sheep breeders
-
జిల్లాకు రూ.8 కోట్లు
గొర్రెల పెంపకందారులకు రుణాలు పశుసంవర్ధక శాఖ జేడీ విక్రమ్‌కుమార్ సిద్దిపేట రూరల్: నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ద్వారా గొర్రెల పెంపకందారులను రుణాలు అందిచనున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ ఎన్. విక్రమ్‌కుమార్ తెలిపారు. సోమవారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ గొర్రెల పెంపకందారుల రుణాల కోసం జిల్లాకు రూ. 8కోట్లు విడుదలైనట్లు తెలిపారు. గత ఏడాది మహబూబ్‌నగర్ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకుని నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మెదక్ జిల్లాకు విడుదల అయినట్లు పేర్కొన్నారు. జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఆధ్వర్యంలో 617 సొసైటీలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో జిల్లాలోని 997మందికి రుణాలు అందిస్తామన్నారు. రూ. లక్ష యూనిట్‌గా తీసుకోని అందులో రూ. 60వేలు రుణం, రూ. 20వేలు సబ్సిడీ, రూ. 20వేలు లబ్ధిదారుడే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా 20 ప్లస్ 01 గొర్రెలను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ లావాదేవీలన్ని సహకార సంఘం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయన్నారు. అలాగే తీసుకున్న రుణాన్ని లబ్ధిదారుడు సక్రమంగా చెల్లిస్తే పావలా వడ్డీ చెల్లించాలన్నారు. సక్రమంగా చెల్లించని పక్షంలో రూపాయి వడ్డీ పడుతుందన్నారు. -
షీప్ మార్కెట్ కలేనా..?
రాష్ట్రంలో గొర్రెల పెంపకందారులు పడుతున్న బాధలు విన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వారి సంక్షేమానికి ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దానికి కోట్లాది రూపాయల నిధులను జమ చేశారు. ఒక్క ఖమ్మంజిల్లాలోనే కోటి రూపాయలతో సబ్సిడీపై గొర్రెల యూనిట్లు అందజేశారు. జిల్లాలోని 127 సహకార సంఘాల్లో 15 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద సుమారు జిల్లా వ్యాప్తంగా 10లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఒక్క ఇల్లెందు మండలంలోనే రెండు వేల గొర్రెలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వ్యాధులబారిన పడి మృత్యువాత పడుతున్న గొర్రెల వల్ల నష్టపోకుండా ఉండేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘బీమాతో ధీమా’ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం వల్ల అనేక మంది గొర్రెల పెంపకందారులు నిలదొక్కుకున్నారు. చాలా మంది మాత్రం సరైన అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోయారు. దళారుల వలలో చిక్కుకుని.... ఇంత కష్టపడి పెంచిన గొర్రెలను విక్రయించేందుకు జిల్లాలో సరైన మార్కెట్(సంత) సౌకర్యం లేదు. దీంతో వారంతా దళారుల చేతిలో చిక్కుకుంటున్నారు. పెంపకందారుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుం టున్న దళారులు తక్కువ ధరకు గొర్రెలు కొనుగోలు చేసి ఎక్కువ లాభాలు పొందుతున్నారు. జిల్లాలో గొర్రెల సంత ఉన్నట్లయితే అక్కడికి వెళ్లి లాభాలకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఒక వేళ వెంటనే విక్రయాలు సాగనట్లయితే ఒకటి రెండు రోజులు అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. రైతుకు విశ్రాంతి తీసుకునే సదుపాయంతో పాటు గొర్రెలకు ఆహారం, దాణా, నీరు, నీడ లాంటి సదుపాయాలు ఈ షీప్ మార్కెట్లో లభించే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం జిల్లాలో షీప్ మార్కెట్ ఏర్పాటుకు రూ. 50లక్షలు నిధులు విడుదల చేసింది. రఘునాథపాలెం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం సర్వే నంబర్ 30లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని జిల్లా అధికారులు స్థానిక తహశీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా ఇది మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. బీమాపై అవగాహన కరువు.. దళారుల వలలో చిక్కుకుని నష్టపోతున్న పెంపకందారులకు బీమా సదుపాయంపై అవగాహన కూడా కల్పించేవారే లేరు. అనారోగ్యంతో గొర్రెలు మృత్యువాత పడుతుండడంతో గొర్రెల కాపలాదారులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. కేవలం ఇల్లెందు మండలంలో 300గొర్రెలకు మాత్రమే బీమా చేయించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో షీప్ మార్కెట్, బీమా సదుపాయం కల్పించినట్లయితే గొర్రెల పెంపకందారులకు మేలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇటీవల ఇల్లెందు వచ్చి జిల్లా పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ అంజయ్యను వివరణ కోరగా షీప్ మార్కెట్ లేకపోవడంతో జిల్లాలో గొర్రెల పెంపకందారులు నష్టపోవాల్సి వస్తోందని, ప్రభుత్వం స్థలం కేటాయిస్తే షీప్ మార్కెట్‌ను నిర్మించే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ వ్యాపారం సాగే పండితాపురం సంత... రాష్ట్రంలోనే అతి పెద్ద సంతగా పేరొందిన పండితాపురం సంత జిల్లాలోని గొర్రెల పెంపకందారులను ఆదుకుంటోంది. ఏడాదిలో 52 రెండు వారాలు(ప్రతీ బుధవారం) జరిగే ఈ సంతలో ఒకవైపు సరుకులు, కూరగాయలు, దుస్తులు, ఇతర వస్తువులతో పాటు పశువుల విక్రయం సాగుతుంది. ఈ సంతకు తమ గొర్రెలు, మేకలతో వచ్చే కాపరులు రోజంతా మంచి ధర కోసం వేచి చూసి సరైన ధర లభించకపోతే తక్కువ ధరకు విక్రయించుకుని నష్టం మూట కట్టుకుని వెనుదిరుగుతుంటారు. జిల్లాలో షీప్ మార్కెట్ లేకపోవడంతో గొర్రెల పెంపకందారులు తమ గొర్రెలను తక్కువ ధరకు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ దుస్థితి నుంచి యజమానులు బయటపడాలంటే షిప్‌యార్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
న్యాయం చేయండి
పెద్దోళ్ల సమక్షంలో పెళ్లి చేసుకుంటామన్నాడు వాళ్లుపోయాక వద్దంటున్నాడు.. న్యాయం కోరుతూ ఓ యువతి ఏఎస్పీకి వినతి గొర్రెల కాపరి కష్టాన్ని లెక్క చేయక కుమార్తెను పీజీ వరకు చదివించాడు. పెళ్లి ఈడు రావడంతో సంబంధం చూసి నిశ్చితార్థం చేయించాడు. పెళ్లి కోసం గొర్రెల మందను ఓ కసాయికి విక్రయించాడు. అతను డబ్బులు ఇవ్వకపోగా, ఐపీకి దాఖలు చేసి నోటీసు పంపించాడు. దీంతో గొర్రెల కాపరి గుండెపగిలి తనువు చాలించాడు. ఉన్న ఒక్క కుమారుడూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ కుటుంబంపై జాలి చూపాల్సిందిపోయి నిన్ను పెళ్లి చేసుకునేది లేదని కాబోయే వరుడు యువతికి తెగేసి చెప్పాడు. దీంతో యువతి ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డిని ఆశ్రయించింది. చిత్తూరు (క్రైమ్),న్యూస్‌లైన్: గుర్రంకొండ మండలం మాగన్నగారిపల్లెకు చెందిన వెంకటరమణ, రెడ్డెమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వెంకటరమణ గొర్రెలు మేపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి కష్టాన్ని గుర్తించిన పెద్దకుమార్తె ధనలక్ష్మి పీజీ, బీఎడ్ పూర్తి చేసింది. ఈమెకు వైఎస్ఆర్ జిల్లాకు చెందిన శ్రీనాథ్ (29)తో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఈ మేరకు 2012 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. శ్రీనాథ్ ధనలక్ష్మితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు. పెళ్లి త్వరగా చేయాలని వెంకటరమణ ఉన్న గొర్రెల మందను మదనపల్లెకు చెందిన ఓ కసాయికి విక్రయించాడు. ఆయన డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టి ఐపీ దాఖలు చేశాడు. ఐపీ నోటీసు ఇంటికి రావడంతో వెంకటరమణ షాక్‌కు గురై 2013 మే 11న గుండెపోటుతో మృతి చెందాడు. ఇక ఆ ఇంటికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసులే దిక్కయ్యాడు. తండ్రి చనిపోయిన ఆరు నెలలకే రోడ్డుప్రమాద రూపంలో శ్రీనివాసులు తనువు చాలించాడు. దీంతో ఇంటి బాధ్యతలను తల్లి రెడ్డెమ్మ తీసుకుంది. కుటుంబాన్ని పోషించుకోవాలనే పట్టుదలతో గొర్రెలను కొనుగోలు చేసింది. గొర్రెలు మేపుతుండగా ప్రమాదవశాత్తు బండరాయిపై పడడంతో కాలువిరిగి మంచానపడింది. ఇంతలోనే పెళ్లి కుమారుడు సైతం ఊహించని షాక్ ఇచ్చాడు. వైఎస్ఆర్ జిల్లాలోనే కట్నం మరింత ఎక్కువ ఇస్తామనడంతో మనసు మార్చుకున్నాడు. నీతో పెళ్లి అవసరం లేదని ధనలక్ష్మికి తెగేసి చెప్పేశాడు. యువతి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కొన్ని రోజులు కుంగిపోయింది. ఎలాగోలా ధైర్యం కూడదీసుకుని పెళ్లి కుమారుడి సంగతి తేల్చేయాలని నిర్ణయించుకుంది. ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డిని మంగళవారం చిత్తూరులో కలిసింది. కన్నీరు మున్నీరవుతూ తన బాధను చెప్పుకుంది. వెంటనే స్పందించిన ఏఎస్పీ వాయల్పాడు సీఐకి ఫోన్ చేశారు. తక్షణమే కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ఆదేశించారు. -
వైఎస్ హయాంలోనే గొల్లకుర్మలకు న్యాయం
రామాయంపేట, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గొర్రెల పెంపకందారులకు న్యాయం జరిగిందని గొర్రెల కాపరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉడుత మల్లేష్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన విలే కరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సకల జనుల సమ్మె చేపట్టిన సమయంలో తెలంగాణలోని సుమారు 9 జిల్లాల్లో 3లక్షల గొర్రెలు వివిధ రోగాలతో మృత్యువాత పడ్డాయన్నారు. అలాగే సీమాంధ్రలోని 13 జిల్లాలలో 2.50లక్షల గొర్రెలు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. పశువుల ఆస్పత్రుల్లో డాక్టర్లు లేక పోవడం వల్ల గొర్రెలు మృత్యువాత పడుతున్నాయన్నారు. దీంతో గొర్రెల కాపర్లకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 7800 గొర్రెల కాపర్ల సంఘాలున్నాయన్నారు. ఈ సంఘాలన్నీ కలిపి బ్యాంకుల్లో సుమారు రూ.60 కోట్ల డిపాజిట్లు పెట్టినట్లు వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గొర్రెల కాపర్ల కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిపించాలన్నారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా సంఘాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర సంఘాలు ఏర్పడితే గొర్రెల కాపరులకు న్యాయం జరుగుతోందన్నారు. సంఘాల ఏర్పాటునకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 16శాతం మంది గొర్రెల కాపరులు ఉన్నట్లు తెలిపారు. గొర్రెల కాపరులకు వెంటనే బీమా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 15లక్షల గొర్రెల ఉన్నట్లు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా గొర్రెల కాపరుల కోసం ప్రత్యేక జీఓను విడుదల చేసినట్లు చెప్పారు. సమావేశంలో అఖిల భారత గొర్రెల కాపరుల సంఘం మహాసభ జాతీయ కౌన్సిలర్ పొడెన్ల లక్ష్మణ్‌యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశం, చిన్నకోడూర్ టీడీపీ మండల శాఖ అద్యక్షులు మధుసూదన్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.