వేసవికి ముందే ‘చంపా’ ఎడారి..!
సాక్షి, నెల్లిమర్ల: జిల్లాలోనే అతిపెద్ద నది చంపావతి వేసవికి ముందే పూర్తిగా ఎండిపోయింది. ఇంకా వేసవికాలం ప్రారంభం కాకముందే నీరులేక వెలవెలబోతోంది. పలుచోట్ల చుక్కనీరు కూడా లేకుండా ఎడారిని తలపిస్తోంది. దీంతో రానున్న నిండు వేసవిలో నదిలోని భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయి తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా కానుంది.
జిల్లాలోనే అతిపెద్దదైన చంపావతి నది ఏడు మండలాల్లో ప్రవహిస్తోంది. మెంటాడ మండలం ఆండ్ర కొండల్లో పుట్టిన నది ఆ మండలంతో పాటు గజపతినగరం, బొండపల్లి, గుర్ల, నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ మండలాల గుండా ప్రవహించి చింతపల్లివద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనిపై ఆండ్ర రిజర్వాయర్‌తో పాటు కుమిలి గ్రోయిన్, డెంకాడ ఆనకట్ట తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయి.
నదీ పరివాహక ప్రాంతంలోని మండలాలతో పాటు అదనంగా విజయనగరం, నెల్లిమర్ల మున్సిపాలిటీలకు, గరివిడి, భోగాపురం మండలాలకు తాగునీటిని అందించే పథకాలు నదిలోనే ఉన్నాయి. సుమారు 8లక్షల మందికి నదిలోని పథకాలు తాగునీటిని అందిస్తున్నాయి. వేసవిలో అప్పుడప్పుడూ నీటి సరఫరాలో సమస్యలు తలెత్తినా, చాలావరకు ఇబ్బంది ఉండదు.
తాగునీటికి ఇబ్బందే..
ఈ ఏడాది మాత్రం వేసవిలో తాగునీటి పథకాలు చాలా వరకు పడకేసే ప్రమాదముంది. ఇంకా వేసవి ప్రారంభం కాకముందే నదిలో నీరు పూర్తిగా ఎండిపోయింది. వాటర్ గ్యాలరీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో తప్ప చాలాచోట్ల నదీగర్భం ఎడారిని తలపిస్తోంది. రానున్న వేసవిలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే అవకాశముందని నీటిసరఫరా విభాగం అధికారులు అంటున్నారు. ముఖ్యంగా విజయనగరం పట్టణానికి సరఫరా చేసే రామతీర్థం మంచినీటి పథకంతో పాటు నెల్లిమర్ల మున్సిపాలిటీకి చెందిన పథకాలన్నీ పడకేసే ప్రమాదం పొంచి ఉంది. వరుణుడు కరుణించి అడపాదడపా వర్షాలు కురిస్తేగాని ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు.