ఈసీఐఎల్.. ఈవీఎం సృష్టికర్త
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామి సంస్థ. నాలుగున్నర దశాబ్దాలుగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, ఎలక్ట్రానిక్స్ యంత్రాల తయారీలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన సంస్థ అది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పరిచయం చేసిన ఈసీఐఎల్.. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలోనే 48వ సంవత్సరంలోకి ప్రవేశించడం సందర్భోచితం. ఏప్రిల్ 11న ఈసీఐఎల్ ఆవిర్భావ దినం.
ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
ఈవీఎంల తయారీలో రికార్డ్
పారదర్శకతకు ప్రతిబింబంగా నిలిచే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రూపొందించిన ఈసీఐఎల్.. ఈ ఏడాది లక్షా 87 వేల యంత్రాలను అందజేసి చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. దశాబ్ద కాలంగా మొత్తం 7.4 లక్షల ఈవీఎంలను తయారుచేసి అగ్రగామి సంస్థగా నిలిచింది. గతంలో జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోను ఈసీఐఎల్ తయారు చేసిన ఓటింగ్ యంత్రాలనే వినియోగించారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ ఈ సంస్థ తయారుచేసిన ఓటింగ్ యంత్రాలనే వినియోగిస్తున్నారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంల వినియోగం మరింత పెరగనుంది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్(ఏడీయు), డిటాచబుల్ మెమొరీ మాడ్యుల్ (డీఎంఎం) వంటి పరికరాలతో రూపొందించే ఈవీఎంలు ఓటరు తీర్పును సురక్షితంగా కాపాడతాయి. ఈసారి ఈ యంత్రాలలో ‘పైవారు ఎవరూ కాదు’ (నోటా-నన్ ఆఫ్ ద ఎబోవ్) అనే మీటను కూడా తాజాగా ఏర్పాటు చేసింది. వీటిలో లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతోందీ సంస్థ. ఇందుకోసం చర్లపల్లిలో ఒక ప్రత్యేక కేంద్రాన్నే ఏర్పాటు చేశారు. ఈవీఎంల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ఈటీడీసీ) కూడా ఈసీఐఎల్‌కు అనుబంధంగా పని చేస్తోంది.