సాక్షి, పట్నా : ఇలాంటి పొరపాట్లు దొర్లటం సహజమే కావొచ్చు. కానీ, విద్యావ్యవస్థపై విమర్శలు వినిపించే బిహార్‌లోనే ఈ ఘటన చోటు చేసుకోవటమే ఇక్కడ విశేషం. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో హల్ టికెట్‌లో విద్యార్థికి బదులు.. వినాయకుడి ఫోటో.. కింద సంతకం కూడా గణేశ్ అని ఉంది. దీంతో దేవుడే వచ్చి పరీక్ష రాస్తాడా? అని సదరు విద్యార్థి ప్రశ్నిస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్లితే... దర్భాంగలోని లలిత్ నారాయణ్ మిథిల యూనివర్సిటీలో కృష్ణ కుమార్ రాయ్ అనే విద్యార్థి బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అక్టోబర్ 9 నుంచి పరీక్షలు మొదలు అవుతుండగా.. బుధవారం యూనివర్సిటీ అధికారులు అతనికి హాల్ టికెట్ జారీ చేశారు. అది చూసి అతని నోట మాట పడిపోయింది. వినాయకుడి ఫోటో, కింద గణేషుడి సంతకం.. పైగా ఆ విద్యార్థి అడ్రస్ కూడా తప్పుగా రాసి ఉంది.
ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే. ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం నేను చెప్పేది కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు దేవుడే వచ్చి పరీక్ష రాస్తాడా? అంటూ కృష్ణ ప్రశ్నిస్తున్నాడు. ఇక ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తే.. హాల్ టికెట్లు ముంద్రించేందుకు బయట ప్రైవేట్ ప్రింటింగ్ మిషన్ల సాయం తీసుకుంటామని, బహుశా అక్కడ తప్పు దొర్లి ఉండొచ్చని.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని చెబుతున్నారు. కాగా, ఇదే యేడాది మొదట్లో బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష సందర్భంగా ఓ అమ్మాయి హల్ టికెట్‌పై భోజ్‌పురి నటి అంతరా బిశ్వాస్(మోనాలిసా) టాప్ లెస్ ఫోటోను ముద్రించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment