Dr. puranapanda Vyjayanthi
-
జ్ఞానం కోసం జపించాలి
శ్లోకనీతి పోతన రచించిన భాగవతంలోని కొన్ని పద్యాలనైనా నేర్చుకోవడం తెలుగువారి కనీస కర్తవ్యం. పద్యాలను కేవలం కంఠోపాఠంగా కాకుండా, మనసుకి అర్థం చేసుకుని, అందులోని అంతరార్థాన్ని గ్రహించి అప్పుడు ఆ పద్యం నేర్చుకుంటే, అది చిరకాలం మన మదిలో పదిలంగా నిలిచిపోతుంది. పద్యం-2 క్షోణి తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరైణె క వాణికిన్ వాణికి నక్షదామ శుకవారిజ పుస్తక రమ్య పాణికిన్ వ్యాఖ్యాన భావం... సరస్వతీదేవి అవిశ్రాంతంగా... సుకుమారములైన తన నాలుగు చేతులలో క్రమంగా జపమాల, చిలుక, పద్మం, పుస్తకం ధరించి దర్శనమిస్తుంది. సరస్వతీదేవి చదువుల తల్లి. అందువల్లే చదువుకు, విజ్ఞానానికి ప్రతీకగా తన హస్తాలలోని జపమాల ద్వారా... నిరంతరం జ్ఞానాన్ని సముపార్జిస్తూ, మృదువాక్కులు జపిస్తూ ఉండాలని చూపుతోంది. ఇక చిలుక... గురువులు చెప్పిన విద్యను చిలుక వలె పలకాలని అంటే తీయగా, మృదుమధురంగా పలకాలని సూచిస్తోంది, పద్మం వలె వికసిత వదనాలతో స్వచ్ఛమైన హృదయంతో పుస్తకాన్ని చేతబూని జ్ఞానాన్ని సముపార్జించినప్పుడు వారు సరస్వతీదేవిలాగే జ్ఞాన సంపన్నులవుతారని అమ్మవారి అలంకారాలు బోధిస్తున్నాయి. మంచికి మారుపేరయిన దేవతలను రక్షించటం ద్వారా, ఎంతటివారైనా మంచికి అన్యాయం జరుగుతుంటే తప్పక వారిని రక్షించాలని తెలుపుతోంది. తన ఇంపైన మృదుమధుర వచనాల ద్వారా... సత్యాన్నే పలకమని సూచిస్తోన్న సరస్వతీమాతకు సాష్టాంగపడి నమస్కరిస్తున్నాను అన్నాడు పోతన ఈ పద్యంలో. - డా. పురాణపండ వైజయంతి -
క్యాలెండర్ కథ
వివిధ సంస్కృతులలో వివిధ రకాలైన క్యాలెండర్లు ఉన్నప్పటికీ అందరికీ ఒకే క్యాలెండర్ ఉంటే సమన్వయ పరచుకోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రపంచదేశాలన్నీ గ్రెగోరియన్ క్యాలెండర్ను అంగీకరించాయి. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న 365. 25 రోజుల క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండరే. మొదట్లో సెప్టెంబర్... 7వ నెల! ఇంగ్లిష్ క్యాలెండర్లోని సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలను మన తెలుగు అంకెలతో పోలిస్తే , సెప్టెంబరు అనే పదం మన సప్త సంఖ్యను పోలి ఉంటుంది. మొదట తయారయిన ఇంగ్లిష్ క్యాలెండర్లో సెప్టెంబరు మాసం ఏడవది కావడం వల్ల ఆ పేరును నిశ్చయించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే అక్టోబరు - అష్ట, నవంబరు - నవ, డిసెంబరు - దశ... ఈ పదాలన్నీ కూడా మన పదాలకు దగ్గర దగ్గరగా ఉన్నాయి. పోప్ గ్రెగరీ -గీఐఐఐ, 1572లో చక్రవర్తిగా ఎన్నికైనప్పుడు, నాటి మేధావి వర్గం క్యాలెండర్ సవరణల గురించి ప్రతిపాదన తీసుకురావడంతో, అప్పటివరకు ఉన్న జూలియన్ క్యాలెండర్ను మార్పు చేసి గ్రెగోరియన్ క్యాలెండర్ను వాడుకలోకి తెచ్చారు. గ్రెగోరియన్ క్యాలండర్నే వెస్టర్న్ క్యాలెండర్ అని, క్రిస్టియన్ క్యాలెండర్ అని కూడా అంటారు. పోప్ గ్రెగరీ -గీఐఐఐ పేరు మీద రూపొందిన ఈ క్యాలెండర్ని నేడు అంతర్జాతీయంగా ఉపయోగిస్తున్నారు. అంతకు ముందు ఉన్న జూలియన్ క్యాలెండర్ని కొద్దిగా అంటే కేవలం 0.002 శాతం మాత్రం మార్పులు చేసి దీనిని రూపొందించారు. ఈ మార్పుని ముందుగా ఐరోపా ఖండంలోని క్యాథలిక్ దేశాలు అంగీకరించాయి. ప్రొటెస్టంట్లు, తూర్పున ఉన్న శుద్ధ సంప్రదాయ దేశాలు ఈ క్యాలెండర్ని అంగీకరించడానికి చాలాకాలమే పట్టింది. గ్రెగోరియన్ క్యాలెండర్ సూర్యమానం ఆధారంగా రూపొందింది. ఈ క్యాలెండర్ని అంగీకరించిన ఆఖరి దేశం గ్రీస్ (1923). కొత్త సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్లో చేసిన ముఖ్యమైన మార్పు లీపు సంవత్సరం. ఆ ప్రకారం జనవరికి 31 రోజులు ఉంటే, ఫిబ్రవరికి 29 రోజులు, మార్చి నెలకు 31 రోజులు... ఇలా వస్తాయి. క్రీ.పూ. 222 వరకు మే 1 వ తేదీని, కొంతకాలానికి మార్చి 15 వ తారీకుని, క్రీ.పూ. 153 నుంచి జనవరి 1 వ తేదీని కొత్త సంవత్సరంగా ప్రకటించారు. - డా. పురాణపండ వైజయంతి -
వెలుగు పూల పరిమళాల వేళ...
దీపావళి రోజున ఇంటింటా దీపం వెలిగించడం ఆచారం. భారతీయ సంప్రదాయం ప్రకారం చెప్పాలంటే... దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. దీపం జ్యోతి పర బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే ॥ దీపాన్ని మనో వికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి... నిదర్శనంగా భావిస్తారని పండితులు చెబుతారు. ఇలా దీపం వెలిగించి, మహాలక్ష్మిని పూజించడం వెనుక ఒక పురాణగాథ ఉంది. పూర్వం ఒకసారి దుర్వాస మహామునికి దేవేంద్రుడు ఆతిథ్యం ఇచ్చాడు. అతిథి సత్కారానికి దుర్వాసుడు పరమానందం చెంది, ఇంద్రుడికి మహిమాన్విత హారాన్ని ప్రసాదించాడు. అయితే అహంకారంతో నిండిన ఇంద్రుడు ఆ హారాన్ని తిరస్కార భావంతో చూసి, తన దగ్గరున్న ఐరావతం మెడలో వేశాడు. ఏనుగు ఆ హారాన్ని తన కాలితో తొక్కేసింది. ఆ సంఘటన చూసిన దుర్వాసుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ ఆగ్రహంలో దేవేంద్రుడిని శపించాడు. ఆ శాప ఫలంగా దేవేంద్రుడు రాజ్యం, సర్వ సంపదలు కోల్పోయి, దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థించాడు. విషయం గ్రహించిన శ్రీమహావిష్ణువు, దేవేంద్రునితో- ఒక జ్యోతిని వెలిగించి, దానిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచించాడు. శ్రీహరి సూచనను తుచ తప్పకుండా పాటించాడు ఇంద్రుడు. దేవేంద్రుని భక్తికి సంతుష్టి చెందిన లక్ష్మీదేవి ఇంద్రుడిని అనుగ్రహించింది. ఆమె కరుణతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలనూ పొందాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీహరి చెంతనే ఉన్న శ్రీలక్ష్మితో ‘‘తల్లీ నీవు కేవలం శ్రీహరి దగ్గరే ఉండటం న్యాయమా! నీ భక్తులను కరుణించవా?’’ అని దేవేంద్రుడు ప్రశ్నించాడు. అందుకు లక్ష్మీదేవి, ‘‘దేవేంద్రా! నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ప్రసన్నురాలనవుతాను. మహర్షులకు మోక్షలక్ష్మిగా, జయాన్ని కాంక్షించే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, భక్తుల సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలవుతాను’’ అని వరమిచ్చింది. అందుకే, దీపావళి నాడు దీపం వెలిగించి, మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలూ చేకూరతాయని పెద్దల మాట. పురాణాల మాటెలా ఉన్నా, జీవితంలోని చీకటినీ, దుఃఖాన్నీ పారదోలేం దుకు వెలుగు పూల పరిమళాలను పంచే దీపాలను మించినవి ఏముంటాయి! - డా. పురాణపండ వైజయంతి