మొబైల్ మార్కెట్లో డ్రాగన్ వార్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: కిక్కిరిసిన దేశీయ మొబైల్ ఫోన్ మార్కెట్లో వచ్చే ఏడాది ‘డ్రాగన్వార్’కు రంగం సిద్ధమైంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలు 4జీ సేవలందించేందుకు సిద్ధమవుతుండగా ఆ మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు చైనా కంపెనీలు దూకుడుమీదున్నాయి. జోలో, షియోమీ, జియోనీ లాంటి కంపెనీలు పదివేలలోపు ధరల్లో ఫోన్లను విడుదల చేశాయి. స్మార్ట్‌ఫోన్ విభాగంలో దేశీయ కంపెనీలైన మైక్రోమాక్స్, మ్యాక్స్, లావా,కార్బాన్, ఇంటెక్స్, సెల్కాన్లాంటి సంస్థలు విసిరిన మార్కెటింగ్ సవాళ్లకు నిలబడలేక బహుళ జాతి సంస్థలైన సామ్సంగ్, ఎల్జీలు మార్కెట్లో వాటాను కోల్పోతున్నాయ్.
సోనీ, హెచ్‌టీసీ, మోటోరోలాలు సంపన్న వర్గాలకు చేరువవుతుండగా, నోకియా లాంటి బ్రాండ్లు దాదాపు కనుమరుగయ్యాయి. గతంలో దేశీయ కంపెనీలకు హ్యాండ్సెట్లను సరఫరా చేసిన చైనా కంపెనీలు ఇప్పుడు తామే రంగంలోకి దిగుతున్నాయి. తక్కువ ధరలతో మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పుత్తులకు సవాళ్లు విసిరిన చైనా కంపెనీలు ఇప్పుడు ఖరీదైన బ్రాండ్లతో నేరుగా మార్కెట్లోకి ప్రవేశించి, పోటీకి సై అంటున్నాయి. షియోమీ, జియోనీ, ఒప్పో లాంటి సంస్థలు ఆన్లైన్,ఆఫ్‌లైన్‌తో పాటు ఫ్లాష్ సేల్స్... ఇలా రకరకాల మార్కెటింగ్ వ్యూహాలతో మార్కెట్లో పాగా వేసేందుకు పూర్తి స్థాయిలో పోరాడుతున్నాయి.
గతంలో చైనాలో ఏదైనా ఫోన్ విడుదల అయిన తర్వాత భారత్ మార్కెట్లోకి రావాలంటే కనీసం రెండు నెలలు సమయం పట్టేది. పోటీ తీవ్రత దృష్ట్యా ఇప్పుడు కేవలం నెల రోజుల్లోనే మార్కెట్లో అందుబాటులో ఉంటోంది. తాజాగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అతి కొద్ది కాలంలోనే ప్రపంచ దృష్టిని ఆకర్శించిన చైనా బ్రాండ్ ‘వైవో’ (బీబీకే కమ్యూనికేషన్స్ టెక్నాలజీ) ఇప్పుడు భారత్‌పై దృష్టి పెట్టింది. చైనాలో ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థకే ఝలకిచ్చి మార్కెట్ వాటాలో ఆరో స్థానాన్ని పొందిన ఈ సంస్థ భారత్‌లో మొబైల్ హ్యాండ్సెట్ తయారీ కేంద్రాన్ని కూడా నెలకొల్పేందుకు సన్నద్ధమవుతోంది.
వచ్చే మూడేళ్లలో ఇది సాకారం అయ్యే అవకాశముందని వివో మొబైల్ ఇండియా సీఈవో జాకీ లియో తెలిపారు. అతి తక్కువ మందంతో (4.75 అంగుళాలు) ఉండే ఎక్స్5మ్యాక్స్ హ్యాండ్‌సెట్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 32,980. అధికారక గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఇదే అతి నాజూకైన మొబైల్‌ఫోన్. ఈ ఏడాది మరో నాలుగు మోడళ్లను రూ. 7,000-రూ. 40,000 ధరల శ్రేణిలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.
షియోమీ ప్రణాళికలు యథాతథం...
ఆపిల్ ఆఫ్ చైనాగా పేరొందిన షియోమీ సంస్థ భారత్‌లో వచ్చే ఏడాది మరింత క్రియాశీలకంగా మార్కెట్లో చొచ్చుకుపోనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఎంఐ టీవీని మార్కెట్లో ప్రవేశపెట్టడంతో పాటు బెంగుళూరులో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించింది. 100కు పైగా సర్వీస్ కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటుచేస్తోంది. స్వంతంగా ఈ కామర్స్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌నూ అభివృద్ధి పరుస్తోంది.
ఒప్పో మొబైల్..
దక్షిణాదిలో మార్కెట్‌లీడర్‌గా ఉన్న సంగీత మొబైల్స్‌తో ఒప్పో జత కట్టింది. సంగీత నెట్వర్క్ ద్వారా బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో భారీ ఔట్‌డోర్ ప్రకటనలతో వినియోగదారులకు చేరువవుతోంది.4జీ సేవలకు అనుగుణంగా రూ పదివేలలోపు ధరల్లో ఫోన్లను అందించేందుకు ఒప్పో సంస్థ రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకుంది. నెట్వర్క్ విక్రయాల ద్వారా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.