రష్యాపైకి ఉక్రెయిన్ 100 డ్రోన్లు
కీవ్: ఉక్రెయిన్ శనివారం రాత్రి తమ పశ్చిమ ప్రాంతంపైకి 100కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది.గగనతల రక్షణ వ్యవస్థలు వీటిని కూల్చేశాయని ప్రకటించింది. మొత్తం ఏడు ప్రాంతాల్లోకి 110 డ్రోన్లు చొచ్చుకురాగా, సరిహద్దుల్లోని ఒక్క కస్క్పైకే ఏకంగా 43 డ్రోన్లను పంపిందని రష్యా ఆర్మీ ప్రకటించింది. నిజ్నీ నొవ్గొరోడ్లోని పేలుడు పదార్థాల కర్మాగారానికి సమీపంలోకి వచ్చిన డ్రోన్ను గాల్లోనే ధ్వంసం చేశామని వివరించింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, శనివారం సాయంత్రం ఉక్రెయిన్లోని క్రివ్యి రిహ్లో రష్యా రెండు బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడిలో 17 మంది గాయపడ్డారని యంత్రాంగం తెలిపింది. పలు నివాసాలు, వ్యాపార సంస్థలకు నష్టం వాటిల్లిందని వెల్లడించింది. కాగా, వారం రోజుల వ్యవధిలో రష్యా 800 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500కు పైగా డ్రోన్లతో దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. నిత్యం తమ నగరాలు, పట్టణాలపై రష్యా దాడులు జరుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు.