షీప్ మార్కెట్ కలేనా..? | place drought for sheep market | Sakshi
Sakshi News home page

షీప్ మార్కెట్ కలేనా..?

Published Wed, Sep 10 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

place drought for sheep market

రాష్ట్రంలో గొర్రెల పెంపకందారులు పడుతున్న బాధలు విన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వారి సంక్షేమానికి ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దానికి కోట్లాది రూపాయల నిధులను జమ చేశారు. ఒక్క ఖమ్మంజిల్లాలోనే కోటి రూపాయలతో సబ్సిడీపై గొర్రెల యూనిట్లు అందజేశారు. జిల్లాలోని 127 సహకార సంఘాల్లో 15 వేల మంది సభ్యులు ఉన్నారు. వీరి వద్ద సుమారు జిల్లా వ్యాప్తంగా 10లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఒక్క ఇల్లెందు మండలంలోనే రెండు వేల గొర్రెలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వ్యాధులబారిన పడి మృత్యువాత పడుతున్న గొర్రెల వల్ల నష్టపోకుండా ఉండేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘బీమాతో ధీమా’ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం వల్ల అనేక మంది గొర్రెల పెంపకందారులు నిలదొక్కుకున్నారు. చాలా మంది మాత్రం సరైన అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోయారు.  

 దళారుల వలలో చిక్కుకుని....
 ఇంత కష్టపడి పెంచిన గొర్రెలను విక్రయించేందుకు జిల్లాలో సరైన మార్కెట్(సంత) సౌకర్యం లేదు. దీంతో వారంతా దళారుల చేతిలో చిక్కుకుంటున్నారు. పెంపకందారుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుం టున్న దళారులు తక్కువ ధరకు గొర్రెలు కొనుగోలు చేసి ఎక్కువ లాభాలు పొందుతున్నారు. జిల్లాలో గొర్రెల సంత ఉన్నట్లయితే అక్కడికి వెళ్లి లాభాలకు విక్రయించుకునే అవకాశం ఉంది.

ఒక వేళ వెంటనే విక్రయాలు సాగనట్లయితే ఒకటి రెండు రోజులు అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. రైతుకు విశ్రాంతి తీసుకునే సదుపాయంతో పాటు గొర్రెలకు ఆహారం, దాణా, నీరు, నీడ లాంటి సదుపాయాలు ఈ షీప్ మార్కెట్‌లో లభించే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం జిల్లాలో షీప్ మార్కెట్ ఏర్పాటుకు రూ. 50లక్షలు నిధులు విడుదల చేసింది. రఘునాథపాలెం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం సర్వే నంబర్ 30లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని జిల్లా అధికారులు స్థానిక తహశీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా ఇది మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.
 
 బీమాపై అవగాహన కరువు..
 దళారుల వలలో చిక్కుకుని నష్టపోతున్న పెంపకందారులకు బీమా సదుపాయంపై అవగాహన కూడా కల్పించేవారే లేరు. అనారోగ్యంతో గొర్రెలు మృత్యువాత పడుతుండడంతో గొర్రెల కాపలాదారులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. కేవలం ఇల్లెందు మండలంలో 300గొర్రెలకు మాత్రమే బీమా చేయించారు.

ఈ నేపథ్యంలో జిల్లాలో షీప్ మార్కెట్, బీమా సదుపాయం కల్పించినట్లయితే గొర్రెల పెంపకందారులకు మేలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇటీవల ఇల్లెందు వచ్చి జిల్లా పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ అంజయ్యను వివరణ కోరగా షీప్ మార్కెట్ లేకపోవడంతో జిల్లాలో గొర్రెల పెంపకందారులు నష్టపోవాల్సి వస్తోందని, ప్రభుత్వం స్థలం కేటాయిస్తే షీప్ మార్కెట్‌ను నిర్మించే అవకాశం ఉందని అన్నారు.   

 రాష్ట్రంలోనే ఎక్కువ వ్యాపారం సాగే  పండితాపురం సంత...
 రాష్ట్రంలోనే అతి పెద్ద సంతగా పేరొందిన పండితాపురం సంత జిల్లాలోని గొర్రెల పెంపకందారులను ఆదుకుంటోంది. ఏడాదిలో 52 రెండు వారాలు(ప్రతీ బుధవారం) జరిగే ఈ సంతలో ఒకవైపు సరుకులు, కూరగాయలు, దుస్తులు, ఇతర వస్తువులతో పాటు పశువుల విక్రయం సాగుతుంది.

 ఈ సంతకు తమ గొర్రెలు, మేకలతో వచ్చే కాపరులు రోజంతా మంచి ధర కోసం వేచి చూసి సరైన ధర లభించకపోతే తక్కువ ధరకు విక్రయించుకుని నష్టం మూట కట్టుకుని వెనుదిరుగుతుంటారు. జిల్లాలో షీప్ మార్కెట్ లేకపోవడంతో గొర్రెల పెంపకందారులు తమ గొర్రెలను తక్కువ ధరకు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ దుస్థితి నుంచి యజమానులు బయటపడాలంటే షిప్‌యార్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement