ ఉపనిషత్తు విశిష్టత.
‘‘దేనిని మాటలతో చెప్పలేమో, దేనితో మాటలు ఏర్పడ్డాయో అదే అసలైన బ్రహ్మపదార్థం. నువ్వు భ్రమతో అనుకునేది నిజమైనది కాదు’’
‘‘ఏది మనస్సుకు తెలియదో, దేనివల్ల మనస్సు అన్నిటినీ తెలుసుకోగలుగుతోందో అదే అసలైన బ్రహ్మం’’
‘‘దేనిని కళ్లతో చూడలేమో, దేనివల్ల కళ్లు చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మం అని తెలుసుకో’’.
‘‘దేనిని చెవితో వినలేమో, దేనివల్ల చెవి వినగలుగుతోందో అదే బ్రహ్మం అని తెలుసుకో’’.
‘‘దేనిని ప్రాణం బతికించలేదో ప్రాణం దేనివల్ల ఉంటున్నదో అదే బ్రహ్మం అని తెలుసుకో’’ -
అని మొదటి ఖండంలో గురువు పాక్షిక సత్యాలను తాత్కాలిక ఫలితాలను నమ్మి మోసపోవద్దని చెబుతున్నాడు. మాటలతో, మనసుతో, చూపుతో, వినికిడితో, ప్రాణంతో పరబ్రహ్మజ్ఞానం కలిగినట్లు భావించరాదు.
అంతరిక్షంలోకి పోయే వాహనంలో కొన్ని భాగాలు ఎక్కడికక్కడ విడిపోయి పడిపోతూ ఉంటాయి. అసలైన ఉపగ్రహాన్ని పైకి చేర్చటమే వాటి పని. అంతేకాని అవి ఉపగ్రహం కావు. వాక్కు, మనస్సు, కన్ను, చెవి, ప్రాణం అలాంటివి. సగుణోపాసన అలాంటిదే అని ఈ ఉపనిషత్తు స్పష్టంగా చెబుతోంది.
(ద్వితీయ ఖండంలో గురువు ఇంకా సూటిగా, పరిశోధన, అన్వేషణ ఎలా జరగాలో చెబుతాడు. అది వచ్చేవారం)
- డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్