సేవాపథం
బిహార్ విద్యాశాఖలో ఉన్నతాధికారి అయిన డాక్టర్ మంజు కుమారి రోహ్తాస్ జిల్లాలో, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన తిలౌతు బ్లాక్‌లో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. బ్లాక్ రిసోర్స్ సెంటర్(బీఆర్‌సి) ఇంచార్జిగా ఆమె తన అధికారిక విధులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా వెనకబడిన పిల్లలు చదువులో ముందుండేలా తన వంతు కృషి చేస్తోంది....
ఆఫీసు సమయం అయిపోగానే అందరిలా ఇంటికి వెళ్లదు మంజు కుమారి. సమీపంలోని ఏదో ఒకగ్రామానికి వెళ్లి పేదపిల్లలకు పుస్తకాలు. బ్యాగులు, యూనిఫామ్ లాంటివి అందజేస్తుంది. దీని కోసం ఇతరులు ఇచ్చే డబ్బులు, స్వచ్ఛంద సంస్థలపై ఆధారపడకుండా తన జీతం నుంచే కొంత మొత్తాన్ని వెచ్చిస్తుంది. మంజు కుమారికి సామాజిక సేవపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. నాన్న శివశంకర్ షా తనకు స్ఫూర్తి.
‘సామాజిక సేవకు సంబంధించి నాన్న ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. మా ఊరి పాఠశాల కోసం భూమిని ఉదారంగా ఇవ్వడమే కాదు అవసరమైన వనరులు అందించారు. ఇలాంటివి చూసి నాలో సామాజిక బాధ్యత పెరిగింది. ఆ స్కూల్ ఇప్పటికీ ఉంది. సామాజిక సేవాకార్యక్రమాలు మరిన్ని చేసేలా నిరంతరం స్ఫూర్తినిస్తుంది’ అంటుంది మంజు కుమారి.
రాంచీ యూనివర్శిటీ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్... ఆ తర్వాత పీహెచ్‌డీ చేసిన మంజు డెహ్రీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దశాబ్దానికి పైగా హిందీ టీచర్‌గా పనిచేసింది. 2023లో బీ ఆర్‌సి ఇంచార్జిగా నియామకం అయింది. దీంతో సామాజిక సేవలో మరింత క్రియాశీలంగా పనిచేస్తోంది.
స్థానిక పాఠశాలలను తనిఖీ చేస్తుంటుంది. పాఠశాల పరిశ్రుభతపై ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ముందు ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది మంజు కుమారి. ఆ సమయంలో గిరిజన గూడేలకు వెళ్లి ఎప్పుడూ స్కూల్‌కు వెళ్లని పిల్లలకు అక్షరాలు నేర్పించేది, పాఠాలు చెప్పేది. ఇది చూసి తల్లిదండ్రులు పిల్లలను రోజూ స్కూల్‌కు పంపించేవారు.
‘ఇది నేను సాధించిన పెద్ద విజయం’ అంటుంది మంజు కుమారి. అయితే మంజుకుమారి ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అత్తమామలు, భర్త అభ్యంతరం చెప్పేవాళ్లు. మంజుకుమారిని సామాజిక సేవ దారి నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్లు. అయినప్పటికీ ఆమె పట్టుదలగా ముందుకు వెళ్లింది.
సామాజిక బాధ్యత, నైతిక విలువలు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మంజు కుమారి... ‘తమ గురించి మాత్రమే ఆలోచించే ధోరణి ప్రజలలో బాగా పెరిగింది. సామాజిక స్పృహ లోపిస్తుంది. సేవా స్ఫూర్తిని, సామాజిక నిబద్ధతను పునరుద్ధరించాలని ఆశిస్తున్నాను’ అంటుంది.
Comments
Please login to add a commentAdd a comment