72 అడుగులు.. 3 గంటలు
విజయవాడ (మధురానగర్)
72 అడుగుల భారీ విగ్రహ నిమజ్జనం 3 గంటల్లో పూర్తయింది. విజయవాడ, దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకచవితి ఉత్సవాలు గురువారం ముగిశాయి. 72 అడుగుల భారీ విగ్రహాన్ని అక్కడికక్కడే నిమజ్జనం చేశారు. ఉదయం లక్ష్మీగణపతి హోమం, పూర్ణాహుతి జరిగాయి. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం ప్రత్యేక అభిషేకాలు, హారతులు ఇచ్చారు. అనంతరం నవాభిషేకం జరిగింది. ఆ తరువాత సిద్ధిబుద్ధి సమేత కైలాస గణపతి నిమజ్జనం సాయంత్రం 7.15 గంటలకు మొదలుపెట్టారు. బాణసంచా వెలుగు, తీన్మార్, గంగిరెద్దులాటలతో ఉత్సవం జరిగింది.
భక్తులు లేక వెలవెల
ఆది నుంచి అనేక వివాదాలతో ప్రారంభమైన డూండీ వినాయక ఉత్సవాల్లో గురువారం జరిగిన నిమజ్జన ఉత్సవాలు తూతూమంత్రంగానే ముగిశాయి. వేలాది మంది భక్తులు వస్తారనుకున్న అంచనాలు తారుమారయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, సేవాసమితి గౌరవాధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు నిమజ్జనోత్సవానికి రాకపోవడం చర్చనీయాంశమైంది.
భారీగా తగ్గిన భక్తులు : కోగంటి సత్యం
డూండీ గణేశ్‌ను గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని, ఈసారి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని రూ.60లక్షలతో 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాలకు రెండురోజుల ముందే స్థానిక ఎమ్మెల్యే తన అనుచర గణంతో సంగీత కళాశాల ప్రాంగణంలోకి చొరబడి ఉత్సవాలను స్వాధీనం చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ గూండా ప్రవేశంతో ఉత్సవాల్లో భక్తులు తగ్గిపోయారని, గత ఏడాది సుమారు 15లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఈసారి కేవలం లక్షమంది కూడా రాలేదని విచారం వ్యక్తం చేశారు.
తనపై అక్రమంగా కేసులు పెట్టారని, నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయన్నారు. సీఎం చంద్రబాబును తాము ఎన్నిమార్లు పిలిచినా రాలేదని, ఈసారి మాత్రం రావడం బాధ కలిగిందని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన అఖిలపక్షానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉత్సవాల్లో వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు పోతిన వెంకట రామారావు, సహాని, ఫణిరాజు, మాజీ డెప్యూటీ మేయర్ సిరిపురపు గ్రిటన్ తదితరులు పాల్గొన్నారు.