రాజకీయాల్లో అస్పృశ్యులు ఉండరు
నాగ్‌పూర్: రాజకీయాల్లో ఎవరూ అస్పృశ్యులు కారని కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో, సామాజిక సేవలో ఎవరినీ అస్పృశ్యులుగా చూడొద్దు’ అని అన్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సరసన పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్కారీకి చెందిన వివాదాస్పద పూర్తి గ్రూపు కంపెనీ శనివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పవార్ పాల్గొన్నారు. డొల్ల కంపెనీల పెట్టుబడుల వ్యవహారంలో పూర్తి గ్రూపు చిక్కుకోవడం, ఫలితంగా గడ్కారీ బీజేపీ సారథ్యం నుంచి తప్పుకోవడం తెలిసిందే. కాగా తమ కంపెనీ ఎస్సార్ గ్రూప్‌తో కలసి దేశవ్యాప్తంగా వంద పెట్రోల్ బంకులు ప్రారంభించనున్నట్లు గడ్కారీ తెలిపారు. ఈ బంకుల్లో ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ప్రభుత్వ చమురు కంపెనీలు అమ్మే ధరకంటే రూ.2 తక్కువకే అమ్మనున్నట్లు వెల్లడించారు.
పూర్తి కంపెనీ చెరకు పిప్పి, జీవ వ్యర్థ్యాలతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది. కాగా, గడ్కారీ చిన్న సాగునీటి ప్రాజెక్టులతో స్వల్పకాలంలోనే సత్ఫలితాలు సాధిస్తున్నారని పవార్ పొగిడారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపితే విదేశీ మారక ద్రవ్యాన్ని మిగుల్చుకోవచ్చని, అయితే ప్రభుత్వ చమురు కంపెనీలు మాత్రం ఇందుకు విముఖంగా ఉన్నాయని పవార్, గడ్కారీలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి ప్రఫుల్ పటేల్ కూడా పాల్గొన్నారు.