ఉప లోకాయుక్త పరిశీలనలో విముక్తి
34 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న మహిళ
రాయచూరు రూరల్: క్షణికావేశంలో ఏదో తెలిసీ, తెలియక చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఉప లోకాయుక్త చొరవతో కలబుర్గి చెరసాల నుంచి 93 ఏళ్లున్న వృద్ధురాలి విడుదలకు ప్రతిపాదనలు సిద్ధమైన ఘటన చోటు చేసుకుంది. కలబుర్గి జిల్లా కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప సందర్శించారు.
వయస్సు మీరిన వారిని చెరసాలలో ఉంచరాదనే విషయం తెలుసుకున్న వీరప్ప కలబుర్గి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు శ్రీనివాస నవలిని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసి విడుదలకు అనుమతి కోరాలన్నారు. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకాకు చెందిన నాగమ్మపై 1995లో వరకట్నం కేసులో నిందితురాలిగా కేసు పెట్టారు.
నాటి నుంచి నేటి వరకు శిక్షను అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఉప లోకాయుక్త బి.వీరప్ప చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టిని ఫోన్‌లో సంప్రదించి మాట్లాడారు. పండు వృద్ధురాలు నాగమ్మకు నడవడం కూడా చేత కాదని, ఆరోగ్య సమస్యలను జైల్ అధికారులు, సిబ్బంది అంతగా పట్టించుకోవడం లేదు కనుక ఆమెను చెరసాల నుంచి విడుదల చేసి విముక్తి కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment