EE-Pos
-
పొరపాటెక్కడ జరిగింది?
► పదో తరగతి ఫలితాలపై విశ్లేషణ ► స్థానం పెరిగినా.. ఆశించింది రాలేదు ► అక్కరకు రాని సమీక్షలు మచిలీపట్నం (చిలకలపూడి): అన్ని రంగాల్లో కృష్ణా టీం ముందుండాలన్నది కలెక్టర్ బాబు.ఎ ఆశ. ఆ ఆశకు అనుగుణంగానే నిత్యావసర సరుకుల సరఫరాలో ఈ-పోస్. పింఛన్ల పంపిణీ, మరుగుదొడ్ల నిర్మాణం, మరెన్నో పథకాలలో జిల్లా రాష్ట్రంలో ముందుండాలని అనేది కలెక్టర్ ఆలోచన. అయితే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో తొమ్మిదో స్థానం సాధించడం ఆయనకు నిరాశ కలిగించింది. మొదటిస్థానం వైఎస్ఆర్జిల్లా దక్కించుకుంది. గత ఫలితాలు బట్టి బేరీజు వేసుకుంటే ఈసారి రాష్ట్రంలో జిల్లా తొమ్మిదో స్థానం సాధించడం, ఉత్తీర్ణత శాతం 93.11 శాతం పెరిగింది.అయితే గత ఫలితాలు, గ్రేడ్ల ఫలితాలు చూస్తే ఇవి ఆశాజనకంగా కనిపించలేదు. ఈ ఏడాది ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలలు కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయాయి. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తాయనుకున్నారు. అక్కరకు రాని సమీక్షలు జిల్లాను రాష్ట్రంలో మెరుగైన స్థానంలో నిలిపేందుకు పరీక్షా తేదీని ప్రకటించిన నాలుగు నెలల ముందు నుంచే డీఈవో ఎ.సుబ్బారెడ్డి ఉపాధ్యాయులకు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. డివిజన్ల వారీగా ఉపాధ్యాయుల సమీక్షలు, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల సమీక్షలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. సమీక్షా సమావేశాల్లో పాఠశాలకు ఒక్క విద్యార్థి అయినా పదికి పది పాయింట్లు సాధించాలని ఆయన చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. నాలుగుసార్లు ప్రీఫైనల్స్ పరీక్షలను కూడా నిర్వహించి వాటి మార్కుల ఆధారంగా సమీక్షలు నిర్వహించినా ఫైనల్ ఫలితాల్లో మాత్రం ఆశించినంతగా రాలేదు. వైఫల్యాలెన్నో.. జిల్లాలో పదో తరగతి ఫలితాలు అనుకున్న స్థాయిలో రాకపోవడానికి వైఫల్యాలు ఎన్నో ఉన్నాయి. గత సంవత్సరం పదికి పది మార్కులు వచ్చిన విద్యార్థులు 646 మంది ఉండగా వీరిలో 18 మంది ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది వచ్చిన ఫలితాల్లో జిల్లా మొత్తంలో 485 మంది విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించగా వీరిలో కేవలం 11 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులున్నారు. అలాగే గత సంవత్సరంలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల్లో 229 ఉండగా ఈ సంవత్సరం కేవలం 120 పాఠశాలలు మాత్రమే నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి. అయితే ఉపాధ్యాయుల సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు గతంలో కంటే ఏ-గ్రేడ్లు సాధించిన విద్యార్థుల లక్ష్యం పెంచుతామని బాహాటంగా చెప్పినప్పటికీ ఫలితాల్లో కనిపించకపోవడం ఉన్నతాధికారులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. -
‘ఈ-పోస్’ ఢమాల్
► ఇబ్బందులుపడ్డ కార్డుదారులు ► రేషన్ సరుకుల పంపిణీకి ► హడావుడి ఎందుకో.. కార్డుదారుల్లో పెల్లుబుకుతున్న అసహనం నూజివీడు/ విజయవాడ : ఈ-పోస్ విధానంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం జిల్లా లో ఉన్న 12.09 లక్షల రేషన్‌కార్డుదారులకు ఈ- పోస్ యంత్రాలు చుక్కలు చూపించాయి. రేషన్ డీలర్లను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రేషన్ షాపులు తెరచిఉంచి మూడు రోజుల్లో సరుకుల పంపిణీని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే ఈ-పోస్ సర్వర్ పనిచేయకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు పం పిణీ జరగలేదు. గతంలో ప్రతి నెలా 20వ తేదీ వరకు రేషన్ సరుకులు ఇచ్చేవారు. దీంతో కార్డుదారులు వారికి అనుకూల సమయంలో ఎలాంటి హ డావుడి లేకుండా సరుకులను తెచ్చుకునేవారు. కొద్ది నెలలుగా జిల్లా కలెక్టర్ సరుకుల పంపిణీపై తేదీలు నిర్ణయించి డీలర్లను హడావుడి పెడుతుండటంతో వారు కార్డుదారులను తొందరపెడుతున్నారు. మొరాయించిన ఈ-పోస్ యంత్రాలు జిల్లాలో 2,163 చౌకధరల దుకాణాలుండగా వాటిలో అధిక భాగం దుకాణాల్లో శుక్రవారం ఈపోస్ యంత్రాలు పనిచేయలేదు. ఈ యంత్రాలను ఆన్ చేస్తే నాట్ యాక్టివేటెడ్ అని చూపిస్తుండటంతో చేసేదేమీ లేక కార్డుదారులు, రేషన్‌డీలర్లు అవి పనిచేసే వరకు వేచిచూస్తూ కాలం గడిపారు. ఈ యంత్రాలు పనిచేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్డుదారులు పనులను ఆపుకుని రేషన్‌షాపుల వద్దే ఉండిపోవాల్సి వచ్చింది. గంటల తరబడి వేచిఉన్నా యంత్రాలు పనిచేయకపోవడంతో ఇదేం పద్ధతని, నెలలో మూడు రోజులు మాత్రమే సరుకులు ఇస్తామనడమేమిటని కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్లు ఉదయం 7 గంటలకు దుకాణాలు తెరిచినప్పటికీ మధ్యాహ్నం 12 గంటలకు కేవలం 8 నుంచి 10 కార్డులకు మాత్రమే సరుకులను అందజేయగలిగారు. ఉదయం 7 గంటలకే వచ్చా ఉదయం ఏడు గంటలకే వచ్చా. మధ్యాహ్నం 12 గంటలైనా బియ్యం ఇవ్వలేదు. మిషన్లు పనిచేయడం లేదని డీలరు చెప్పారు. అందరం అలాగే రేషన్‌షాపు వద్ద కూర్చున్నాం. కూలికెళితే రూ.250 వచ్చేవి. మళ్లీ ఇంకొకరోజు రావాలి. కోట్లపాటి అంజమ్మ, యానాదుల కాలనీ, నూజివీడు ఇబ్బందులు పడుతున్నాం ఈ విధానం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. ఉదయం 7 గంటలకు వచ్చినా యంత్రం పనిచేయక అలాగే ఉన్నాం. గతంలో కుటుంబంలో ఎవరు వచ్చినా రేషన్ ఇచ్చేవారు. అలా ఇస్తే తప్పేమిటో మాకు అర్థం కావడం లేదు. గంటల తరబడి నిలబెట్టడం దారుణం. పాటి శ్రీరామమూర్తి, బాపూనగర్, నూజివీడు