
సీనియర్ సిటిజన్స్‌కు ఎయిర్ ఇండియా భారీ రాయితీ
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ నుంచి 60 ఏళ్లు పైబడిన భారత పౌరులు బుక్ చేసుకునే ప్రతి ఎకానమీ క్లాస్ టికెట్‌పైనా 50 శాతం వరకూ రాయితీని ఆఫర్ చేయనున్నారు. 60 సంవత్సరాలు మించిన సీనియర్ సిటిజన్లు వయసును ధ్రువీకరించేందుకు ప్రభుత్వం గుర్తించిన సరైన గుర్తింపు కార్డులను చూపి ఈ ఆఫర్‌ను పొందవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది.
ప్రయాణ తేదీకి వారం రోజుల ముందు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు చిన్నారులతో ప్రయాణించే సీనియర్ సిటిజన్‌కు రూ 1000ల ప్రత్యేక డిస్కౌంట్‌ను కూడా ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టింది. ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్‌తో దేశంలో పెద్దసంఖ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లకు విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది.