Economy class ticket
-
బీఎస్ఎన్ఎల్ అధికారులకు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో తమ అధికారులు ఎకానమీ విమానాల్లో ప్రయాణించాలని కోరింది. ఈ మేరకు కంపెనీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందుల మధ్య ఖర్చులను మరింత తగ్గించే చర్య, ప్రభుత్వ-టెలికాం మేజర్ బిఎస్ఎన్ఎల్ తన అధికారులందరినీ కార్యాలయ ఉత్తర్వు ప్రకారం దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలలో ఎకానమీ క్లాస్ ద్వారా మాత్రమే ప్రయాణించాలని కోరింది. సంస్థ ప్రస్తుత ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో సంస్థ అధికారులందరూ ఇప్పుడు విమానప్రయాణాల్లో ఎకానమీ క్లాస్ (దేశీయ, అంతర్జాతీయ)ను ఎంచుకోవాలని బీఎస్ఎన్ఎల్కోరింది. జూలై 26 నాటి ఉత్తర్వుల ప్రకారం బీఎస్ఎన్ఎల్ అధికారిక పర్యటనలను తదుపరి ఉత్తర్వుల వరకు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని తెలిపింది. అయితే, బీఎస్ఎన్ఎల్ సీఎండీ ముందస్తు అనుమతితో, అధికారులు వ్యాపార అవసరాల విషయంలో ఉన్నత తరగతిలో ప్రయాణించవచ్చని పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థ 2015-16లో రూ. 4,859 కోట్లు, 2016-17లో రూ .4,793 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కాగా డేటా-సెంట్రిక్ టెలికాం మార్కెట్లో మొబైల్ విభాగంలో తీవ్రమైన పోటీ, అధిక సిబ్బంది ఖర్చు , కొన్ని ప్రదేశాల్లో తప్ప 4 జి సేవలు లేకపోవడం బిఎస్ఎన్ఎల్ నష్టాలకు ప్రధాన కారణాల ని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంటుకు చెప్పారు. ఆయన పార్లమెంటుకు ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం, 2018-19లో రూ .14,202 కోట్లకు పెరగనుందని అంచనా. -
సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్ నుంచి 60 ఏళ్లు పైబడిన భారత పౌరులు బుక్ చేసుకునే ప్రతి ఎకానమీ క్లాస్ టికెట్‌పైనా 50 శాతం వరకూ రాయితీని ఆఫర్ చేయనున్నారు. 60 సంవత్సరాలు మించిన సీనియర్ సిటిజన్లు వయసును ధ్రువీకరించేందుకు ప్రభుత్వం గుర్తించిన సరైన గుర్తింపు కార్డులను చూపి ఈ ఆఫర్‌ను పొందవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రయాణ తేదీకి వారం రోజుల ముందు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు చిన్నారులతో ప్రయాణించే సీనియర్ సిటిజన్‌కు రూ 1000ల ప్రత్యేక డిస్కౌంట్‌ను కూడా ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టింది. ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్‌తో దేశంలో పెద్దసంఖ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లకు విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది. -
రూ. 799కే విమానయానం
విస్తార ‘ఫ్రీడం టు ఫ్లై’ ఆఫర్ ముంబై: విమానయాన సంస్థ విస్తార తాజాగా ‘ఫ్రీడం టు ఫ్లై‘ ఆఫర్ కింద రూ. 799కే విమాన ప్రయాణ టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎకానమీ తరగతి టికెట్ చార్జీ రూ. 799 కాగా ప్రీమియం ఎకానమీ టికెట్ రేటు రూ. 2,099గా (ఇతరత్రా అన్ని చార్జీలూ కలిపి) ఉంటుందని పేర్కొంది. 48 గంటల పాటు వర్తించే ఈ ఆఫర్ బుధవారం అర్ధరాత్రితో ముగియనుంది. ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 19 మధ్య కాలంలో చేసే ప్రయాణాలకు ఈ స్కీమ్ టికెట్లు వర్తిస్తాయి. సెలవుల్లో గోవా, పోర్ట్ బ్లెయిర్, జమ్ము, శ్రీనగర్, కొచ్చి, అమృత్సర్, భువనేశ్వర్ తదితర ప్రాంతాలు సందర్శించాలనుకునే వారు ముందస్తుగా ప్రణాళిక వేసుకునేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడగలదని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు కూడా ఈ టికెట్లు వర్తిస్తాయని విస్తార పేర్కొంది. శ్రీనగర్–జమ్ము రూట్లో టికెట్ చార్జీ అత్యంత తక్కువగా ఉంటుందని వివరించింది.