‘ఈ-పోస్’ ఢమాల్
► ఇబ్బందులుపడ్డ కార్డుదారులు
► రేషన్ సరుకుల పంపిణీకి
► హడావుడి ఎందుకో.. కార్డుదారుల్లో పెల్లుబుకుతున్న అసహనం
నూజివీడు/ విజయవాడ : ఈ-పోస్ విధానంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం జిల్లా లో ఉన్న 12.09 లక్షల రేషన్‌కార్డుదారులకు ఈ- పోస్ యంత్రాలు చుక్కలు చూపించాయి. రేషన్ డీలర్లను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రేషన్ షాపులు తెరచిఉంచి మూడు రోజుల్లో సరుకుల పంపిణీని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అయితే ఈ-పోస్ సర్వర్ పనిచేయకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు పం పిణీ జరగలేదు. గతంలో ప్రతి నెలా 20వ తేదీ వరకు రేషన్ సరుకులు ఇచ్చేవారు.
దీంతో కార్డుదారులు వారికి అనుకూల సమయంలో ఎలాంటి హ డావుడి లేకుండా సరుకులను తెచ్చుకునేవారు. కొద్ది నెలలుగా జిల్లా కలెక్టర్ సరుకుల పంపిణీపై తేదీలు నిర్ణయించి డీలర్లను హడావుడి పెడుతుండటంతో వారు కార్డుదారులను తొందరపెడుతున్నారు. మొరాయించిన ఈ-పోస్ యంత్రాలు జిల్లాలో 2,163 చౌకధరల దుకాణాలుండగా వాటిలో అధిక భాగం దుకాణాల్లో శుక్రవారం ఈపోస్ యంత్రాలు పనిచేయలేదు. ఈ యంత్రాలను ఆన్ చేస్తే నాట్ యాక్టివేటెడ్ అని చూపిస్తుండటంతో చేసేదేమీ లేక కార్డుదారులు, రేషన్‌డీలర్లు అవి పనిచేసే వరకు వేచిచూస్తూ కాలం గడిపారు. ఈ యంత్రాలు పనిచేయకపోవడంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్డుదారులు పనులను ఆపుకుని రేషన్‌షాపుల వద్దే ఉండిపోవాల్సి వచ్చింది.
గంటల తరబడి వేచిఉన్నా యంత్రాలు పనిచేయకపోవడంతో ఇదేం పద్ధతని, నెలలో మూడు రోజులు మాత్రమే సరుకులు ఇస్తామనడమేమిటని కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్లు ఉదయం 7 గంటలకు దుకాణాలు తెరిచినప్పటికీ మధ్యాహ్నం 12 గంటలకు కేవలం 8 నుంచి 10 కార్డులకు మాత్రమే సరుకులను అందజేయగలిగారు.
ఉదయం 7 గంటలకే వచ్చా
ఉదయం ఏడు గంటలకే వచ్చా. మధ్యాహ్నం 12 గంటలైనా బియ్యం ఇవ్వలేదు. మిషన్లు పనిచేయడం లేదని డీలరు చెప్పారు. అందరం అలాగే రేషన్‌షాపు వద్ద కూర్చున్నాం. కూలికెళితే రూ.250 వచ్చేవి. మళ్లీ ఇంకొకరోజు రావాలి. కోట్లపాటి అంజమ్మ, యానాదుల కాలనీ, నూజివీడు
ఇబ్బందులు పడుతున్నాం
ఈ విధానం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. ఉదయం 7 గంటలకు వచ్చినా యంత్రం పనిచేయక అలాగే ఉన్నాం. గతంలో కుటుంబంలో ఎవరు వచ్చినా రేషన్ ఇచ్చేవారు. అలా ఇస్తే తప్పేమిటో మాకు అర్థం కావడం లేదు. గంటల తరబడి నిలబెట్టడం దారుణం. పాటి శ్రీరామమూర్తి, బాపూనగర్, నూజివీడు