బాధితులతో ఫ్యాషన్ షో..
సనత్‌నగర్: విధి ఆడిన నాటకంలో అగ్ని వారి దేహాన్ని దహిస్తే.. ఇది చాలదన్నట్టు సమాజం వారి గుండెల్లో ‘మంటలు’ రేపుతోంది. అది చాలదన్నట్టు ముద్దగా మారిన ఆ శరీరాన్ని చూపులతోనే వెలివేస్తోంది. బడిలో తోటి పిల్లలు.. కళాశాలలో సహ విద్యార్థులు.. హాస్టల్లో రూమ్మేట్స్.. ఉద్యోగానికి వెళ్లినా.. అన్నిచోట్లా ‘దూరం’గాచూసేవారే. ఇలా అవమానాల భారంతో బరువెక్కిన హృదయాలెన్నో. మానసికంగా కుంగి కృశించిపోతున్నఆ మనసులు ఆత్మీయత కోసం ఇంటి నాలుగు గోడల మధ్యే పరితపిస్తున్నాయి. అలాంటి వారికి నేనున్నానంటూ భరోసాగా నిలుస్తోంది ‘బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్’ సంస్థ. అలాంటి వారికి అండగా ఉంటున్నారు సంస్థనిర్వాహకురాలు నిహారి మండలి. ‘బర్న్స్ టు షైన్’ (కాలిన సంఘటన నుంచి ప్రకాశవంతమైన జీవితంలోకి)నినాదంతో చైతన్య స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కాలిన గాయాలకంటే.. సమాజం చేసిన/ చేస్తోన్న గాయాలకుఔషధమవుతున్నారు. గాయపడ్డ హృదయాల్లో అడుగంటిపోతోన్న ఆత్మవిశ్వాసానికి ఉపిరిలూదుతున్నారు.
సంస్థ ఆవిర్భావం ఇలా..
కృష్ణాజిల్లా అవనిగడ్డ సమీపంలోని పులిగడ్డ ప్రాంతానికి చెందిన మండలి శేషగిరి, ఊర్మిల దంపతుల కుమార్తె నిహారికి ఇంటర్మీడియెట్ పూర్తికాగానే వివాహం చేశారు. కొద్ది కాలానికే తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలకు తీవ్ర మనస్తాపానికి గురైన ఇమె 2009లో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఆమె ఆ సమయంలో ప్రాణాలతో అయితే బయటపడింది గానీ, ఆమె శరీరం ముద్దలా మారిపోయింది. ఎందుకు బతికానా? అన్న దీనావస్థలో ఉన్న నిహారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యాన్నిచ్చారు. జీవితంలో వచ్చిన కష్టాలకు చావే పరిష్కారం కాదని.. పోరాటమని తెలియజెప్పారు. ఆ తర్వాత వారిచ్చిన ధైర్యంతో డిగ్రీ పూర్తి చేసింది. తన జీవితంలో ఎదురైన అనుభావాన్నే దారంగా మార్చుకుని కాలిన గాయాలకు సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్‌తీసుకుంది. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా చీదరింపులే ఎదురయ్యాయి. ఆఖరికి హాస్టల్‌లో ఉండే రూమ్మేట్స్ కూడా. ఉద్యోగం కోసం పలుచోట్ల ఇంటర్వ్యూలకు హాజరైతే ముఖాకృతిని చూసి తిరస్కరించిన వారే అందరూ. చివరకు దిల్‌సుఖ్‌నగర్ కొత్తపేట ప్రాంతంలోని రీడిఫైన్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ నిర్వాహకుడు, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హరికిరణ్ చేకూరి ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పించారు. సమాజం నుంచి ఎదురవుతున్న అవమానాలకు తనలాంటి వారు ఎవరూ కుంగిపోపోకుండా, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని సంకల్పించుకున్న నిహారి 2014లో ‘బర్న్స్ సర్వైవర్ మిషన్ సేవియర్’ సంస్థను నెలకొల్పారు.
సంస్థ చేపట్టిన/చేపట్టేకార్యక్రమాలు..
గ్యాస్ పేలడం, చీరకొంగు పొయ్యిలో పడడం, ఎలక్ట్రికల్ షాక్, వేడి నీళ్లు, పాలు మీద పడ్డ సమయాల్లో దేహం/ అవయవాలు కాలిపోయి వికృతంగా తయారవుతాయి. ఈ సమయంలో వారు ఇంటి నుంచి సమజాంలోకి వచ్చేలా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలను నిహారి తన సంస్థ ద్వారా చేపడుతున్నారు. ముఖ్యంగా కాలిన గాయాలతో అంగవైకల్యం పొందిన బాధితుల కోసం ఉచిత శస్త్ర చికిత్సా శిబిరాలను నిర్వహిస్తున్నారు. 2015లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాలికట్ బ్రాంచ్, కేరళ ప్లాస్టిక్ సర్జన్ అసోసియేషన్ సహకారంతో కేరళలో ఉచిత ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహించి 24 మందికి శస్త్ర చికిత్స చేశారు. కాలిన గాయాల కారణంగా వైకల్యంతో బాధపడుతున్న వారు సర్జరీ ద్వారా శరీరాకృతిని తిరిగి పొందవచ్చని తెలియని వారికి విస్తృతమైన అవగాహన కల్పించేందుకు సైకిల్ రైడింగ్, ఫ్యాషన్ షో, బైక్ రైడింగ్, బెలూన్స్ ఫ్లయింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో బాధితులను సైతం భాగస్వాములను చేస్తున్నారు. తనలా ఎవరికీ పరిస్థితి రాకూడదని అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ప్రమాదానికి గురైతే ధైర్యాన్నిచ్చి అందుబాటులో ఉన్న చికిత్స గురించి చెబుతున్నారు. కాలిన గాయాలకు చికిత్స చేసుకోని వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమవుతున్న మంచులక్ష్మి షో ‘నేనుసైతం’ కార్యక్రమానికి ఇద్దరు బాధితులను తీసుకెళ్లి వారికి ఆర్థిక సాయం అందేలా చూశారు.
బాధితులకు ఉచితంగా శస్త్రచికిత్సలు
కాలిన గాయాలతో సమాజానికి దూరంగా ఉం టున్న వారికి సాయం చేసేందుకు నిహారి నడుం బిగించారు. ఈ నెల 23 నుంచి 28 వరకు మరోసారి ఉచిత శస్త్ర చికిత్స క్యాంప్ తలపెట్టారు. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల నుంచి రెండు వందలకు పైగా రిజిస్ట్రేషన్లు రాగా రీడిఫైన్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ డాక్టర్ హరికిరణ్ చేకూరి సహకారంతో 15 మందికి ఈ శస్త్ర చికిత్సలు చేసేందుకు నిర్ణయించారు.
దాతలూ సహకరించండి..
శస్త్ర చికిత్స వరకు ఉచితంగా చేస్తున్నా.. చికిత్సకు అవసరమయ్యే పరికరాలు, మందులు ఇతర సర్జికల్ పరికరాలు ఖర్చుతో కూడుకున్నవి. అయినప్పటికీ పేదలకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామని నిహారి చెబుతున్నారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ. 30 వేల వరకు ఖర్చవుతుంది. ఇందుకోసం ఎవరైనా దాతలు ముందుకువచ్చి సహకారం అందిస్తారని ఆమె కోరుతున్నారు. అయితే శస్త్ర చికిత్సల కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్యను బట్టి ఏడాదికి రెండు మూడు క్యాంప్‌లు నిర్వహించాలని భావిస్తున్నారు.
దయచేసి ఈసడించుకోవద్దు
విధివశాత్తూ కాలిన గాయాలతో వికృతంగా మారిన వారికి అండగా నిలవక పోయినా ఫర్వాలేదు.. కానీ దయజేసి ఈసడించుకోవద్దు. మాటలతో మానసికంగా బాధపెట్టొద్దు. బాధితులకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నాలుగు గోడల నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా బతకాలి. బర్న్స్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి బయటపడి వెలుగు దిశగా సాగాలన్నదే మా సంస్థ తాపత్రయం. అందుకోసం వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టి బాధితులకు అండగా నిలబడతాం. – నిహారి
సాయం చేయాలనుకుంటే ఫోన్ 7680974918, neehaari.mandali@gmail.com మెయిల్‌లో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment