సినీ ఫక్కీలో రూ.11లక్షల దోపిడీ
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి...
గుడివాడలో పట్టపగలే ఘటన
గుడివాడ: అద్దెకు ఇల్లు కావాలని వచ్చి యజమాని కంట్లో కారం చల్లి రూ.11 లక్షల నగదు అపహరించిన ఘటన గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు, బాధితుడు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి...గుడివాడలోని యాక్సిస్ బ్యాంక్, ఐవోబీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే సీఎంఎస్ సంస్థలో కస్టోడియన్‌గా లక్కరాజు రాంప్రసాద్ పనిచేస్తున్నారు. గురువారం ఆయన యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.17 లక్షల నగదు తీసుకున్నారు. అనంతరం ఒక బ్యాంక్ ఏటీఎంలో రూ.6 లక్షలు డిపాజిట్ చేశారు. తరువాత మధ్యాహ్నం సమయంలో ఏలూరు రోడ్డులోని తన ఇంటికి వెళ్లారు.
అదే సమయంలో ఓ యువకుడు లోపలికి వచ్చి, ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. అతడు మూడురోజులుగా రాంప్రసాద్ ఇంటికి వచ్చి ఇదే కారణం చెబుతున్నాడు. బ్యాచిలర్స్‌కు ఇవ్వబోమని ముందే చెప్పాను కదా.. అని ఆయన బదులిస్తుండగానే ఆ యువకుడు రాంప్రసాద్ కళ్లలో కారం చల్లి రూ.11 లక్షల నగదు బ్యాగ్‌తో అక్కడే సిద్ధంగా మరో బైక్‌తో ఉన్న యువకుడితో కలసి పరారయ్యాడు.