అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ ఆభరణాలు
తిరుచానూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహనంపై పద్మావతి అమ్మవారు ఊరేగనున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి రోజూ మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో అమ్మవారికి అలంకరించేందుకు ఏడురకాల మాలలు, కిరీటం, కుచ్చు జడను వినియోగిస్తారు. మామూలుకు భిన్నంగా అమ్మవారి అలంకరణార్థం తమిళనాడు రాష్ట్రం తిరుపూర్‌కు చెందిన రాజేందర్ అనే భక్తుడు బాదం పప్పు, వట్టి, కురు వేర్లు, రోస్ పెటల్స్, సంపంగిని ఉపయోగించి మాలలు, కిరీటం, కుచ్చు జడను తయారుచేయించారు.
వీటిని బుధవారం టీటీడీ ఉద్యానవనశాఖ డిప్యుటీ డెరైక్టర్ శ్రీనివాసులకు అందజేశారు. వీటిని అమ్మవారికి స్నపన తిరుమంజనంలో అలంకరించారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు దాత సహకారంతో వైవిధ్య మాలలు, కిరీటం, కుచ్చు జడను ఆలయ అర్చకులకు అందించనున్నట్లు శ్రీనివాసులు తెలిపారు. అలాగే తిరుమంజనంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకు న్యూజిలాండ్ కివీ ఫ్రూట్స్, ఆస్ట్రేలియా ఆరెంజ్, అమెరికన్ గ్రేప్స్, డేట్స్ తదితర పండ్లను దాత అందించినట్లు తెలిపారు.