
రూ. 799కే విమానయానం
విస్తార ‘ఫ్రీడం టు ఫ్లై’ ఆఫర్
ముంబై: విమానయాన సంస్థ విస్తార తాజాగా ‘ఫ్రీడం టు ఫ్లై‘ ఆఫర్ కింద రూ. 799కే విమాన ప్రయాణ టికెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎకానమీ తరగతి టికెట్ చార్జీ రూ. 799 కాగా ప్రీమియం ఎకానమీ టికెట్ రేటు రూ. 2,099గా (ఇతరత్రా అన్ని చార్జీలూ కలిపి) ఉంటుందని పేర్కొంది. 48 గంటల పాటు వర్తించే ఈ ఆఫర్ బుధవారం అర్ధరాత్రితో ముగియనుంది. ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 19 మధ్య కాలంలో చేసే ప్రయాణాలకు ఈ స్కీమ్ టికెట్లు వర్తిస్తాయి. సెలవుల్లో గోవా, పోర్ట్ బ్లెయిర్, జమ్ము, శ్రీనగర్, కొచ్చి, అమృత్‌సర్, భువనేశ్వర్ తదితర ప్రాంతాలు సందర్శించాలనుకునే వారు ముందస్తుగా ప్రణాళిక వేసుకునేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడగలదని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు కూడా ఈ టికెట్లు వర్తిస్తాయని విస్తార పేర్కొంది. శ్రీనగర్–జమ్ము రూట్‌లో టికెట్ చార్జీ అత్యంత తక్కువగా ఉంటుందని వివరించింది.