వాడవాడలా‘మహా’ నివాళి
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి జిల్లాలో సోమవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన మేలును జిల్లా వాసులు స్మరించుకున్నారు. జిల్లావ్యాప్తంగా సంస్మరణ సభలు, విగ్రహాలకు క్షీరాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానాలు విరివిగా నిర్వహించారు. జిల్లాకు మేలు చేసిన రాజన్నా.. నిన్ను మరువం అంటూ అనేక చోట్ల స్థానికులు, గ్రామ ప్రజలు పార్టీలకతీతంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
సాక్షి, విజయవాడ : జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పట్టణంలో, గౌరవరంలో జరిగిన సభల్లో ఉదయభాను పాల్గొన్నారు. జగయ్యపేటలో స్థానిక నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నంలో పార్టీ పట్టణ నేతలు కిలారి రాధ, షేక్ సలార్ దాదా, గొర్రా విఠల్ పలువురు నేతలు జిల్లా కోర్టు, బైపాస్ రోడ్డు సెంటర్లో ఉన్న దివంగత వైఎస్సార్ విగ్రహాలకు నివాళి అర్పించి పలు కార్యక్రమాలు నిర్వహించారు.
వలందపాలెంలోని పాఠశాలలో పార్టీ నాయకులు శీలం మారుతీరావు నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు నేతృత్వంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. మొత్తం 209 మంది రక్తదానం చేశారు. నాగాయలంకలో పార్టీ నాయకులు గుడివాక శివరావు వెయ్యిమందికి అన్నదానం చేశారు. హనుమాన్‌జంక్షన్‌లో జరిగిన భారీ అన్నదాన, రక్తదాన శిబిరంలో పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు పాల్గొన్నారు.
గుడివాడలో స్థానిక నేత పొలుసు సురేంద్ర నేతృత్వంలో లయన్స్ కంటి వైద్యశాల సహకారంతో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పామర్రు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన నేతృత్వంలో వెయ్యి మందికి అన్నదాన శిబిరం నిర్వహించారు. మైలవరంలో పార్టీ సమన్వయకర్తలు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్‌లు వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. జోగి రమేష్ నేతృత్వంలో రెండు వేల మందికి అన్నదానం, జ్యేష్ఠ రమేష్ నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
నూజివీడులో పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందిగామలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పలు కార్యక్రమాలు నిర్వహించారు. కోనాయపాలెం, కొడకటికల్లులో పార్టీ నేతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పెడన నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్‌ల నేతృత్వంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తిరువూరు నియోజకవర్గంలో పార్టీ నాయకుడు తిరుపతి నారాయణరెడ్డి రక్తదాన శిబిరం నిర్వహించారు.
పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త తాతినేని పద్మావతి నేతృత్వంలో పెనమలూరు, గంగూరులో కార్యక్రమాలు జరిగాయి. గంగూరు సర్పంచ్ నందేటి దేవమణి, పార్టీ నేత రహీమ్‌లు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కంకిపాడు మండలంలో జరిగిన వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో 23 అడుగుల దివంగత వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మూడు వేల మందికి అన్నదాన శిబిరం నిర్వహించారు.