ట్రాన్స్‌కోనా మజాకా!
బాల్కొండ/రెంజల్/నిజామాబాద్ నాగారం: వ్యవసాయానికి కరెంటు సరఫరా వేళలలో పూటకో నిర్ణయం తీసుకుంటూ ట్రాన్స్ కో అధికారులు రైతులను అయోమయంలో పడవేస్తున్నారు. ఆదివారం నుంచి సరఫరా వేళలను మార్చారు. కానీ, ఇన్కమింగ్ పేరిట కోతలను తీవ్రం చేశారు. శుక్రవారం రాత్రి 10.20 గంటలకు కరెంట్ కట్ చేస్తే, 11.20 గంటలకు వచ్చింది. మళ్లీ శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు, ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 1.20 వరకు, 3.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఇన్కమింగ్ పేరిట విద్యుత్ కోతలను విధిం చారు.
దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నాలు చేశారు. ఇప్పటి వరకు మూడు గ్రూపులలో కరెంటును సరఫరా చేసిన ట్రాన్స్‌కో అధికారులు ఆదివారం నుంచి దానిని నాలుగు గ్రూపులకు మార్చారు. సరఫరాలో అధిక లోడ్ పడకుండా ఉండాలనే గ్రూపులుగా విభజించామని గతంలో ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ప్రస్తుతం ‘డి’ గ్రూపు వేళలను చూస్తే, రెండు గ్రూపులలో ఒకే సారి సరఫరా ఎలా సాధ్యమవుతుందో అధికారులకే తెలియాలి. రాత్రి కరెంట్‌కు ఎగనామం పెట్టడానికే ‘డి’ గ్రూపును సృష్టించారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఇదేమి తీరు!
ఎ గ్రూపులో రాత్రి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు, బి గ్రూపులో 12 గంటల నుంచి 2 గంటల వరకు, సి గ్రూపులో 2 గంటల నుంచి 4 గంటల వరకు స రఫరా చేస్తారు. డి గ్రూపులో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు కరెంటు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఎ, బి, సి గ్రూపులలో రాత్రి పూట ఇచ్చే క రెంటుపై అధిక లోడ్ పడదా? సరఫరాకు అంతరాయం జరగదా? ఇది అధికారులకే తెలియాలి.