Draw bills
-
22 పాఠశాలలకు ఒకరే హెచ్ఎం
బెజ్జూర్ (సిర్పూర్): ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 22 పాఠశాలలకు ఒక్కరే ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలంలో మొత్తం 79 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 22 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. అలాగే రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యావలంటీర్లతో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్గుపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంధం తిరుపతికి 22 పాఠశాలల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన అన్ని పాఠశాలలను సరిగా పర్యవేక్షించలేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాలల నిధులు పక్కదారి మరో పక్క బెజ్జూర్ మండలంలోని పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాల గ్రాంటు నిధులు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. 2017–18 విద్యాసంవత్సరానికిగాను ప్రతీ పాఠశాలకు రూ.పది వేల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటితో పాఠశాలలకు అవసరమయ్యే బీరువాలు, కుర్చీలు తదితర సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంది. కాని ఇప్పటివరకు ఈ పాఠశాలల్లో ఎలాంటి సామగ్రి కొనుగోలు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ ఆమోదం మేరకు సామగ్రిని కొనుగోలు చేసి బిల్లులు పొందుపర్చి నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే మండలంలో ఏ పాఠశాలలో కూడా సామగ్రి కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించడంలేదు. ఎంఈవో, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కలసి ఈ నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎంఈవోకు కొందరు రాజకీయ నాయకుల మద్దతు ఉండటంతోనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ నిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల కమిటీ బ్యాంకు ఖాతాలో ఉండాల్సి ఉండగా, ఎంఈవో తన సొంత ఖాతాలోకి మార్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ విషయమై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. జూన్‌లో కొనుగోలు చేస్తాం ఈ విషయమై ఎంఈవో రమేశ్ బాబును వివరణ కోరగా నిధులు తన వద్దనే ఉన్నాయని, జూన్‌లో పాఠశాలలకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇన్చార్జి హెచ్ఎం గంధం తిరుపతినివివరణ కోరగా 22 పాఠశాలలకు సంబంధించిన చెక్కులను ఎంఈవోకు ఇచ్చానని తెలిపారు. -
వాహనం వాడకుండానే బిల్లులు డ్రా
► ఇతర మండలానికి చెందిన ఓ వెహికిల్‌పై రూ.1.45లక్షల బిల్లు డ్రా ► ఆరునెలల వాహనం అలవెన్సు బిల్లు జేబులోకి ► గండేడ్ మండల ఇన్చార్జ్ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు గండేడ్: క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణకు కేటాయించిన వాహనాన్ని వాడుకోకుండానే ఓ అధికారి ఆరునెలల బిల్లును కాజేశారు. అంతేకాకుండా కార్యాలయ మెయింటనెన్స్ డబ్బులను కూడా తన సొంత అకౌంట్లో వేసుకుని డ్రా చేశారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఆరు నెలల బిల్లు రూ.1.45లక్షలను జేబులో వేసుకున్నారు. గండేడ్ మండలానికి ఆయన ఇన్చార్జ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. వివిధ పనుల పర్యవేక్షణ కోసంప్రతినెలా అద్దె వాహనంలో ఆయా గ్రామాలను సందర్శించాలి. అలాంటి పనులకు సంబంధిత శాఖ అధికారులను, సిబ్బందిని కూడా ఆ వాహనంలోనే తీసుకువెళ్లాలి. ఆ వాహనానికి ప్రతినెలా రూ.24వేల చొప్పున అద్దె చెల్లిస్తారు. కానీ, వాహనం వినియోగించకుండానే కోస్గి మండలం ముస్రిప్ప గ్రామానికి చెందిన మౌలానా టీఎస్ 06యూపీ3796 ఇండికా వాహనం పేరున బిల్లులు పంపించి సదరు అధికారి తన ఖాతాలో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016 అక్టోబర్ నుంచి మార్చి వరకు ప్రతినెలా రూ.24వేల చొప్పున లక్షా 45వేల రూపాయలను ఖాతాలోకి వేసుకున్నారు. జీఎస్‌లో చేసిన పనిని బట్టి 6శాతం కార్యాలయ నిర్వహణకు, పేపర్ ఖర్చులకు వినియోగించాలి. కానీ ఆ డబ్బులు కూడా తన ఖాతాలోకి మళ్లించి వాడుకున్నట్లు తెలిసింది. వేసవిలోకూడా వాహనాన్ని వినియోగించలేదు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జలనిధి కార్యక్రమంలో ప్రచారం చేసేందుకు సంబంధిత అధికారులను తీసుకువెళ్లేందుకు ఆయా తేదీల్లో వాహనం కూడా వినియోగించాలి. కానీ గతనెల 24న ఎలాంటి వాహనం లేకుండానే ఎండలో మోటారు బైకులపై అధికారులను తీసుకువెళ్లారు. వచ్చే 9, 13,2 0 తేదీల్లో కూడా ఆ వాహనాన్ని వినియోగించాల్సి ఉంది. ఈ విషయమై సంబంధిత ఈజీఎస్ అధికారులు కూడా వాహనాన్ని వాడుకుందామన్నా అందుకు ఆయన ఒప్పుకోనట్లు సమాచారం. ఇలా వాహనం బిల్లులు కాజేసినా, కార్యాలయ బిల్లులు వాడినా అడిగేవారే కరువయ్యారు. ఎలాంటి నిధులు వినియోగించలేదు: కాళుసింగ్, గండేడ్ ఎంపీడీఓ వాహనం వినియోగించేందుకు నెలచొప్పున 24వేల వచ్చేది వాస్తవమే. గత సంవత్సరం రంగారెడ్డిలో ఉన్నప్పుడు వాహనం వినియోగించాం. బిల్లులు పెట్టాం. కాని ఎలాంటి డబ్బులూ రాలేదు.