క్యాలెండర్ కథ
వివిధ సంస్కృతులలో వివిధ రకాలైన క్యాలెండర్లు ఉన్నప్పటికీ అందరికీ ఒకే క్యాలెండర్ ఉంటే సమన్వయ పరచుకోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రపంచదేశాలన్నీ గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అంగీకరించాయి. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న 365. 25 రోజుల క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండరే.
మొదట్లో సెప్టెంబర్... 7వ నెల!
ఇంగ్లిష్ క్యాలెండర్‌లోని సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలను మన తెలుగు అంకెలతో పోలిస్తే , సెప్టెంబరు అనే పదం మన సప్త సంఖ్యను పోలి ఉంటుంది. మొదట తయారయిన ఇంగ్లిష్ క్యాలెండర్‌లో సెప్టెంబరు మాసం ఏడవది కావడం వల్ల ఆ పేరును నిశ్చయించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే అక్టోబరు - అష్ట, నవంబరు - నవ, డిసెంబరు - దశ... ఈ పదాలన్నీ కూడా మన పదాలకు దగ్గర దగ్గరగా ఉన్నాయి.
పోప్ గ్రెగరీ -గీఐఐఐ, 1572లో చక్రవర్తిగా ఎన్నికైనప్పుడు, నాటి మేధావి వర్గం క్యాలెండర్ సవరణల గురించి ప్రతిపాదన తీసుకురావడంతో, అప్పటివరకు ఉన్న జూలియన్ క్యాలెండర్‌ను మార్పు చేసి గ్రెగోరియన్ క్యాలెండర్‌ను వాడుకలోకి తెచ్చారు. గ్రెగోరియన్ క్యాలండర్‌నే వెస్టర్న్ క్యాలెండర్ అని, క్రిస్టియన్ క్యాలెండర్ అని కూడా అంటారు. పోప్ గ్రెగరీ -గీఐఐఐ పేరు మీద రూపొందిన ఈ క్యాలెండర్‌ని నేడు అంతర్జాతీయంగా ఉపయోగిస్తున్నారు.
అంతకు ముందు ఉన్న జూలియన్ క్యాలెండర్‌ని కొద్దిగా అంటే కేవలం 0.002 శాతం మాత్రం మార్పులు చేసి దీనిని రూపొందించారు. ఈ మార్పుని ముందుగా ఐరోపా ఖండంలోని క్యాథలిక్ దేశాలు అంగీకరించాయి. ప్రొటెస్టంట్లు, తూర్పున ఉన్న శుద్ధ సంప్రదాయ దేశాలు ఈ క్యాలెండర్‌ని అంగీకరించడానికి చాలాకాలమే పట్టింది. గ్రెగోరియన్ క్యాలెండర్ సూర్యమానం ఆధారంగా రూపొందింది. ఈ క్యాలెండర్‌ని అంగీకరించిన ఆఖరి దేశం గ్రీస్ (1923).
కొత్త సంవత్సరం
గ్రెగోరియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్‌లో చేసిన ముఖ్యమైన మార్పు లీపు సంవత్సరం. ఆ ప్రకారం జనవరికి 31 రోజులు ఉంటే, ఫిబ్రవరికి 29 రోజులు, మార్చి నెలకు 31 రోజులు... ఇలా వస్తాయి. క్రీ.పూ. 222 వరకు మే 1 వ తేదీని, కొంతకాలానికి మార్చి 15 వ తారీకుని, క్రీ.పూ. 153 నుంచి జనవరి 1 వ తేదీని కొత్త సంవత్సరంగా ప్రకటించారు.
- డా. పురాణపండ వైజయంతి