జిల్లాలో చెవిటితనంతో బాధపడుతున్న రోగులు అనేక మంది ఉన్నారు. వీరంతా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. జీజీహెచ్‌లో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామంటూ ప్రైవేటు డాక్టర్ ముందుకొచ్చారు. కానీ జీజీహెచ్ ఉన్నతాధికారులకే మనసు రావడం లేదు. ఎన్‌టీఆర్ వైద్యసేవ ద్వారా ఆపరేషన్లకు అవకాశం ఉన్నా.. అందిపుచ్చుకోవాలనే శ్రద్ధ అంతకన్నా ఉండడం లేదు. బధిరుల వేదన వారి చెవికెక్కడం లేదు.
గుంటూరు మెడికల్: పుట్టుకతో వినికిడి లోపం సమస్య ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తానని గుంటూరుకు చెందిన ఓ ప్రైవేటు డాక్టర్ ముందుకు వచ్చినా గుంటూరు జీజీహెచ్ అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావునిస్తోంది. ప్రైవేటు ప్రాక్టీస్ చేతినిండా ఉన్నా జీజీహెచ్‌కు వచ్చే పేదలకు తన వంతు సాయం చేయాలని ఆ డాక్టర్ జీజీహెచ్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఆస్పత్రి అధికారులు చొరవ చూపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పుట్టుకతో వినికిడి సమస్య ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ప్రతి వెయ్యిమంది పిల్లల్లో ఆరుగురు చెవుడు సమస్యతో పుడుతున్నారు. మేనరిక వివాహాల వల్ల పిల్లలకు చెవుడు సమస్య వస్తుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. చెవుడు సమస్య ఉన్న పిల్లలకు ఐదేళ్లలోపు ఆపరేషన్ చేస్తేనే ఫలితం ఉంటుంది. పుట్టుకతో చెవుడు ఉన్న పిల్లలకు ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కేజీహెచ్, హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసేవారు. రాష్ట్ర విభజన అనంతరం విశాఖపట్నంలో ఆపరేషన్లు నిలిపివేయడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు జరగక పిల్లలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నాలుగుచోట్ల మాత్రమే కాక్లియార్ ఇంప్లాంట్ ఆపరేషన్లు డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ పథకం ద్వారా ఉచితంగా చేస్తున్నారు.
రాష్ట్ర విభజన పిదప ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొట్టమొదటిసారిగా 2017లో గుంటూరు జీజీహెచ్‌లో ఆపరేషన్లు చేసేందుకు ఎన్‌టిఆర్ వైద్యసేవ పథకం అధికారులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాని వైద్య సౌకర్యాల కొరత, అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆపరేషన్లు ప్రారంభం కాలేదు. మూడునెలల క్రితమే విశాఖపట్నం కేజీహెచ్‌లో ఆపరేషన్లు ప్రారంభించారు. కాని ఏడాదికి పైగా జీజీహెచ్ అధికారులు ఆపరేషన్లు ప్రారంభించకుండా నిమ్మకునీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావునిస్తోంది. ఆపరేషన్లు ప్రారంభిస్తే ఎన్‌టిఆర్ వైద్యసేవ పథకం ద్వారా వైద్యులకు పారితోషికాలు రావడంతో పాటుగా ఆస్పత్రి అభివృద్ధికి నిధులు సైతం వస్తాయి. రాష్ట్ర విభజన పిదప రాజధాని ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ అవతరించడంతో జీజీహెచ్‌కు వచ్చే రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. రాజధాని ఆస్పత్రిలో కాక్లియర్ ఆపరేషన్లు చేయకపోవటంపై విమర్శలు వస్తున్నాయి.
ముందుకొచ్చిన డాక్టర్ సుబ్బారాయుడు...
గుంటూరు జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులకు కార్పొరేట్ వైద్యసేవలను అందించాలనే సదాశయంతో గత ఏడాది గుంటూరు నగరానికి చెందిన రాధికారాయుడు ఈఎన్‌టీ ఆస్పత్రి నిర్వాహకులు, ఈఎన్‌టీ వైద్య నిపుణుడు డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు ముందుకొచ్చారు. ఈఎన్‌టీ వైద్య నిపుణుడిగా 16 ఏళ్లుగా గుంటూరులో ఈయన వైద్యసేవలను అందిస్తున్నారు. సాహి అనే కార్యక్రమం ద్వారా మూడేళ్లుగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్ సుబ్బారాయుడు ‘చెవి అండ్ శ్రవణ సంరక్షణ’ అనే ట్రస్ట్ ద్వారా గుంటూరు జీజీహెచ్‌లో ‘ఇన్‌సోర్స్ పద్ధతిలో’ ఆపరేషన్లు చేసేందుకు 2017 మార్చిలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఏడాదిగా వైద్య సౌకర్యాలపైదృష్టి పెట్టడం లేదు
కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించేందుకు వైద్యుడు ముందుకొచ్చినా జీజీహెచ్ అధికారులు అందుకు తగిన వైద్య సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల ఆస్పత్రిలో ఏడాదిగా ఆపరేషన్లు ప్రారంభం కాలేదు. గత ఏడాది జూన్‌లో డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ పథకం జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వడ్లమూడి శ్రీనివాసరావు, డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ హైమావతి ఆపరేషన్లు చేసేందుకు ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. 2017 జూలై నుంచి ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసేందుకు ఓపీ వైద్యసేవలను ప్రారంభిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు వెల్లడించారు. ఆపరేషన్లు చేస్తామని మాట ఇచ్చి ఏడాది అయింది. కాని నేటివరకు ఓపీ వైద్యసేవలను ప్రారంభించకుండా మిన్నకుండిపోవడం జీజీహెచ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
డాక్టర్ వైఎస్ చొరవతోనే...
సుమారు ఎనిమిది లక్షల ఖరీదుచేసే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు నిరుపేదలకు అందించాలనే మంచి ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకంలో ఈ ఆపరేషన్లు చేర్చారు. పుట్టుకతో చెవుడు సమస్య ఉండి మాటలు రాని అనేకమంది నిరుపేదల చిన్నారులు ఈ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్నారు. ఎన్‌టీఆర్ వైద్యసేవ పథకంలో ఆపరేషన్లు చేసుకునే సౌకర్యం ఉన్నా జీజీహెచ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆస్పత్రి అధికారులు చొరవ చూపించి గుంటూరు జీజీహెచ్‌లో నిరుపేదలకు ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
తనిఖీ చేసే కమిటీదే ఆలస్యం
జీజీహెచ్‌లో ఆపరేషన్లు ప్రారంభించేందుకు ఎన్‌టీఆర్ వైద్యసేవ వైద్య బృందం తనిఖీలు చేసి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో కమిటీని తనిఖీలు చేసేందుకు రావాలని కోరాం. రెండు రోజుల క్రితం ఆపరేషన్లు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మళ్లీ లేఖ రాశాం.– డాక్టర్ డీఎస్ రాజునాయుడు,జీజీహెచ్ సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment