నేడు సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ | Updates from the Supreme Court Hearing on Amaravati | Sakshi
Sakshi News home page

నేడు సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ

Published Thu, Dec 12 2024 9:36 AM | Last Updated on Thu, Dec 12 2024 11:06 AM

Updates from the Supreme Court Hearing on Amaravati

ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం  విచారణ చేపట్టనుంది.  

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని అని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని తెలిపింది. కేసు విచారణను ముగించాలని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. 


 
అయితే, ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అంటూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ ఖండించారు. 2019 డిసెంబర్‌ 18న జరిగిన అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌  రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రకటించారు. 

2019 డిసెంబర్‌ 18న జరిగిన అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌ 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని  2019 డిసెంబర్‌ 18న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్‌ క్యాపిటల్‌), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌) ఏర్పాటు చేసేందుకు వీలుందన్నారు. రాజధానిపై ప్రతిష్టాత్మక సంస్థలతో వేసిన కమిటీ నివేదిక రాగానే ఈ అంశాలపై చర్చించి పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధానిపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే?

రాజధాని ముసుగులో అంతా అవినీతే..
‘గత ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలు, మోసాలు, కుట్రలను మంత్రులు, సభ్యులు వివరించారు. స్కామ్‌ల గురించి ఆర్థిక మంత్రి బుగ్గన స్లయిడ్స్‌ కూడా చూపించారు. 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు కేవలం ఆరు నెలల కాలంలో 4,070 ఎకరాలను అప్పటి పాలకుల బినామీలు, బంధువులు ఏరకంగా తక్కువ రేటుకు కొన్నారు? ఎవరెవరు కొన్నారు? అనే అంశాలను పేర్లతో సహా  ప్రదర్శించారు. రాజధాని పేరుతో జరిగిన స్కామ్‌లు, అన్యాయాలు, చట్టాల ఉల్లంఘనలను సభ్యులు ధర్మాన, గుడివాడ అమర్నాథ్, మంత్రులు బొత్స, బుగ్గన రాజేంద్రనాథ్‌ తదితరులు ఆధారాలతో సహా వివరించారు. చంద్రబాబు.. రాజధాని అని ఒక ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అక్కడ ముందుగానే బినామీ పేర్లతో తక్కువ ధరతో భూములు కొన్నారు. తర్వాత అక్కడ రాజధాని అని ప్రకటించారు. ఆ తర్వాత ఆ భూముల రేట్లు పెంచుకునేందుకు ఏం చేశారో కూడా సభ్యులు వివరించారు.

ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి
ఈ పరిస్థితుల్లో వేసే ప్రతి అడుగూ ఆలోచించి, ఆచితూచి వేయాల్సిన అవసరం ఉంది. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయి. మనమూ మారాలి. సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టు వికేంద్రీకరణ అనేది ఉత్తమ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్‌ కు బహుశా మూడు క్యాపిటల్స్‌ వస్తాయేమో. ఇలా రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి ఆలోచనలు చేయడానికే పేరెన్నికగన్న నిపుణులతో, ప్రఖ్యాతి గాంచిన బీసీజీతో పాటు మరో కన్సల్టెన్సీని నియమించాం. ఈ సంస్థలు సుదీర్ఘంగా అన్ని విధాలా పరిశీలించి, పరిశోధించి నివేదిక వారం పది రోజుల్లో నివేదిక ఇవ్వనున్నాయి. అధికార వికేంద్రీకరణ దిశగా పలు సూచనలు, సలహాలు చేయనున్నాయి. నివేదిక ఫలానా విధంగా ఉండాలని మేమైతే చెప్పలేదు. ఈ నివేదికలు రాగానే పరిశీలించి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ అంశంలో స్పష్టత ఇచ్చినట్లే భావిస్తున్నా. ఇంత కంటే మంచి సలహా ఉంటే.. ఇస్తే తప్పకుండా తీసుకుంటాం’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి తేవాలి?
రాజధానిలో కేవలం 20 కిలోమీటర్ల పరిధిలో కనీస మౌలిక సదుపాయాలకు రూ.1.09 లక్షల కోట్లు అవుతుందన్నది బాబు లెక్క. ఇలా నిర్మిస్తూ పోతే వడ్డీతో కలిపి ఇది రూ.3 లక్షల కోట్లో.. 4 లక్షల కోట్లో ఖర్చయ్యే పరిస్థితి ఉంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అయిదేళ్లలో రూ.5,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇందులో రాజధాని బాండ్ల పేరుతో 10.35 శాతం వడ్డీకి కూడా అప్పు తెచ్చారు. ఈ అప్పులకు ఏటా రూ.700 కోట్లు వడ్డీ చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు ఇన్నిన్ని వేల కోట్లు కావాలని లెక్కలున్నాయి. పలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో రాజధాని నిర్మాణం కోసం అంటూ లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎక్కడి నుంచి తేవాలి? ఈ పరిస్థితిలో రాజధానిలో కేవలం 20 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు, కరంటు లాంటి పనుల కోసం రూ.లక్ష ఖర్చు పెట్టడం అవసరమా?

► చంద్రబాబు తన హయాంలో రాజధానిని డిసైడ్‌ చేశారు. ఆయన (చంద్రబాబు)లెక్క ప్రకారం 53 వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే.. ఎకరాకు కనీస మౌలిక సదుపాయాల కోసం రూ.2 కోట్ల లెక్కన రూ.లక్షా ఆరు వేల కోట్లవుతుందని తేల్చారు. ఇది కనీస మౌలిక వసతుల ఏర్పాటుకు మాత్రమే. రాష్ట్రంలో ఇతరత్రా అభివృద్ధి పనులు, ఖర్చుల మాటేమిటి?

►రాజధాని కోసం లక్ష కోట్లకు పైగా ఎక్కడ నుంచి తేవాలి? అప్పు తెస్తే దానికి వడ్డీ ఎంత అవుతుంది? వడ్డీ అయినా కట్టే పరిస్థితిలో రాష్ట్రం ఉందా? నాకు కూడా రాజధాని కట్టాలనే ఉంది. కానీ లక్ష కోట్లు ఎక్కడ నుంచి తేవాలి? ఒకవేళ రూ. లక్ష కోట్లు తెచ్చినా దానిని ఎక్కడ ఖర్చు పెట్టాలని కూడా ఆలోచించాలి.

►ఈ పరిస్థితిలో వికేంద్రీకరణే మేలు. పెద్దగా ఖర్చు పెట్టకుండానే రాజధాని సమస్యలు కొలిక్కి వస్తాయి. విశాఖపట్నం ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన నగరం. అడ్మినిస్ట్రేటివ్‌ రాజధానిగా సరిపోతుంది. రోడ్లు కాస్త వెడల్పు చేసి, ఒక మెట్రో రైలు తీసుకొస్తే చాలు. అటు కర్నూల్లో జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ ఉంటుంది. లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ ఇక్కడే (అమరావతి) ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. 

చదవండి : ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement