Economically backward people
-
పేద పిల్లల నేస్తం
బిహార్ విద్యాశాఖలో ఉన్నతాధికారి అయిన డాక్టర్ మంజు కుమారి రోహ్తాస్ జిల్లాలో, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన తిలౌతు బ్లాక్‌లో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. బ్లాక్ రిసోర్స్ సెంటర్(బీఆర్‌సి) ఇంచార్జిగా ఆమె తన అధికారిక విధులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా వెనకబడిన పిల్లలు చదువులో ముందుండేలా తన వంతు కృషి చేస్తోంది....ఆఫీసు సమయం అయిపోగానే అందరిలా ఇంటికి వెళ్లదు మంజు కుమారి. సమీపంలోని ఏదో ఒకగ్రామానికి వెళ్లి పేదపిల్లలకు పుస్తకాలు. బ్యాగులు, యూనిఫామ్ లాంటివి అందజేస్తుంది. దీని కోసం ఇతరులు ఇచ్చే డబ్బులు, స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా తన జీతం నుంచే కొంత మొత్తాన్ని వెచ్చిస్తుంది. మంజు కుమారికి సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. నాన్న శివశంకర్ షా తనకు స్ఫూర్తి.‘సామాజిక సేవకు సంబంధించి నాన్న ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. మా ఊరి పాఠశాల కోసం భూమిని ఉదారంగా ఇవ్వడమే కాదు అవసరమైన వనరులు అందించారు. ఇలాంటివి చూసి నాలో సామాజిక బాధ్యత పెరిగింది. ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది. సామాజిక సేవాకార్యక్రమాలు మరిన్ని చేసేలా నిరంతరం స్ఫూర్తినిస్తుంది’ అంటుంది మంజు కుమారి.రాంచీ యూనివర్శిటీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్... ఆ తర్వాత పీహెచ్డీ చేసిన మంజు డెహ్రీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దశాబ్దానికి పైగా హిందీ టీచర్‌గా పనిచేసింది. 2023లో బీ ఆర్సి ఇంచార్జిగా నియామకం అయింది. దీంతో సామాజిక సేవలో మరింత క్రియాశీలంగా పనిచేస్తోంది.స్థానిక పాఠశాలలను తనిఖీ చేస్తుంటుంది. పాఠశాల పరిశ్రుభతపై ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది మంజు కుమారి. ఆ సమయంలో గిరిజన గూడేలకు వెళ్లి ఎప్పుడూ స్కూల్‌కు వెళ్లని పిల్లలకు అక్షరాలు నేర్పించేది, పాఠాలు చెప్పేది. ఇది చూసి తల్లిదండ్రులు పిల్లలను రోజూ స్కూల్‌కు పంపించేవారు.‘ఇది నేను సాధించిన పెద్ద విజయం’ అంటుంది మంజు కుమారి. అయితే మంజుకుమారి ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అత్తమామలు, భర్త అభ్యంతరం చెప్పేవాళ్లు. మంజుకుమారిని సామాజిక సేవ దారి నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్లు. అయినప్పటికీ ఆమె పట్టుదలగా ముందుకు వెళ్లింది.సామాజిక బాధ్యత, నైతిక విలువలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మంజు కుమారి... ‘తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణి ప్రజలలో బాగా పెరిగింది. సామాజిక స్పృహ లోపిస్తుంది. సేవా స్ఫూర్తిని, సామాజిక నిబద్ధతను పునరుద్ధరించాలని ఆశిస్తున్నాను’ అంటుంది. -
పేద వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్య
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్), అణగారిన వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్య అందుబాటులో ఉండడం లేదని, ఫలితంగా వారు ఎంతో నష్టపోతున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) కచ్చితంగా అమలు చేసే దిశగా ఒక వాస్తవిక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని కేంద్ర, ప్రభుత్వాలకు శుక్రవారం సూచించింది. ఆన్లైన్ తరగతులు వినడానికి వీలుగా పేద విద్యార్థులకు పరికరాలు(స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్‌ట్యాప్‌లు) అందజేయాలని, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు 2020 సెప్టెంబర్ 18న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ గుర్తింపు పొందిన అన్–ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏను నిజం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అది జరగాలంటే పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్యను నిరాకరించరాదని స్పష్టం చేసింది. వారికి ఆన్లైన్ విద్య అందకపోతే సంపన్న కుటుంబాల పిల్లల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని, ఇరు వర్గాల మధ్య అంతరం పెరిగిపోతుందని తెలిపింది. మంచి తీర్పు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం అభినందించింది. -
ఓబీసీలకు 27%.. ఈడబ్ల్యూఎస్‌కు 10%
న్యూఢిల్లీ: అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో అఖిల భారత కోటా(ఏఐక్యూ) పథకంలో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2021–22) నుంచే ఇది అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న కీలకమైన ఈ నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఏటా వేలాది మంది యువత ప్రయోజనం పొందుతారు. వారికి మరిన్ని గొప్ప అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలో సామాజిక న్యాయానికి ఇదొక నూతన ఉదాహరణ’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. చరిత్రాత్మక నిర్ణయం ఆలిండియా కోటాలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్లు ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. ‘‘వెద్య విద్య రంగంలో కేంద్ర సర్కారు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అండర్ గ్రాడ్యుయేట్/పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ఓబీసీ విద్యార్థులు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 10 శాతం రిజర్వేషన్ పొందుతారు’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రిజర్వేషన్ అంశానికి ప్రభావవంతమైన పరిష్కారం కనిపెట్టాలని ప్రధాని మోదీ సోమవారం సంబంధిత మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏటా ఎంబీబీఎస్‌లో 1,500 మంది ఓబీసీ విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 2,500 మంది ఓబీసీ విద్యార్థులు, ఎంబీబీఎస్‌లో 550 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 1,000 మంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు లబ్ధి పొందుతారు. వెనుకబడిన తరగతులకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు తగిన రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది’’ అని పేర్కొంది. ఆరేళ్లలో 179 కొత్త మెడికల్ కాలేజీలు దేశంలో గత ఆరేళ్లుగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఏకంగా 56 శాతం పెరగడం విశేషం. 2014లో 54,348 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 2020 నాటికి ఆ సంఖ్య 84,649కి చేరింది. ఇక మెడికల్ పోస్టుగ్రాడ్యుయేట్(పీజీ) సీట్లు సైతం 80 శాతం పెరిగాయి. 2014లో కేవలం 30,191 పీజీ సీట్లు ఉండగా, 2020 నాటికి 54,275కు చేరుకున్నాయి. దేశంలో 2014–2020 కాలంలో179 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దేశంలో 558 మెడికల్ కాలేజీలు(289 ప్రభుత్వ, 269 ప్రైవేట్ కాలేజీలు) ఉన్నాయి. ఆలిండియా కోటా అంటే... అఖిల భారత కోటా(ఏఐక్యూ) పథకంలో దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులంతా ప్రయోజనం పొందవచ్చు. కేవలం సొంత రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లోని ఏఐక్యూ మెడికల్, డెంటల్ సీట్ల కోసం పోటీ పడవచ్చు. ఇది కేంద్ర పథకమే కాబట్టి ఓబీసీలు ఎవరన్నది కేంద్ర జాబితా ఆధారంగా ఖరారు చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలుత 1986లో ఆలిండియా కోటా పథకాన్ని ప్రవేశపెట్టారు. స్థానికతతో సంబంధం లేకుండా ప్రతిభను బట్టి ఇతర రాష్ట్రాల్లోని అత్యున్నత మెడికల్ కాలేజీల్లో సైతం చదువుకొనే అవకాశాన్ని కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ సీట్లలో 15 శాతం, మొత్తం పీజీ సీట్లలో 50 శాతం సీట్లను ఆలిండియా కోటా కిందకు చేరుస్తారు. వాస్తవానికి 2007 దాకా ఈ కోటా సీట్ల భర్తీకి ఎలాంటి రిజర్వేషన్లు ఉండేవి కావు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ 2007లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు సైతం 27 శాతం రిజర్వేషన్ ఇస్తూ 2007లో ‘కేంద్ర విద్యా సంస్థలు(ప్రవేశాల్లో రిజర్వేషన్) చట్టాన్ని’ అమల్లోకి తీసుకొచ్చింది. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ వంటి కేంద్ర విద్యా సంస్థల్లోని ఈ రిజర్వేషన్లు అమలయ్యాయి. రాష్ట్రాల పరిధిలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఆలిండియా కోటా భర్తీకి రిజర్వేషన్లు అమల్లోకి రాలేదు. ఉన్నత విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూఎస్ వర్గానికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో కేంద్ర సర్కారు రాజ్యాంగ సవరణ చేసింది. ఈ వర్గం కోసం 2019–20, 2020–21లో మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్ల సంఖ్యను (సూపర్ న్యూమరరీ సీట్ల ద్వారా) పెంచింది. దాంతో అన్‌రిజర్వుడ్ కేటగిరీకి అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య తగ్గలేదు. అయితే, ఆలిండియా కోటా సీట్ల భర్తీ విషయంలో ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్ లభించలేదు. 2021–22 నుంచి ఆలిండియా కోటా సీట్ల భర్తీలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. -
‘టెన్త్’ పరీక్ష ఫీజు మినహాయింపు!
ప్రభుత్వ పరిశీలనలో ఫైలు ఆదాయ పరిమితిని రూ. లక్షకు పెంచే యోచన సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు మినహాయింపులో అశాస్త్రీయంగా ఉన్న మినహాయింపు నిబంధనలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫీజు మినహాయింపునకు పరిగణనలోకి తీసుకునే ఆదాయ పరిమితిని రూ. లక్షకు పెంచే ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం పంపించిన ప్రతిపాదనలపై పరిశీలన జరుపుతోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించే సయమానికల్లా దీనిని ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రామా ల్లో ఏటా రూ. 20 వేలలోపు ఆదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారి పిల్లలకు, పట్టణాల్లో అయితే ఏటా రూ. 24 వేలలోపు వార్షికాదాయం ఉన్న వారి పిల్లలకు మాత్రమే ఫీజు మినహాయింపు వర్తిస్తోంది. అలాగే గ్రామాల్లో 2.5 ఎకరాలలోపు వెట్ ల్యాండ్ ఉన్న, 5 ఎకరాలలోపు డ్రై ల్యాండ్ ఉన్న వారి పిల్లలకు మినహాయింపు వరిస్తోంది. భూమి నిబంధనను పక్కనబెడితే.. ప్రస్తుతం గ్రామాల్లో కూలీకి రోజుకు రూ. 100 వరకు వస్తోంది. ఈ లెక్కన ఏటా వారి ఆదాయం రూ. 20 వేలు దాటుతోంది. ప్రస్తుత పరిస్థితులు, శాస్త్రీయత లేని ఆ నిబంధనల వల్ల విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో ఆ నిబంధనలను మార్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.