కాయ్ రాజా.. కాయ్!
ఆన్లైన్లో జోరుగా డమ్మీ బెట్టింగ్
న్యూఢిల్లీ: ఉత్కంఠ రేపుతూ, ఊహించని ఫలితాలతో క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. తెరవెనుక వీటిపై పందేలు కాసే బెట్టింగ్ రాజాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. డబ్బుల ప్రసక్తి లేకుండా సరదాగా బెట్ చేద్దామనుకునే వారి కోసం ప్రస్తుతం బోలెడన్ని యాప్స్, వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. డబ్బులతో ప్రమేయం లేకుండా బెట్టింగ్ చేయాలనుకునే వారి సరదా తీరుస్తున్నాయి. బెట్మాకర్స్డాట్కామ్, లగాయ్ఖాయ్ లాంటివి ఆ కోవకి చెందినవే. ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీటికి యూజర్ల తాకిడి పెరిగింది. తాజాగా భారత్ సెమి ఫైనల్స్‌లోకి ప్రవేశించడంతో ఈ యాప్స్‌కు మరింత క్రేజ్ ఏర్పడింది.
వరల్డ్‌కప్ ఊతంతో చాలా మటుకు సైట్లు, యాప్స్‌లో పెద్దయెత్తున యూజర్లు చేరుతున్నారు. ఐపీఎల్ సీజన్ 7తో పోలిస్తే ఇది రెట్టింపు స్థాయిలో ఉంటోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు గ్రాస్ప్ ఆన్లైన్ గేమ్స్‌కి చెందిన లగాయ్ ఖాయ్ అనే మొబైల్ యాప్, వెబ్సైట్లో 60,000 పైచిలుకు యూజర్లు నమోదు చేసుకున్నారు. వరల్డ్‌కప్ నేపథ్యంలో కేవలం ఒక్క వారం వ్యవధిలోనే 10,000 మంది పైగా వీటిలో చేరారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రోజున 32,000 మంది పైచిలుకు యూజర్లు బెట్టింగ్ చేశారు. వరల్డ్ కప్ ముగిసే సరికి కనీసం లక్ష యూజర్ల స్థాయిని చేరుకోవాలని లగాయ్ ఖాయ్ యోచిస్తోంది.
ఇక బెట్మాకర్స్డాట్కామ్ సైటును సందర్శించే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో నెలకు 13,000 పైచిలుకు విజిటర్స్ ఈ సైటును ఉపయోగించగా.. వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ముందు నుంచే విజిటర్స్ సంఖ్య 22,000 పైచిలుకు పెరిగింది. అమెరికా, యూరప్, బ్రెజిల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా ఈ వెబ్సైట్లో చేరుతున్నారు. మరోవైపు, ఢిల్లీకి చెందిన ఆక్ట్రో అనే మొబైల్ గేమింగ్ సంస్థ తమ తీన్ పత్తీ యాప్‌లో క్రికెట్ బెట్టింగ్ ఫీచర్‌ను కూడా జోడించింది. ఇది ఆండ్రాయిడ్, యాపిల్ ఐవోఎస్ ఫోన్లలో అందుబాటులో ఉంది. పాకిస్తాన్, ఇండియా మ్యాచ్‌పై దీని ద్వారా 60,000 మంది పైగా బెట్టింగ్ చేశారు.
మహిళా యూజర్లూ ఎక్కువే..
బెట్టింగ్ యాప్‌లను వాడుతున్న యూజర్లలో 18-35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే ఎక్కువ. ఈ గ్రూప్‌నకు చెందిన వారి సంఖ్య సుమారు 85 శాతంగా ఉంది. ఇక మహిళా యూజర్లు కూడా గణనీయమైన స్థాయిలోనే ఉంటుండటం విశేషం. వీరి సంఖ్య దాదాపు 18 శాతం మేర ఉంటుందని ఆపరేటర్లు చెబుతున్నారు. క్రికెట్ అప్డేట్స్ తెలుసుకునేందుకు, మ్యాచ్‌ల ఫలితాలపై బెట్ కట్టేందుకు తెల్లవారుఝామున 3.30కి కూడా లేచి కూర్చుంటున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు.
గిఫ్టులు కూడా..
సాధారణంగా ఈ యాప్స్, వెబ్సైట్లు రూ. 100, రూ. 500 మొదలైన డినామినేషన్లలో వర్చువల్ గిఫ్ట్ వోచర్లు ఇస్తుంటాయి. వీటిని ఉపయోగించి బెట్టింగ్ చేయొచ్చు. అదనంగా మరింత కరెన్సీ కావాలనుకుంటే సదరు యాప్‌లోనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా ఇన్-యాప్ కొనుగోళ్లతో పాటు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ప్రకటనలు లాంటి వాటితో ఈ యాప్స్, వెబ్సైట్లు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి.
ఇలాంటి డమ్మీ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లలో డబ్బు పోగొట్టుకోవడం, గెల్చుకోవడం లాంటివేమీ ఉండకపోయినా.. ఆయా మ్యాచ్ ల ఫలితాలను మనం కచ్చితంగా ఊహించి ముందే చెప్పగలిగితే బహుమతులను దక్కించుకునే వీలుంది. బెట్మాకర్స్, ఇండియా బెట్, లగాయ్ ఖాయ్ లాంటి యాప్‌లు, సైట్లు .. ట్యాబ్లెట్ పీసీలు, ఐఫోన్లు, ఫ్లిప్‌కార్ట్ వోచర్లు మొదలైనవి అందిస్తున్నాయి.