కృష్ణపట్నం తరలనున్న ఓసీటీఎల్!
ప్లాంటు తరలింపునకు రూ.200 కోట్ల వ్యయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రిల్లింగ్ పైపుల తయారీలో ఉన్న కామినేని గ్రూప్ కంపెనీ ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ (ఓసీటీఎల్) నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద ఉన్న ప్లాంటును తరలిస్తోంది. కొన్ని నెలలుగా కార్మికులతో తలెత్తిన సమస్యల కారణంగా ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. దీంతో ప్లాంటును తరలించడం తప్ప మరో మార్గం లేదని సంస్థ నిర్ణయించింది. ఎటువంటి నోటీసు, సరైన కారణం లేకుండా కార్మికులు మూకుమ్మడిగా సమ్మెకు దిగారని బీఎస్ఈకి నవంబర్ 10న ఓసీటీఎల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
చమురు, సహజ వాయు నిక్షేపాల వెలికితీతలో ఉపయోగించే అయిదు రకాల భాగాలను తయారు చేసే కంపెనీ ప్రపంచంలో ఇదొక్కటే. ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.5 లక్షల టన్నులు. ఓఎన్జీసీ, షెల్ తదితర కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీకి ప్రధాన మార్కెట్ అయిన అమెరికా యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం కూడా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఓసీటీఎల్కు రూ.5.87 కోట్ల నష్టం వాటిల్లింది. ప్లాంటులో సుమారు 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
9 నెలల్లో కొత్త ప్లాంటు..
ఓసీటీఎల్కు ఇప్పటి వరకు రూ.500 కోట్లు వెచ్చించామని కామినేని గ్రూప్ డెరైక్టర్ కామినేని శశిధర్ తెలిపారు. ప్లాంటు సామర్థ్యంలో 10-20 శాతంలోపే ఉత్పత్తి నమోదవుతోందని పేర్కొన్నారు. ప్లాంటు తరలింపు అంశంపై ఈ నెలలో బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త ప్లాంటుకై కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలను కంపెనీ పరిశీలిస్తోంది. కృష్ణపట్నం వద్దే ఇది ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పైపులను కంపెనీ ఈ పోర్టు నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ప్లాంటు తరలింపు, కొత్త ప్రదేశంలో ఏర్పాటుకు రూ.200 కోట్ల వ్యయం అవుతుందని శశిధర్ తెలిపారు.
75 శాతం మెషినరీ పనికొస్తుందని చెప్పారు. పరిస్థితుల్లో మార్పు లేకపోతే నార్కట్పల్లిలో ఉన్న కామినేని స్టీల్ అండ్ పవర్, యునెటైడ్ సీమ్లెస్ ట్యూబ్యులర్ యూనిట్లను కూడా తరలించడం ఖాయమన్నారు. ఈ రెండు కంపెనీల కోసం సంస్థ రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. రూ.3,000 కోట్లతో విస్తరణ చేపట్టాలని గతంలో భావించినప్పటికీ, తాజాగా ప్లాంట్లనే మరోచోటుకు తరలించాలని నిర్ణయించడం కొసమెరుపు.