Ear problem
-
నేను వినలేను సార్..!
ప్రకాశం, ఉలవపాడు: పుట్టిన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వినికిడి లోపంతో పుట్టిన ఆ బిడ్డను చూసి నిశ్చేష్టులయ్యారు. దీనిని గుర్తించడానికి కాస్త సమయం పట్టింది. అయితే వయసు పెరిగే కొద్దీ వినికిడి జ్ఞానం వస్తుందేమో అని కొందరు వైద్యులు అనడంతో ఎదురుచూశారు. నెమ్మదిగా బాబుకు 8 ఏళ్లు దాటినా వినపడకపోవడంతో పెద్ద వైద్యశాలలో చూపించారు. రెండు చెవులు పనిచేయడంలేద.. ఆపరేషన్ చేసి లోపల యంత్రాలు అమరిస్తే వినబడుతుందని డాక్టర్లు తల్లిదండ్రులకు తెలియచేశారు. దీనికి సుమారు రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి అంత డబ్బు ఎలా తేవాలో తెలియక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో నివాసం ఉంటున్న ఆండ్ర సిద్దయ్య సొంత గ్రామం వలేటివారిపాలెం మండలం నలదలపూరు. అయితే బద్దిపూడి గ్రామానికి చెందిన అమరావతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు సంతానంగా కలిగారు. మగబిడ్డ అయిన యశ్వంత్ సాయి పుట్టుక నుంచి వినికిడి లోపం కలిగింది. అయితే ఇతని తల్లి అమరావతి తమ్ముళ్లు కూడా దివ్యాంగులు కావడంతో ఆ కుటుంబం ప్రస్తుతం బద్దిపూడి గ్రామంలో నివాసం ఉంటోంది. యశ్వంత్ సాయికి పలు చోట్ల చెవిటికి సంబంధించి పరీక్షలు చేశారు. హైదరాబాద్‌లోని అపోలో వైద్యశాల వైద్యులు పరీక్షలు జరిపి ఆపరేషన్ చేస్తే వినబడుతుందని తెలియచేశారు. కూలీ పనులు చేసుకునే సిద్దయ్యకు రూ. 7 లక్షలు ఎక్కడ నుంచి తేవాలో తెలియక అల్లాడిపోతున్నాడు. సీఎం సహాయ నిధి నుంచిరూ. 2 లక్షలు .. బాధితుని తండ్రి తన కుమారునికి నయం చేయించాలని సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధరరెడ్డికి దరఖాస్తు అందచేయడంతో ప్రభుత్వం స్పందించి వెంటనే రూ. 2 లక్షలు మంజూరుచేసింది. కానీ మరో రూ. 5 లక్షలు తీసుకుని వైద్యశాలకు వెళితే కానీ ఆపరేషన్ చేసే వీలు కలుగుతుంది. యశ్వంత్ సాయికి ఆపరేషన్ చేస్తే వినికిడి శక్తి వస్తుందని వైద్యులు నిర్ధారించారు. చెవి ఆపరేషన్‌లో భాగంగా కాక్లియర్ ఇంప్లాంట్, స్పీచ్ డివైస్‌ను లోపల అమర్చితే బాబుకు మాట వినబడుతుంది. పరీక్షల నిమిత్తం ప్రస్తుతం ఈ చిన్నారి హైదరాబాద్ వైద్యశాలలోనే ఉన్నాడు. పేదరికంలో ఉన్న ఈ కుటుంబానికి ప్రస్తుతం చేయూత అవసరం. ఆదుకోవాలనుకునేవారు ఆండ్ర సిద్దయ్య బ్యాంకు అకౌంటు నంబరు 6652355277 (శాఖవరం గ్రామం), ఐయఫ్యస్సీ కోడు ఐడీఐబీ 0005068 నంబరుకు పంపాలని కోరారు. బద్దిపూడి గ్రామానికి చెందిన ఫిజియోధెరపీ వైద్యుడు తాటితోటి సుధాకర్ (ఫోన్ నంబర్లు 9182007257,9948345663)ను సంప్రదించి దాతలు సహకరించాలని కోరారు. -
చెవికెక్కడం లేదు!
జిల్లాలో చెవిటితనంతో బాధపడుతున్న రోగులు అనేక మంది ఉన్నారు. వీరంతా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. జీజీహెచ్‌లో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామంటూ ప్రైవేటు డాక్టర్ ముందుకొచ్చారు. కానీ జీజీహెచ్ ఉన్నతాధికారులకే మనసు రావడం లేదు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆపరేషన్లకు అవకాశం ఉన్నా.. అందిపుచ్చుకోవాలనే శ్రద్ధ అంతకన్నా ఉండడం లేదు. బధిరుల వేదన వారి చెవికెక్కడం లేదు. గుంటూరు మెడికల్: పుట్టుకతో వినికిడి లోపం సమస్య ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తానని గుంటూరుకు చెందిన ఓ ప్రైవేటు డాక్టర్ ముందుకు వచ్చినా గుంటూరు జీజీహెచ్ అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావునిస్తోంది. ప్రైవేటు ప్రాక్టీస్ చేతినిండా ఉన్నా జీజీహెచ్‌కు వచ్చే పేదలకు తన వంతు సాయం చేయాలని ఆ డాక్టర్ జీజీహెచ్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఆస్పత్రి అధికారులు చొరవ చూపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పుట్టుకతో వినికిడి సమస్య ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ప్రతి వెయ్యిమంది పిల్లల్లో ఆరుగురు చెవుడు సమస్యతో పుడుతున్నారు. మేనరిక వివాహాల వల్ల పిల్లలకు చెవుడు సమస్య వస్తుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. చెవుడు సమస్య ఉన్న పిల్లలకు ఐదేళ్లలోపు ఆపరేషన్ చేస్తేనే ఫలితం ఉంటుంది. పుట్టుకతో చెవుడు ఉన్న పిల్లలకు ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కేజీహెచ్, హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసేవారు. రాష్ట్ర విభజన అనంతరం విశాఖపట్నంలో ఆపరేషన్లు నిలిపివేయడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు జరగక పిల్లలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నాలుగుచోట్ల మాత్రమే కాక్లియార్ ఇంప్లాంట్ ఆపరేషన్లు డాక్టర్ ఎన్టిఆర్ వైద్యసేవ పథకం ద్వారా ఉచితంగా చేస్తున్నారు. రాష్ట్ర విభజన పిదప ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొట్టమొదటిసారిగా 2017లో గుంటూరు జీజీహెచ్‌లో ఆపరేషన్లు చేసేందుకు ఎన్టిఆర్ వైద్యసేవ పథకం అధికారులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాని వైద్య సౌకర్యాల కొరత, అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆపరేషన్లు ప్రారంభం కాలేదు. మూడునెలల క్రితమే విశాఖపట్నం కేజీహెచ్‌లో ఆపరేషన్లు ప్రారంభించారు. కాని ఏడాదికి పైగా జీజీహెచ్ అధికారులు ఆపరేషన్లు ప్రారంభించకుండా నిమ్మకునీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావునిస్తోంది. ఆపరేషన్లు ప్రారంభిస్తే ఎన్టిఆర్ వైద్యసేవ పథకం ద్వారా వైద్యులకు పారితోషికాలు రావడంతో పాటుగా ఆస్పత్రి అభివృద్ధికి నిధులు సైతం వస్తాయి. రాష్ట్ర విభజన పిదప రాజధాని ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ అవతరించడంతో జీజీహెచ్‌కు వచ్చే రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. రాజధాని ఆస్పత్రిలో కాక్లియర్ ఆపరేషన్లు చేయకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. ముందుకొచ్చిన డాక్టర్ సుబ్బారాయుడు... గుంటూరు జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులకు కార్పొరేట్ వైద్యసేవలను అందించాలనే సదాశయంతో గత ఏడాది గుంటూరు నగరానికి చెందిన రాధికారాయుడు ఈఎన్టీ ఆస్పత్రి నిర్వాహకులు, ఈఎన్టీ వైద్య నిపుణుడు డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు ముందుకొచ్చారు. ఈఎన్టీ వైద్య నిపుణుడిగా 16 ఏళ్లుగా గుంటూరులో ఈయన వైద్యసేవలను అందిస్తున్నారు. సాహి అనే కార్యక్రమం ద్వారా మూడేళ్లుగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్ సుబ్బారాయుడు ‘చెవి అండ్ శ్రవణ సంరక్షణ’ అనే ట్రస్ట్ ద్వారా గుంటూరు జీజీహెచ్‌లో ‘ఇన్‌సోర్స్ పద్ధతిలో’ ఆపరేషన్లు చేసేందుకు 2017 మార్చిలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏడాదిగా వైద్య సౌకర్యాలపైదృష్టి పెట్టడం లేదు కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించేందుకు వైద్యుడు ముందుకొచ్చినా జీజీహెచ్ అధికారులు అందుకు తగిన వైద్య సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల ఆస్పత్రిలో ఏడాదిగా ఆపరేషన్లు ప్రారంభం కాలేదు. గత ఏడాది జూన్‌లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వడ్లమూడి శ్రీనివాసరావు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ హైమావతి ఆపరేషన్లు చేసేందుకు ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. 2017 జూలై నుంచి ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసేందుకు ఓపీ వైద్యసేవలను ప్రారంభిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు వెల్లడించారు. ఆపరేషన్లు చేస్తామని మాట ఇచ్చి ఏడాది అయింది. కాని నేటివరకు ఓపీ వైద్యసేవలను ప్రారంభించకుండా మిన్నకుండిపోవడం జీజీహెచ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. డాక్టర్ వైఎస్ చొరవతోనే... సుమారు ఎనిమిది లక్షల ఖరీదుచేసే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు నిరుపేదలకు అందించాలనే మంచి ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకంలో ఈ ఆపరేషన్లు చేర్చారు. పుట్టుకతో చెవుడు సమస్య ఉండి మాటలు రాని అనేకమంది నిరుపేదల చిన్నారులు ఈ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో ఆపరేషన్లు చేసుకునే సౌకర్యం ఉన్నా జీజీహెచ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆస్పత్రి అధికారులు చొరవ చూపించి గుంటూరు జీజీహెచ్‌లో నిరుపేదలకు ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. తనిఖీ చేసే కమిటీదే ఆలస్యం జీజీహెచ్‌లో ఆపరేషన్లు ప్రారంభించేందుకు ఎన్టీఆర్ వైద్యసేవ వైద్య బృందం తనిఖీలు చేసి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది డిసెంబర్లో కమిటీని తనిఖీలు చేసేందుకు రావాలని కోరాం. రెండు రోజుల క్రితం ఆపరేషన్లు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మళ్లీ లేఖ రాశాం.– డాక్టర్ డీఎస్ రాజునాయుడు,జీజీహెచ్ సూపరింటెండెంట్ -
అమ్మా... చెప్పు... వింటున్నా!
పిల్లలు బోర్లా పడడం, పాకడం, కూర్చోవడం,లేచి నిలబడడం, నడవడం... ఏడాదిలోపు జరిగిపోతాయి.మరి... మాట్లాడేదెప్పుడు? ఏడాది నిండేలోపుమాటలు వస్తే ఆ ప్రశ్నే తలెత్తదు.కానీ... మాట్లాడడం ఆలస్యమైతే?మాటలు వంశ సాలును బట్టి వస్తాయని...మూడేళ్లకు మాట్లాడతారని సరిపెట్టుకుంటారు.పిల్లల మాట్లాడడం ఆలస్యమైనా పర్లేదు కానీ...మన మాటలను వినడంలో అలక్ష్యం కనిపిస్తే?!? వేచి చూద్దాం అని చాచివేత ధోరణితో ఉంటే ప్రమాదమే!మనం మాట్లాడింది వినలేకపోతున్నారంటే...దానిని తిరిగి ఉచ్ఛరించడమూ జరగదు.అందుకే... పిల్లలు పుట్టగానే వింటున్నారాలేదా అని చూడాలి... వినలేదనిపిస్తే వెంటనే వినిపించేప్రయత్నం చేయాలి!! మనదేశంలో ప్రతి వెయ్యి మందిలో నలుగురు వినికిడి లోపంతో పుడుతున్నారు. పుట్టినప్పటికీ బాగానే ఉన్నప్పటికీ జీవనశైలి, పోషకాహార లోపం వంటి ఇతర కారణాల వల్ల నలభై దాటేటప్పటికి చెవి సమస్యలకు గురయ్యే వారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. గడచిన కాలంలో ఎక్కువమంది పోషకాహారలోపంతో వార్ధక్యంలో వినికిడి సమస్యలకు గురయ్యేవారు. ఇటీవల పెరుగుతున్న కేసుల్లో మారిన జీవనశైలి ప్రధానకారణంగా కనిపిస్తోంది. మేనరికపు వివాహాల ద్వారా పుట్టిన పిల్లల్లో కూడా వినికిడి లోపాలు కనిపిస్తున్నాయి. కాక్లియాలో ఉండే హెయిర్‌సెల్స్ తక్కువగా ఉండడం, ఒకవేళ తగినన్ని ఉన్నప్పటికీ అవి సరిగ్గా పనిచేయకపోవడం వలన వినికిడి లోపం కలుగుతుంది. ఇన్ఫెక్షన్ వంటి సాధారణ కారణాలతో వచ్చే లోపాలను మందుల వాడకం, చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. పుట్టుకతోనే చెవి నిర్మాణం లోపం ఉన్నవారికి, తీవ్రమైన వినికిడి సమస్యలకు, వినికిడి మెషీన్‌తో ఫలితం లేని వారికి, కాక్లియర్ ఇంప్లాంట్ మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయం. పిల్లల్లో వినికిడి లోపాన్ని త్వరగా గుర్తించడం ఎంత అవసరమో, వెంటనే వైద్యం చేయడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే... పిల్లల మెదడు వికాసం మొదటి మూడేళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులోనే అన్ని రకాల శబ్దాలనూ వినాలి, వాటిని అర్థం చేసుకోవాలి. మాటలను తిరిగి పలకడానికి ప్రయత్నించాలి. అందుకే పుట్టిన వెంటనే వినికిడి పరీక్ష చేయడం, లోపం ఉంటే సరిదిద్దుకోవడం రెండూ చాలా కీలకం. ఇటీవల జీవనశైలిలో మార్పుల వల్ల పెద్దల్లోనూ వినికిడి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా పెద్దలకు వచ్చే వినికిడి సమస్యలకూ కాక్లియర్ సర్జరీ ఒక మంచి పరిష్కారం. కాక్లియర్ శస్త్ర చికిత్స! ఈఎన్టి నిపుణులు, ఆడియాలజిస్ట్‌ల సూచనమేరకు ఆటోస్కోపీ, ఆడియాలజీ పరీక్షలు, సైకలాజికల్ అసెస్మెంట్, స్పీచ్ అసెస్మెంట్, సిటిస్కాన్, ఎంఆర్ఐ పరీక్షలు చేయాలి. అలాగే సర్జికల్ ప్రొఫైల్ పరిశీలించాలి. అవసరాన్ని బట్టి కంటి వైద్యులు, చిన్నపిల్లల వైద్యులను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. రేడియాలజిస్ట్, ఆనస్తిస్ట్లతో కూడిన బృందం సేవలు అవసరమవుతాయి. ఈ పరీక్షలు, అధ్యయనాల తర్వాత పేషెంటుకి కాక్లియర్ సర్జరీ చేయవచ్చా లేదా అనే నిర్ధారణకు రావడం జరుగుతుంది. సాధారణంగా వీటి అవసరం ఎవరెవరికి ఉంటుందంటే... n వినికిడి సమస్య రెండుచెవులలో 70–80 శాతం ఉన్నవారికి n వినికిడి మెషీన్ ద్వారా ఉపయోగం లేని వారికి n కాక్లియ, కాక్లియర్ నరం అభివృద్ధి చెందని వారికి n ఆడిటరీ న్యూరోపతి స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న వారికి సర్జరీ తర్వాత! సర్జరీ చేసి కాక్లియర్ ఇంప్లాంట్‌ను అమర్చిన తర్వాత మూడు వారాలకు బయటి మెషీన్‌ను ఆన్ చేస్తారు. అప్పటి నుంచి అన్ని శబ్దాలూ చక్కగా వినిపిస్తాయి. పిల్లలకు అప్పటి వరకు భాష, మాటలను విన్న అనుభవం ఉండదు కాబట్టి ప్రతి శబ్దానికి ఆశ్చర్యంగా స్పందిస్తుంటారు. వారు అప్పుడే పుట్టిన బిడ్డతో సమానం అన్నమాట. వారికి ఆడిటరీ వెర్బల్ థెరపీ, మెషీన్ ప్రోగ్రామింగ్‌లో శిక్షణ ఇవ్వాలి. ఇంటి దగ్గర సాధన చేయడం ద్వారా విన్న మాటలను అర్థం చేసుకోవడం, ఉచ్ఛరించడం నేర్చుకుంటారు. మాటకు ప్రతిస్పందించడమూ నేర్చుకుంటారు. ఈ దశలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత త్వరగా మామూలు పిల్లలతో సమానమవుతారు. వినికిడి వ్యవస్థ – చెవి నిర్మాణం! బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి, వినికిడి నరం, ఆడిటరీ కార్టెక్స్ అనేవి ముఖ్యమైన భాగాలు. పిన్నా, చెవి రంధ్రం బయటకు కనిపిస్తాయి. వాటి లోపల కర్ణభేరి ఉంటుంది. అది కూడా బయటిచెవిలో భాగమే. మధ్య చెవి భాగాలు ఎముకల గొలుసు (ఆసిక్యూలార్చైన్) లోపలి చెవి భాగాలు కాక్లియ, వెస్టిబ్యూలార్ సిస్టమ్ ఉంటాయి. తర్వాత వినికిడి నరం, ఆడిటరీ కార్టెక్స్ వంటి క్లిష్టమైన భాగాలుంటాయి. ఇలా వింటాం! శబ్దతరంగాలు పిన్నాను తాకి, చెవిరంధ్రం ద్వారా కర్ణబేరికి ప్రకంపనలను చేరవేస్తాయి. ఆ ప్రకంపనలకు ఆసిక్యూలార్ చైన్ కదిలి కాక్లియాను స్పందింపచేస్తుంది. కాక్లియాలో ఉండే హెయిర్ సెల్స్ ఎలక్ట్రిక్ ఇంపల్షన్ను సృష్టించి వాటికి అనుసంధానమై ఉన్న ఆడిటరీ నర్వ్ ఫైబర్‌ను స్పందింపచేస్తాయి. ఆ తర్వాత ఆడిటరీ నర్వ్ ద్వారా శబ్దం మెదడులోని ఆడిటరీ కార్టెక్స్‌కు చేరుతుంది. వినికిడి లోపాలెన్నెన్నో! చెవి నిర్మాణాన్ని విభజించినట్లే వినికిడి లోపాలను కూడా వర్గీకరిస్తారు. బయటిచెవి, మధ్య చెవి లోపాలను కండక్టివ్ హియరింగ్ లాస్, లోపలిచెవి లోపాలను సెన్సరీన్యూరల్ హియరింగ్ లాస్, వినికిడి నరం, ఆ తరవాత భాగాల లోపాలతో వచ్చే వినికిడి సమస్యను ఆడిటరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అంటారు. నిర్ధారణ! ప్రస్తుతం పుట్టిన వెంటనే శిశువులో వినికిడి వ్యవస్థ పనితీరు ఎలా ఉందోనని పరీక్షించే పరికరాలున్నాయి. ఈ పరీక్షను నియోనేటల్ హియరింగ్ స్క్రీనింగ్ అంటారు. మనదేశంలో కొన్ని హాస్పిటళ్లలో మాత్రమే ఓటో అకాస్టిక్ ఎమిషన్స్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. n ఓటో అకాస్టిక్ ఏమిషన్స్ పరీక్షలో ఫెయిలైన పిల్లలకు ఆడిటరీ ఎవోక్డ్ పొటెన్షియల్స్, ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాక్లియర్ ఇంప్లాంట్ పనితీరిలా! కాక్లియర్ ఇంప్లాంట్లో రెండు భాగాలుంటాయి. ఒకటి శస్త్ర చికిత్స చేసి చెవి లోపల అమర్చే సాధనం. మరొకటి చెవి బయట అమర్చే సౌండ్ ప్రాసెసర్. దీనిని స్పీచ్ ప్రాసెసర్ అని కూడా అంటారు. ఇందులో ఉండే మైక్రోఫోన్ శబ్దాలను గ్రహించి ప్రాసెసర్లోకి పంపిస్తుంది. ఆ శబ్దం ప్రాసెసర్ ద్వారా ప్రయాణించి కాయిల్ ద్వారా శబ్దతరంగాలుగా మారి లోపల ఉండే ఇంప్లాంట్‌లోని రిసీవర్‌కు చేరుతుంది. కాక్లియలో అమర్చిన ఎలక్ట్రోడ్ అరే లోని ఎలక్ట్రోడ్‌కు చేరిన శబ్దం ఫైబర్స్‌ను స్పందింపచేస్తుంది. దాంతో శబ్దాన్ని కచ్చితంగా వినగలుగుతారు. డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్, హైదరాబాద్