రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు అక్షింతలు
ఆ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తే లేదు
ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వలేం
తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం
తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులతో మీకేం పనంటూ మాజీ ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఆ కేసులను మరో రాష్ట్రానికి బదలాయించే ప్రసక్తే లేదని, మహా అయితే ఈ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని కింది కోర్టుకు చెప్పగలమని స్పష్టం చేసింది.
అంతే తప్ప ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వలేమంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు కోరుతున్న నేపథ్యంలో, అసలు ఆ కేసులతో మీకేం సంబంధమని ఆయన్ని నిలదీసింది. వాదనలు వినిపించేందుకు సీఐడీ గడువు కోరడంతో విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీ‹Ùచంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక కోర్టు, హైకోర్టుల్లో చుక్కెదురు..
జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీఐడీ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్‌పై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా, జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఆ కోర్టు కొట్టేసింది. ఆ తరువాత హైకోర్టులో పిటిషన్ వేశారు.
హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు, ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమంటూ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది.
రాజకీయ విద్వేషంతోనే పిటిషన్
అనంతరం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రాజకీయపరమైన విద్వేషంతోనే రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారన్నారు. సీఐబీ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని తెలిపారు. ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కేసుల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) మరో కేసులో వాదనలు వినిపిస్తున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యంలో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment