Duke University scientists
-
గబ్బిలాన్ని కరోనా ఏం చేయలేదా?
సింగపూర్ సిటీ: నిఫా, ఎబోలా వైరస్ల తరహాలో కరోనా వైరస్ సైతం గబ్బిలాల నుంచే సోకిందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొదట కరోనా వైరస్‌ను గుర్తించిన చైనాలోని వుహాన్‌లోని కరోనా పేషెంట్ల నుంచి చైనా శాస్త్రవేత్తలు శాంపిల్స్ సేకరించారు. వాటిని ఇతర వైరస్ల జన్యు క్రమాలతో పోల్చారు. చైనాలోని ఒక తరహా గబ్బిలం(హార్స్‌షూ)లో లభించిన వైరస్ జన్యుక్రమంతో ఈ శాంపిల్‌లోని వైరస్ జన్యుక్రమం 96% సరిపోలింది. అయితే, ఈ వైరస్ నేరుగా గబ్బిలం నుంచి మనిషికి సోకలేదని, మధ్యలో మరో వాహకం ఉండే చాన్సుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సార్స్ వ్యాధికి కారణమైన కరోనా వైరస్ గబ్బిలం నుంచి ముంగిస జాతికి చెందిన వాహకం ద్వారా మనుషులకు సోకినట్లు, అలాగే, మెర్స్ వ్యాధి గబ్బిలం నుంచి ఒంటె ద్వారా మనుషులకు సోకినట్లు నిర్ధారణ అయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గబ్బిలాల్లో పెద్ద సంఖ్యలో వివిధ రకాలైన వైరస్లు ఉంటాయి. మనుషులకు సోకే ముప్పున్న దాదాపు 130 రకాల వైరస్‌లను గబ్బిలాల్లో గుర్తించారు. మల, మూత్రాలు, ఉమ్మి ద్వారా గబ్బిలాలు వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఇన్ని వైరస్‌లకు ఆవాసమైన గబ్బిలాలపై ఆ వైరస్ ప్రభావం ఎందుకు పడదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానాన్ని సింగపూర్‌లోని డ్యూక్ ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్లో గబ్బిలాల్లోని వైరస్‌లపై పరిశోధన చేస్తున్న లిన్ఫా వాంగ్ వివరించారు. ‘గబ్బిలం ఎగరగల క్షీరద జాతి. ఎగిరేటపుడు వాటి శరీర ఉష్ణోగ్రత 100 ఫారన్‌హీట్ వరకు వెళ్తుంది. గుండె నిమిషానికి 1000 కన్నా ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మిగతా క్షీరదాలైతే చనిపోతాయి. ఎగిరే సమయంలో తలెత్తే ఈ ఒత్తిడిని తట్టుకునేలా ఒక ప్రత్యేక వ్యాధి నిరోధక వ్యవస్థను గబ్బిలాలు సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా అవి తమ శరీరంపై వైరస్ల ప్రభావాన్ని చంపేసే ప్రత్యేక కణాలను తయారుచేసుకుంటాయి. అలా, వాటి శరీరాలు వైరస్ల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొని, జబ్బు పడకుండా ఉంటాయి’అని వాంగ్ వివరించారు. ఇలాంటి వ్యవస్థ మనుషులు సహా ఇతర క్షీరదాల్లో లేదని చెప్పారు. -
భూగర్భ జలాల్లో భారీగా యురేనియం!
వాషింగ్టన్: భారత్‌లోని 16 రాష్ట్రాల్లోని భూగర్భ జలాలు యురేనియంతో భారీగా కాలుష్యమయమైనట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) ప్రమాణాల కన్నా ఎక్కువగా యురేనియం కాలుష్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాగునీరు, సాగు నీటిలోనూ యురేనియం కాలుష్యం ఎక్కువగా ఉందని అమెరికాలోని డ్యూక్ యూనిర్సిటీ పరిశోధకులు చెప్పారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో అధ్యయనం జరపగా.. రాజస్తాన్, గుజరాత్ వ్యాప్తంగా ఉన్న 324 బావుల్లోని నీటిలో భారీ స్థాయిలో యురేనియం ఉన్నట్లు తేలింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం దేశంలో లీటరుకు 30 మైక్రోగ్రాముల వరకు యురేనియం ఉండవచ్చు. -
శస్త్రచికిత్స లేకుండా కేన్సర్ నయం!
కేన్సర్ చికిత్సకు చౌకైన, వినూత్నమైన చికిత్సను అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే కణితులను పూర్తిగా తొలగించగలగడం ఈ చికిత్స విశేషం. బయోడీజిల్ అనే ఇథనాల్‌కు ఇంకో రసాయానాన్ని కలిపి నేరుగా శరీరంలోకి ప్రవేశపెడితే కొద్దికాలంలోనే కణితి మాయమైనట్లు తెలిసింది. ఎథనాల్ కేన్సర్ కణాలను చంపేయగలదని తెలిసినా.. చాలా ఎక్కువ మోతాదుల్లో వాడాల్సి రావడం.. ఇథనాల్ ప్రభావంతో కణితి పరిసరాల్లో ఉన్న కణజాలం నాశనమవుతుండటం వల్ల దీన్ని వాడలేకపోయారు. డ్యూక్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించారు. ఇథనాల్‌కు ఇథైల్ సెల్యులోజ్‌ను జోడించారు. ఈ మిశ్రమాన్ని కణితిలోకి జొప్పించినప్పుడు అది అక్కడే జిగురు పదార్థంగా మిగిలిపోయింది. కేన్సర్ ఉన్న ఎలుకలపై ఈ ద్రవాన్ని ఉపయోగించినప్పుడు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. 8 రోజుల్లోనే కణితి పూర్తిగా మాయమైపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇథనాల్ అబ్లేషన్ అని పిలిచే ఈ సరికొత్త చికిత్స విధానం సంప్రదాయ శస్త్రచికిత్సకు ఏమాత్రం తీసిపోదని.. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. – సాక్షి, నాలెడ్జ్ సెంటర్ -
ఆ పక్షులు.. ఇక కానరావట..!
ప్రపంచంలో అంతరించిపోయే దశకు చేరుకున్న పక్షి జాతులు సుమారు 210 ఉన్నాయంట! నమ్మడానికి కాస్తా ఇబ్బందిగా ఉన్న ఇది పచ్చి నిజం. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పక్షుల ఉనికి , వాటి నివాస స్థావరాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో సుమారు 210 పక్షి జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనూహ్య మార్పుల వల్ల పక్షుల ఉనికి కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. అంతేకాకుండా ఆ 600 జాతుల్లో 189 జాతులను తిరిగి వర్గీకరించాలని వారు సూచించారు. కానీ వాటిలో ఏ ఒక్క పక్షి కూడా ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం. ఈ మేరకు డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 పక్షి జాతులు ఉండగా అందులో 108 అంతరించేపోయే దశకు చేరుకున్నట్లు ఐయూసీఎన్ వెల్లడించింది. కానీ ప్రస్తుత పరిశోధనల ప్రకారం 210 రకాల జాతుల ఉనికి ప్రమాదంలో ఉన్నట్లు కనుగొన్నారు.