వైఎస్ హయాంలోనే గొల్లకుర్మలకు న్యాయం
Published Wed, Sep 4 2013 5:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
రామాయంపేట, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గొర్రెల పెంపకందారులకు న్యాయం జరిగిందని గొర్రెల కాపరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉడుత మల్లేష్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన విలే కరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సకల జనుల సమ్మె చేపట్టిన సమయంలో తెలంగాణలోని సుమారు 9 జిల్లాల్లో 3లక్షల గొర్రెలు వివిధ రోగాలతో మృత్యువాత పడ్డాయన్నారు. అలాగే సీమాంధ్రలోని 13 జిల్లాలలో 2.50లక్షల గొర్రెలు మృతి చెందినట్లు ఆయన తెలిపారు.
పశువుల ఆస్పత్రుల్లో డాక్టర్లు లేక పోవడం వల్ల గొర్రెలు మృత్యువాత పడుతున్నాయన్నారు. దీంతో గొర్రెల కాపర్లకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 7800 గొర్రెల కాపర్ల సంఘాలున్నాయన్నారు. ఈ సంఘాలన్నీ కలిపి బ్యాంకుల్లో సుమారు రూ.60 కోట్ల డిపాజిట్లు పెట్టినట్లు వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గొర్రెల కాపర్ల కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిపించాలన్నారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా సంఘాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర సంఘాలు ఏర్పడితే గొర్రెల కాపరులకు న్యాయం జరుగుతోందన్నారు.
సంఘాల ఏర్పాటునకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 16శాతం మంది గొర్రెల కాపరులు ఉన్నట్లు తెలిపారు. గొర్రెల కాపరులకు వెంటనే బీమా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 15లక్షల గొర్రెల ఉన్నట్లు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా గొర్రెల కాపరుల కోసం ప్రత్యేక జీఓను విడుదల చేసినట్లు చెప్పారు. సమావేశంలో అఖిల భారత గొర్రెల కాపరుల సంఘం మహాసభ జాతీయ కౌన్సిలర్ పొడెన్ల లక్ష్మణ్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశం, చిన్నకోడూర్ టీడీపీ మండల శాఖ అద్యక్షులు మధుసూదన్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement