అమ్మా... చెప్పు... వింటున్నా! | Hearing, Ear problem | Sakshi
Sakshi News home page

అమ్మా... చెప్పు... వింటున్నా!

Published Thu, Jan 12 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

అమ్మా... చెప్పు... వింటున్నా!

అమ్మా... చెప్పు... వింటున్నా!

పిల్లలు బోర్లా పడడం, పాకడం, కూర్చోవడం,లేచి నిలబడడం, నడవడం... ఏడాదిలోపు జరిగిపోతాయి.మరి... మాట్లాడేదెప్పుడు? ఏడాది నిండేలోపుమాటలు వస్తే ఆ ప్రశ్నే తలెత్తదు.కానీ... మాట్లాడడం ఆలస్యమైతే?మాటలు వంశ సాలును బట్టి వస్తాయని...మూడేళ్లకు మాట్లాడతారని సరిపెట్టుకుంటారు.పిల్లల మాట్లాడడం ఆలస్యమైనా పర్లేదు కానీ...మన మాటలను వినడంలో అలక్ష్యం కనిపిస్తే?!?
వేచి చూద్దాం అని చాచివేత ధోరణితో ఉంటే ప్రమాదమే!మనం మాట్లాడింది వినలేకపోతున్నారంటే...దానిని తిరిగి ఉచ్ఛరించడమూ జరగదు.అందుకే... పిల్లలు పుట్టగానే వింటున్నారాలేదా అని చూడాలి... వినలేదనిపిస్తే వెంటనే వినిపించేప్రయత్నం చేయాలి!!


మనదేశంలో ప్రతి వెయ్యి మందిలో నలుగురు వినికిడి లోపంతో పుడుతున్నారు. పుట్టినప్పటికీ బాగానే ఉన్నప్పటికీ జీవనశైలి, పోషకాహార లోపం వంటి ఇతర కారణాల వల్ల నలభై దాటేటప్పటికి చెవి సమస్యలకు గురయ్యే వారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. గడచిన కాలంలో ఎక్కువమంది పోషకాహారలోపంతో వార్ధక్యంలో వినికిడి సమస్యలకు గురయ్యేవారు. ఇటీవల పెరుగుతున్న కేసుల్లో మారిన జీవనశైలి ప్రధానకారణంగా కనిపిస్తోంది. మేనరికపు వివాహాల ద్వారా పుట్టిన పిల్లల్లో కూడా వినికిడి లోపాలు కనిపిస్తున్నాయి. కాక్లియాలో ఉండే హెయిర్‌సెల్స్‌ తక్కువగా ఉండడం, ఒకవేళ తగినన్ని ఉన్నప్పటికీ అవి సరిగ్గా పనిచేయకపోవడం వలన వినికిడి లోపం కలుగుతుంది. ఇన్‌ఫెక్షన్‌ వంటి సాధారణ కారణాలతో వచ్చే లోపాలను మందుల వాడకం, చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. పుట్టుకతోనే చెవి నిర్మాణం లోపం ఉన్నవారికి, తీవ్రమైన వినికిడి సమస్యలకు, వినికిడి మెషీన్‌తో ఫలితం లేని వారికి, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయం.

పిల్లల్లో వినికిడి లోపాన్ని త్వరగా గుర్తించడం ఎంత అవసరమో, వెంటనే వైద్యం చేయడమూ అంతే ముఖ్యం. ఎందుకంటే... పిల్లల మెదడు వికాసం మొదటి మూడేళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులోనే అన్ని రకాల శబ్దాలనూ వినాలి, వాటిని అర్థం చేసుకోవాలి. మాటలను తిరిగి పలకడానికి ప్రయత్నించాలి. అందుకే పుట్టిన వెంటనే వినికిడి పరీక్ష చేయడం, లోపం ఉంటే సరిదిద్దుకోవడం రెండూ చాలా కీలకం. ఇటీవల జీవనశైలిలో మార్పుల వల్ల పెద్దల్లోనూ వినికిడి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇలా పెద్దలకు వచ్చే వినికిడి సమస్యలకూ కాక్లియర్‌ సర్జరీ ఒక మంచి పరిష్కారం.

కాక్లియర్‌ శస్త్ర చికిత్స!
ఈఎన్‌టి నిపుణులు, ఆడియాలజిస్ట్‌ల సూచనమేరకు ఆటోస్కోపీ, ఆడియాలజీ పరీక్షలు, సైకలాజికల్‌ అసెస్‌మెంట్, స్పీచ్‌ అసెస్‌మెంట్, సిటిస్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షలు చేయాలి. అలాగే సర్జికల్‌ ప్రొఫైల్‌ పరిశీలించాలి. అవసరాన్ని బట్టి కంటి వైద్యులు, చిన్నపిల్లల వైద్యులను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. రేడియాలజిస్ట్, ఆనస్తిస్ట్‌లతో కూడిన బృందం సేవలు అవసరమవుతాయి. ఈ పరీక్షలు, అధ్యయనాల తర్వాత పేషెంటుకి కాక్లియర్‌ సర్జరీ చేయవచ్చా లేదా అనే నిర్ధారణకు రావడం జరుగుతుంది. సాధారణంగా వీటి అవసరం ఎవరెవరికి ఉంటుందంటే... n వినికిడి సమస్య రెండుచెవులలో 70–80 శాతం ఉన్నవారికి n వినికిడి మెషీన్‌ ద్వారా ఉపయోగం లేని వారికి n కాక్లియ, కాక్లియర్‌ నరం అభివృద్ధి చెందని వారికి n ఆడిటరీ న్యూరోపతి స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ ఉన్న వారికి

సర్జరీ తర్వాత!
సర్జరీ చేసి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ను అమర్చిన తర్వాత మూడు వారాలకు బయటి మెషీన్‌ను ఆన్‌ చేస్తారు. అప్పటి నుంచి అన్ని శబ్దాలూ చక్కగా వినిపిస్తాయి. పిల్లలకు అప్పటి వరకు భాష, మాటలను విన్న అనుభవం ఉండదు కాబట్టి ప్రతి శబ్దానికి ఆశ్చర్యంగా స్పందిస్తుంటారు. వారు అప్పుడే పుట్టిన బిడ్డతో సమానం అన్నమాట. వారికి ఆడిటరీ వెర్బల్‌ థెరపీ, మెషీన్‌ ప్రోగ్రామింగ్‌లో శిక్షణ ఇవ్వాలి. ఇంటి దగ్గర సాధన చేయడం ద్వారా విన్న మాటలను అర్థం చేసుకోవడం, ఉచ్ఛరించడం నేర్చుకుంటారు. మాటకు ప్రతిస్పందించడమూ నేర్చుకుంటారు. ఈ దశలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత త్వరగా మామూలు పిల్లలతో సమానమవుతారు.

వినికిడి వ్యవస్థ – చెవి నిర్మాణం!
బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి, వినికిడి నరం, ఆడిటరీ కార్టెక్స్‌ అనేవి ముఖ్యమైన భాగాలు. పిన్నా, చెవి రంధ్రం బయటకు కనిపిస్తాయి. వాటి లోపల కర్ణభేరి ఉంటుంది. అది కూడా బయటిచెవిలో భాగమే. మధ్య చెవి భాగాలు ఎముకల గొలుసు (ఆసిక్యూలార్‌చైన్‌) లోపలి చెవి భాగాలు కాక్లియ, వెస్టిబ్యూలార్‌ సిస్టమ్‌ ఉంటాయి. తర్వాత వినికిడి నరం, ఆడిటరీ కార్టెక్స్‌ వంటి క్లిష్టమైన భాగాలుంటాయి.

ఇలా వింటాం!
శబ్దతరంగాలు పిన్నాను తాకి, చెవిరంధ్రం ద్వారా కర్ణబేరికి ప్రకంపనలను చేరవేస్తాయి. ఆ ప్రకంపనలకు ఆసిక్యూలార్‌ చైన్‌ కదిలి కాక్లియాను స్పందింపచేస్తుంది. కాక్లియాలో ఉండే హెయిర్‌ సెల్స్‌ ఎలక్ట్రిక్‌ ఇంపల్షన్‌ను సృష్టించి వాటికి అనుసంధానమై ఉన్న ఆడిటరీ నర్వ్‌ ఫైబర్‌ను స్పందింపచేస్తాయి. ఆ తర్వాత ఆడిటరీ నర్వ్‌ ద్వారా శబ్దం మెదడులోని ఆడిటరీ కార్టెక్స్‌కు చేరుతుంది.

వినికిడి లోపాలెన్నెన్నో!
చెవి నిర్మాణాన్ని విభజించినట్లే వినికిడి లోపాలను కూడా వర్గీకరిస్తారు. బయటిచెవి, మధ్య చెవి లోపాలను కండక్టివ్‌ హియరింగ్‌ లాస్, లోపలిచెవి లోపాలను సెన్సరీన్యూరల్‌ హియరింగ్‌ లాస్, వినికిడి నరం, ఆ తరవాత భాగాల లోపాలతో వచ్చే వినికిడి సమస్యను ఆడిటరీ ప్రాసెసింగ్‌ డిజార్డర్‌ అంటారు.

నిర్ధారణ!
ప్రస్తుతం పుట్టిన వెంటనే శిశువులో వినికిడి వ్యవస్థ పనితీరు ఎలా ఉందోనని పరీక్షించే పరికరాలున్నాయి. ఈ పరీక్షను నియోనేటల్‌ హియరింగ్‌ స్క్రీనింగ్‌ అంటారు. మనదేశంలో కొన్ని హాస్పిటళ్లలో మాత్రమే ఓటో అకాస్టిక్‌ ఎమిషన్స్‌ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. n ఓటో అకాస్టిక్‌ ఏమిషన్స్‌ పరీక్షలో ఫెయిలైన పిల్లలకు ఆడిటరీ ఎవోక్డ్‌ పొటెన్షియల్స్, ఇంపీడెన్స్‌ ఆడియోమెట్రీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

కాక్లియర్‌ ఇంప్లాంట్‌ పనితీరిలా!
కాక్లియర్‌ ఇంప్లాంట్‌లో రెండు భాగాలుంటాయి. ఒకటి శస్త్ర చికిత్స చేసి చెవి లోపల అమర్చే సాధనం. మరొకటి చెవి బయట అమర్చే సౌండ్‌ ప్రాసెసర్‌. దీనిని స్పీచ్‌ ప్రాసెసర్‌ అని కూడా అంటారు. ఇందులో ఉండే మైక్రోఫోన్‌ శబ్దాలను గ్రహించి ప్రాసెసర్‌లోకి పంపిస్తుంది. ఆ శబ్దం ప్రాసెసర్‌ ద్వారా ప్రయాణించి కాయిల్‌ ద్వారా శబ్దతరంగాలుగా మారి లోపల ఉండే ఇంప్లాంట్‌లోని రిసీవర్‌కు చేరుతుంది. కాక్లియలో అమర్చిన ఎలక్ట్రోడ్‌ అరే లోని ఎలక్ట్రోడ్‌కు చేరిన శబ్దం ఫైబర్స్‌ను స్పందింపచేస్తుంది. దాంతో శబ్దాన్ని కచ్చితంగా వినగలుగుతారు.

డాక్టర్‌ ఇ.సి. వినయకుమార్‌
హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్
జూబ్లీ హిల్స్, హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement