free surgery
-
పేద కుటుంబంలో వెలుగు నింపారు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): పుట్టుకతోనే బైలియరీ అట్రేజియా (పిత్తవాహిక మూసుకుపోవడం)తో బాధపడుతున్న 9 నెలల చిన్నారికి అత్యం త ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా చేశారు. సోమవారం కిమ్స్ కాలేయ విభాగపు అధిపతి డాక్టర్ రవిచంద్ సిద్దాచారి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా తిరుమలగిరి గ్రామానికి చెందిన శంకర్, శోభారాణి దంపతులకు పుట్టిన పాపకు నెల రోజులకే కామెర్లు వచ్చాయి. నగరంలోని ఓ ఆస్పత్రిలో పాపకు శస్త్ర చికిత్స చేసినా కామెర్లు తగ్గలేదు. పైగా కాలేయం విఫలమవుతున్న లక్షణాలు కనిపించాయి. దీంతో 2 నెలల క్రితం తల్లిదండ్రులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి పాపను తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి బైలియరీ అట్రేజియాతో బాధపడుతోందని గుర్తించారు. దీనికి కాలేయ మార్పిడే పరిష్కారమని సూచించారు. బిడ్డకు కాలేయం ఇచ్చేందుకు తల్లి ముందుకొచ్చినా శస్త్ర చికిత్సకు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిసి దంపతులిద్దరికీ దిక్కుతోచకుండా పోయింది. వీరి పరిస్థితిని గమనించిన ఆస్పత్రి యాజమాన్యం ఉచితంగా సర్జరీ చేసింది. కోలుకున్నాక చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. -
చెవికెక్కడం లేదు!
జిల్లాలో చెవిటితనంతో బాధపడుతున్న రోగులు అనేక మంది ఉన్నారు. వీరంతా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. జీజీహెచ్‌లో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామంటూ ప్రైవేటు డాక్టర్ ముందుకొచ్చారు. కానీ జీజీహెచ్ ఉన్నతాధికారులకే మనసు రావడం లేదు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆపరేషన్లకు అవకాశం ఉన్నా.. అందిపుచ్చుకోవాలనే శ్రద్ధ అంతకన్నా ఉండడం లేదు. బధిరుల వేదన వారి చెవికెక్కడం లేదు. గుంటూరు మెడికల్: పుట్టుకతో వినికిడి లోపం సమస్య ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తానని గుంటూరుకు చెందిన ఓ ప్రైవేటు డాక్టర్ ముందుకు వచ్చినా గుంటూరు జీజీహెచ్ అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావునిస్తోంది. ప్రైవేటు ప్రాక్టీస్ చేతినిండా ఉన్నా జీజీహెచ్‌కు వచ్చే పేదలకు తన వంతు సాయం చేయాలని ఆ డాక్టర్ జీజీహెచ్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఆస్పత్రి అధికారులు చొరవ చూపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పుట్టుకతో వినికిడి సమస్య ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ప్రతి వెయ్యిమంది పిల్లల్లో ఆరుగురు చెవుడు సమస్యతో పుడుతున్నారు. మేనరిక వివాహాల వల్ల పిల్లలకు చెవుడు సమస్య వస్తుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. చెవుడు సమస్య ఉన్న పిల్లలకు ఐదేళ్లలోపు ఆపరేషన్ చేస్తేనే ఫలితం ఉంటుంది. పుట్టుకతో చెవుడు ఉన్న పిల్లలకు ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కేజీహెచ్, హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసేవారు. రాష్ట్ర విభజన అనంతరం విశాఖపట్నంలో ఆపరేషన్లు నిలిపివేయడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు జరగక పిల్లలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో నాలుగుచోట్ల మాత్రమే కాక్లియార్ ఇంప్లాంట్ ఆపరేషన్లు డాక్టర్ ఎన్టిఆర్ వైద్యసేవ పథకం ద్వారా ఉచితంగా చేస్తున్నారు. రాష్ట్ర విభజన పిదప ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొట్టమొదటిసారిగా 2017లో గుంటూరు జీజీహెచ్‌లో ఆపరేషన్లు చేసేందుకు ఎన్టిఆర్ వైద్యసేవ పథకం అధికారులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాని వైద్య సౌకర్యాల కొరత, అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆపరేషన్లు ప్రారంభం కాలేదు. మూడునెలల క్రితమే విశాఖపట్నం కేజీహెచ్‌లో ఆపరేషన్లు ప్రారంభించారు. కాని ఏడాదికి పైగా జీజీహెచ్ అధికారులు ఆపరేషన్లు ప్రారంభించకుండా నిమ్మకునీరెత్తినట్లు కూర్చుండిపోవడం విమర్శలకు తావునిస్తోంది. ఆపరేషన్లు ప్రారంభిస్తే ఎన్టిఆర్ వైద్యసేవ పథకం ద్వారా వైద్యులకు పారితోషికాలు రావడంతో పాటుగా ఆస్పత్రి అభివృద్ధికి నిధులు సైతం వస్తాయి. రాష్ట్ర విభజన పిదప రాజధాని ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ అవతరించడంతో జీజీహెచ్‌కు వచ్చే రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. రాజధాని ఆస్పత్రిలో కాక్లియర్ ఆపరేషన్లు చేయకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. ముందుకొచ్చిన డాక్టర్ సుబ్బారాయుడు... గుంటూరు జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులకు కార్పొరేట్ వైద్యసేవలను అందించాలనే సదాశయంతో గత ఏడాది గుంటూరు నగరానికి చెందిన రాధికారాయుడు ఈఎన్టీ ఆస్పత్రి నిర్వాహకులు, ఈఎన్టీ వైద్య నిపుణుడు డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు ముందుకొచ్చారు. ఈఎన్టీ వైద్య నిపుణుడిగా 16 ఏళ్లుగా గుంటూరులో ఈయన వైద్యసేవలను అందిస్తున్నారు. సాహి అనే కార్యక్రమం ద్వారా మూడేళ్లుగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్ సుబ్బారాయుడు ‘చెవి అండ్ శ్రవణ సంరక్షణ’ అనే ట్రస్ట్ ద్వారా గుంటూరు జీజీహెచ్‌లో ‘ఇన్‌సోర్స్ పద్ధతిలో’ ఆపరేషన్లు చేసేందుకు 2017 మార్చిలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏడాదిగా వైద్య సౌకర్యాలపైదృష్టి పెట్టడం లేదు కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించేందుకు వైద్యుడు ముందుకొచ్చినా జీజీహెచ్ అధికారులు అందుకు తగిన వైద్య సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల ఆస్పత్రిలో ఏడాదిగా ఆపరేషన్లు ప్రారంభం కాలేదు. గత ఏడాది జూన్‌లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వడ్లమూడి శ్రీనివాసరావు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ హైమావతి ఆపరేషన్లు చేసేందుకు ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. 2017 జూలై నుంచి ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసేందుకు ఓపీ వైద్యసేవలను ప్రారంభిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు వెల్లడించారు. ఆపరేషన్లు చేస్తామని మాట ఇచ్చి ఏడాది అయింది. కాని నేటివరకు ఓపీ వైద్యసేవలను ప్రారంభించకుండా మిన్నకుండిపోవడం జీజీహెచ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. డాక్టర్ వైఎస్ చొరవతోనే... సుమారు ఎనిమిది లక్షల ఖరీదుచేసే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు నిరుపేదలకు అందించాలనే మంచి ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకంలో ఈ ఆపరేషన్లు చేర్చారు. పుట్టుకతో చెవుడు సమస్య ఉండి మాటలు రాని అనేకమంది నిరుపేదల చిన్నారులు ఈ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో ఆపరేషన్లు చేసుకునే సౌకర్యం ఉన్నా జీజీహెచ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆస్పత్రి అధికారులు చొరవ చూపించి గుంటూరు జీజీహెచ్‌లో నిరుపేదలకు ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. తనిఖీ చేసే కమిటీదే ఆలస్యం జీజీహెచ్‌లో ఆపరేషన్లు ప్రారంభించేందుకు ఎన్టీఆర్ వైద్యసేవ వైద్య బృందం తనిఖీలు చేసి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది డిసెంబర్లో కమిటీని తనిఖీలు చేసేందుకు రావాలని కోరాం. రెండు రోజుల క్రితం ఆపరేషన్లు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మళ్లీ లేఖ రాశాం.– డాక్టర్ డీఎస్ రాజునాయుడు,జీజీహెచ్ సూపరింటెండెంట్ -
దయచేసి ఈసడించుకోవద్దు
సనత్‌నగర్: విధి ఆడిన నాటకంలో అగ్ని వారి దేహాన్ని దహిస్తే.. ఇది చాలదన్నట్టు సమాజం వారి గుండెల్లో ‘మంటలు’ రేపుతోంది. అది చాలదన్నట్టు ముద్దగా మారిన ఆ శరీరాన్ని చూపులతోనే వెలివేస్తోంది. బడిలో తోటి పిల్లలు.. కళాశాలలో సహ విద్యార్థులు.. హాస్టల్లో రూమ్మేట్స్.. ఉద్యోగానికి వెళ్లినా.. అన్నిచోట్లా ‘దూరం’గాచూసేవారే. ఇలా అవమానాల భారంతో బరువెక్కిన హృదయాలెన్నో. మానసికంగా కుంగి కృశించిపోతున్నఆ మనసులు ఆత్మీయత కోసం ఇంటి నాలుగు గోడల మధ్యే పరితపిస్తున్నాయి. అలాంటి వారికి నేనున్నానంటూ భరోసాగా నిలుస్తోంది ‘బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్’ సంస్థ. అలాంటి వారికి అండగా ఉంటున్నారు సంస్థనిర్వాహకురాలు నిహారి మండలి. ‘బర్న్స్ టు షైన్’ (కాలిన సంఘటన నుంచి ప్రకాశవంతమైన జీవితంలోకి)నినాదంతో చైతన్య స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కాలిన గాయాలకంటే.. సమాజం చేసిన/ చేస్తోన్న గాయాలకుఔషధమవుతున్నారు. గాయపడ్డ హృదయాల్లో అడుగంటిపోతోన్న ఆత్మవిశ్వాసానికి ఉపిరిలూదుతున్నారు. సంస్థ ఆవిర్భావం ఇలా.. కృష్ణాజిల్లా అవనిగడ్డ సమీపంలోని పులిగడ్డ ప్రాంతానికి చెందిన మండలి శేషగిరి, ఊర్మిల దంపతుల కుమార్తె నిహారికి ఇంటర్మీడియెట్ పూర్తికాగానే వివాహం చేశారు. కొద్ది కాలానికే తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలకు తీవ్ర మనస్తాపానికి గురైన ఇమె 2009లో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఆమె ఆ సమయంలో ప్రాణాలతో అయితే బయటపడింది గానీ, ఆమె శరీరం ముద్దలా మారిపోయింది. ఎందుకు బతికానా? అన్న దీనావస్థలో ఉన్న నిహారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యాన్నిచ్చారు. జీవితంలో వచ్చిన కష్టాలకు చావే పరిష్కారం కాదని.. పోరాటమని తెలియజెప్పారు. ఆ తర్వాత వారిచ్చిన ధైర్యంతో డిగ్రీ పూర్తి చేసింది. తన జీవితంలో ఎదురైన అనుభావాన్నే దారంగా మార్చుకుని కాలిన గాయాలకు సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్తీసుకుంది. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా చీదరింపులే ఎదురయ్యాయి. ఆఖరికి హాస్టల్లో ఉండే రూమ్మేట్స్ కూడా. ఉద్యోగం కోసం పలుచోట్ల ఇంటర్వ్యూలకు హాజరైతే ముఖాకృతిని చూసి తిరస్కరించిన వారే అందరూ. చివరకు దిల్సుఖ్నగర్ కొత్తపేట ప్రాంతంలోని రీడిఫైన్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ నిర్వాహకుడు, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హరికిరణ్ చేకూరి ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పించారు. సమాజం నుంచి ఎదురవుతున్న అవమానాలకు తనలాంటి వారు ఎవరూ కుంగిపోపోకుండా, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని సంకల్పించుకున్న నిహారి 2014లో ‘బర్న్స్ సర్వైవర్ మిషన్ సేవియర్’ సంస్థను నెలకొల్పారు. సంస్థ చేపట్టిన/చేపట్టేకార్యక్రమాలు.. గ్యాస్ పేలడం, చీరకొంగు పొయ్యిలో పడడం, ఎలక్ట్రికల్ షాక్, వేడి నీళ్లు, పాలు మీద పడ్డ సమయాల్లో దేహం/ అవయవాలు కాలిపోయి వికృతంగా తయారవుతాయి. ఈ సమయంలో వారు ఇంటి నుంచి సమజాంలోకి వచ్చేలా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలను నిహారి తన సంస్థ ద్వారా చేపడుతున్నారు. ముఖ్యంగా కాలిన గాయాలతో అంగవైకల్యం పొందిన బాధితుల కోసం ఉచిత శస్త్ర చికిత్సా శిబిరాలను నిర్వహిస్తున్నారు. 2015లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాలికట్ బ్రాంచ్, కేరళ ప్లాస్టిక్ సర్జన్ అసోసియేషన్ సహకారంతో కేరళలో ఉచిత ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహించి 24 మందికి శస్త్ర చికిత్స చేశారు. కాలిన గాయాల కారణంగా వైకల్యంతో బాధపడుతున్న వారు సర్జరీ ద్వారా శరీరాకృతిని తిరిగి పొందవచ్చని తెలియని వారికి విస్తృతమైన అవగాహన కల్పించేందుకు సైకిల్ రైడింగ్, ఫ్యాషన్ షో, బైక్ రైడింగ్, బెలూన్స్ ఫ్లయింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో బాధితులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. తనలా ఎవరికీ పరిస్థితి రాకూడదని అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ప్రమాదానికి గురైతే ధైర్యాన్నిచ్చి అందుబాటులో ఉన్న చికిత్స గురించి చెబుతున్నారు. కాలిన గాయాలకు చికిత్స చేసుకోని వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఓ టీవీ ఛానల్లో ప్రసారమవుతున్న మంచులక్ష్మి షో ‘నేనుసైతం’ కార్యక్రమానికి ఇద్దరు బాధితులను తీసుకెళ్లి వారికి ఆర్థిక సాయం అందేలా చూశారు. బాధితులకు ఉచితంగా శస్త్రచికిత్సలు కాలిన గాయాలతో సమాజానికి దూరంగా ఉం టున్న వారికి సాయం చేసేందుకు నిహారి నడుం బిగించారు. ఈ నెల 23 నుంచి 28 వరకు మరోసారి ఉచిత శస్త్ర చికిత్స క్యాంప్ తలపెట్టారు. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల నుంచి రెండు వందలకు పైగా రిజిస్ట్రేషన్లు రాగా రీడిఫైన్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ డాక్టర్ హరికిరణ్ చేకూరి సహకారంతో 15 మందికి ఈ శస్త్ర చికిత్సలు చేసేందుకు నిర్ణయించారు. దాతలూ సహకరించండి.. శస్త్ర చికిత్స వరకు ఉచితంగా చేస్తున్నా.. చికిత్సకు అవసరమయ్యే పరికరాలు, మందులు ఇతర సర్జికల్ పరికరాలు ఖర్చుతో కూడుకున్నవి. అయినప్పటికీ పేదలకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామని నిహారి చెబుతున్నారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ. 30 వేల వరకు ఖర్చవుతుంది. ఇందుకోసం ఎవరైనా దాతలు ముందుకువచ్చి సహకారం అందిస్తారని ఆమె కోరుతున్నారు. అయితే శస్త్ర చికిత్సల కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్యను బట్టి ఏడాదికి రెండు మూడు క్యాంప్‌లు నిర్వహించాలని భావిస్తున్నారు. దయచేసి ఈసడించుకోవద్దు విధివశాత్తూ కాలిన గాయాలతో వికృతంగా మారిన వారికి అండగా నిలవక పోయినా ఫర్వాలేదు.. కానీ దయజేసి ఈసడించుకోవద్దు. మాటలతో మానసికంగా బాధపెట్టొద్దు. బాధితులకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నాలుగు గోడల నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా బతకాలి. బర్న్స్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి వెలుగు దిశగా సాగాలన్నదే మా సంస్థ తాపత్రయం. అందుకోసం వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టి బాధితులకు అండగా నిలబడతాం. – నిహారి సాయం చేయాలనుకుంటే ఫోన్ 7680974918, neehaari.mandali@gmail.com మెయిల్లో సంప్రదించవచ్చు. -
సిల్వర్ జూబ్లీ వేడుకలకు సన్నద్ధం
నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే మహోన్నత లక్ష్యంతో 1986లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఏర్పాటుకు పునాది రాళ్లు వేశారు. 1995 నుంచి స్విమ్స్ ఆస్పత్రి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకులకు సిద్ధమైంది. మహతీ వేదికగా సోమవారం సాయంత్రం 5.15 గంటలకు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. తిరుపతి (అలిపిరి): 2001లో ప్రాణదానం ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఉచిత శస్త్ర చికిత్స సేవలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించడంతో స్విమ్స్‌లో నిరుపేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీæ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ 38 విభాగాల్లో 500 మంది వైద్యులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నిత్యం 1500 నుంచి 2 వేల మందికి పైగా ఓపీ సేవలు పొందుతున్నారు. 898 పడకలతో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తోంది. విద్యా నిలయం.. స్విమ్స్‌లో యూజీ, పీజీ మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 1,765 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ సంఖ్య రాబోయే రెండేళ్లలో 2 వేలకు పెరిగే అవకాశం ఉంది. యూనివర్సిటీలో 2,218 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ప్రతి ఏటా 540 మంది 66 కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. 2014లో స్విమ్స్ ఆధ్వర్యంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రారంభమైంది. హాజరుకానున్న ప్రముఖులు: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. -
మంత్రికి వాట్సప్ మెసేజ్.. టెన్షన్ ఖతమ్
ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తన సోదరికి అత్యవరంగా ఆపరేషన్ చేయాలన్నారు. అది కూడా యశోద ఆస్పత్రిలో. ఖర్చు సుమారు నాలుగు లక్షల వరకు వస్తుందని అన్నారు. తనది అంత పెట్టుకోగల ఆర్థిక స్థోమత కాదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో.. రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన గుగ్గిళ్ల రాజు.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వాట్సప్‌లో ఒక మెసేజ్ పెట్టాడు. అందులో తన పరిస్థితిని వివరించి, ఆస్పత్రి వాళ్లతో ఏమైనా మాట్లాడే వీలుంటే చూడాలని కోరాడు. ఒక అరగంటలో స్పందించిన కేటీఆర్.. తాను తప్పకుండా చూస్తానని రెండే రెండు ముక్కలతో సమాధానం ఇచ్చారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహించేది కూడా రాజన్న జిల్లా సిరిసిల్లకే కావడంతో రాజు ధైర్యం చేసి మెసేజ్ పెట్టాడు. ఆయన ఏం చేశారో ఏమో తెలియదు గానీ, తమ వద్ద రూపాయి కూడా తీసుకోకుండా ఆస్పత్రి వర్గాలు తమ సోదరికి ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టారని రాజు తెలిపాడు. బహుశా కేటీఆర్ కార్యాలయం నుంచి ఆస్పత్రికి ఫోన్ చేసి ఉంటారని, డబ్బుల గురించి అడగకుండా ఆపరేషన్ చేయమని చెప్పి ఉండొచ్చని రాజు భావిస్తున్నాడు. తర్వాతి రోజు ఉదయం తనను సచివాలయానికి వచ్చి కలవమన్నారని, ఖర్చుల విషయం తాము చూసుకుంటామని అధికారులు చెప్పారని వివరించాడు. తనకు వేరే అవకాశం ఏమీ లేకపోవడం వల్లే తాను కేటీఆర్‌కు వాట్సప్‌లో సందేశం పంపానని, ఇప్పుడు తన సోదరి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని రాజు ఆనందబాష్పాలతో చెప్పాడు.