పెన్షనర్లకు కరువు భృతి
* ప్రస్తుత డీఆర్‌పై 3.144 శాతం పెంపు
* ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు
* ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం కరువు భృతి (డీఆర్) ప్రకటించింది. పెన్షనర్లకు ప్రస్తుతం 8.908 శాతం డీఆర్ అమల్లో ఉంది. దీనికి అదనంగా 3.144 శాతం కలిపి.. 12.052 శాతం డీఆర్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2015 జనవరి నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత వారంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు కరువు భత్యం ప్రకటిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెలువరించింది. తాజాగా పెన్షనర్లకు డీఆర్‌ను వర్తింపజేసింది. జనవరి నుంచి ఆగస్టు వరకు చెల్లించాల్సిన బకాయిలను సెప్టెంబర్ పెన్షన్‌తో కలిపి చెల్లించనుంది. అక్టోబర్ 1న బకాయిలతో పాటు పెరిగిన డీఆర్తో కూడిన పెన్షన్ వారి చేతికందుతుంది.
ప్రస్తుతం అందుకుంటున్న నెలసరి పెన్షన్ బట్టి ఎవరెవరికి ఎంత డీఆర్ పెరుగుతుందనే పట్టికను సైతం ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులతో పాటు పొందుపరిచింది. దీని ప్రకారం కనిష్టంగా నెలకు రూ.6,500 పెన్షన్ అందుకుంటున్న వారికి రూ.784 డీఆర్ జమ అవుతుంది. గరిష్టంగా రూ.61,392 పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులకు రూ.7,399 డీఆర్ వర్తిస్తుంది. 2013 జూలై 1 తర్వాత రిటైరై పెన్షన్ అందుకుంటున్న ఉద్యోగులతో పాటు.. అప్పటికే పెన్షన్ అందుకుంటున్న వారందరికీ ఈ డీఆర్ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అధికారులు, పెన్షన్ పేమెంట్ అధికారులు వచ్చే నెల బిల్లుల చెల్లింపులు చేయాలని ఆర్థిక శాఖ అన్ని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.