ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్‌కు మోదీ అభినందన
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మేక్రన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ’ భవిష్యత్‌లో ఫ్రాన్స్-భారత్‌ల మధ్య బంధం మరింత బలపడుతుందని తాను నమ్ముతున్నట్లు’ ఆయన ఈ సందర్భంగా ట్విట్ చేశారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడి ఎన్నికల్లో మేక్రాన్‌తో పాటు మరీన్ లీ పెన్లు పోటీ పడిన విషయం తెలిసిందే. మాక్రన్‌కు 66.06 శాతం, లీ పెన్కు 33.9 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో లీ పెన్‌పై ఆది నుంచి ఆధిక్యంలో ఉన్న మేక్రాన్ ఎన్నిక లాంఛనప్రాయమైంది.
దీంతో 39 ఏళ్ల మేక్రానే ఫ్రాన్స్ అధ్యక్షుల్లో పిన్న వయస్కులు కావడం విశేషం. యూరోపియన్ యూనియన్‌కు అనుకూలంగా వ్యవహరించే ఆయన ఎన్ మార్చ్ అనే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. కార్మిక చట్టాలను సరళీకరించడం, వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను పెంచడం, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రక్షణ కల్పించడం అనే హామీలతో మేక్రాన్ ఎన్నికల ప్రచారం చేశారు.
మరోవైపు బ్రిటిన్ ప్రధాని థెరిస్సా మే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాల నేతలు నుంచి మేక్రాన్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె, కెనడా ప్రధానితో పాటు, హిల్లరీ క్లింటన్ కూడా మెక్రాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.