
పాట్నా: రెండేళ్ల క్రితం చనిపోయిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వం నాలుక్కరుచుకున్న ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత నెల 17న కాంట్రాక్టు ఉపాధ్యాయులు వారిని క్రమబద్దీకరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పరీక్షా పత్రాలు దిద్దేందుకు వెళ్లిన టీచర్లను అడ్డగించడమే కాక వారిపై దాడికి దిగారంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సదరు ఉపాధ్యాయులు ఎందుకొచ్చిన గొడవ అని విధులకు గైర్హాజరయ్యారు.
దీంతో వారిపై బెగుసరై జిల్లా విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన టీచర్లను సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేశారు. అందులో రెండేళ్ల క్రితం మరణించిన ఉపాధ్యాయుడు రంజిత్ కుమార్ యాదవ్ పేరు ఉండటమే కాక అతను బెగుసరైలోని ఓ కేంద్రంలో ఆన్సర్ కాపీలను దిద్దాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం. కాగా ఈ ఘటనపై బీహార్ విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమిత్ కుమార్ స్పందిస్తూ దీనిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.