
బెజ్జూర్ (సిర్పూర్): ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 22 పాఠశాలలకు ఒక్కరే ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలంలో మొత్తం 79 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 22 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. అలాగే రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యావలంటీర్లతో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సల్గుపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంధం తిరుపతికి 22 పాఠశాలల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన అన్ని పాఠశాలలను సరిగా పర్యవేక్షించలేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.
పాఠశాలల నిధులు పక్కదారి
మరో పక్క బెజ్జూర్ మండలంలోని పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాల గ్రాంటు నిధులు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. 2017–18 విద్యాసంవత్సరానికిగాను ప్రతీ పాఠశాలకు రూ.పది వేల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటితో పాఠశాలలకు అవసరమయ్యే బీరువాలు, కుర్చీలు తదితర సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంది. కాని ఇప్పటివరకు ఈ పాఠశాలల్లో ఎలాంటి సామగ్రి కొనుగోలు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ ఆమోదం మేరకు సామగ్రిని కొనుగోలు చేసి బిల్లులు పొందుపర్చి నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే మండలంలో ఏ పాఠశాలలో కూడా సామగ్రి కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించడంలేదు. ఎంఈవో, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కలసి ఈ నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎంఈవోకు కొందరు రాజకీయ నాయకుల మద్దతు ఉండటంతోనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ నిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల కమిటీ బ్యాంకు ఖాతాలో ఉండాల్సి ఉండగా, ఎంఈవో తన సొంత ఖాతాలోకి మార్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ విషయమై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.
జూన్‌లో కొనుగోలు చేస్తాం
ఈ విషయమై ఎంఈవో రమేశ్ బాబును వివరణ కోరగా నిధులు తన వద్దనే ఉన్నాయని, జూన్‌లో పాఠశాలలకు అవసరమయ్యే సామగ్రిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం గంధం తిరుపతినివివరణ కోరగా 22 పాఠశాలలకు సంబంధించిన చెక్కులను ఎంఈవోకు ఇచ్చానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment