మరో పది మీ సేవలు
సాక్షి, రాజమండ్రి : ‘ఈ సువిధా’ పేరుతో మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న మీ సేవా కేంద్రాల్లో జనవరి ఒకటో తేదీ నుంచి మరో పది కొత్త సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో మీ సేవా కేంద్రాల్లో లభించే సేవల సంఖ్య 48కు పెరగనుంది. ఇప్పటి వరకూ 43 శాఖలకు చెందిన 38 రకాల సేవలను మీసేవా కేంద్రాల్లో అందిస్తున్నారు. వీటిలో 15 సేవలు ప్రత్యేకంగా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పౌరులకు సంబంధించినవి ఉన్నాయి. కొత్తగా చేరుస్తున్న వాటితో 70 శాతం పుర సేవలు మీ సేవల ద్వారా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నా రు. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీల్లో పురపాలక శాఖ పరిధిలో 58 మీ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటన్నింటిలో ఈ సేవలను పౌరులు పొందే అవకాశం ఉంది.
కొత్త సర్వీసులు ఇవే...
కొత్తగా చేరుస్తున్న సర్వీసులను కొన్నింటిని తక్షణ ప్రాతిపదికగా అందుబాటులోకి తెస్తున్నారు. కాగా మరి కొన్నింటిని మాత్రం సిబ్బందికి పూర్తిగా శిక్షణ ఇచ్చిన తర్వాత జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. కొత్తగా చేరుతున్న సేవల ప్రకారం పుర పౌరులు నీటి కుళాయి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మున్సిపాలిటీల్లో వ్యాపారం చేసుకునేందుకు లెసైన్సుకు దరఖాస్తు చేయవచ్చు. లెసైన్సుల రెన్యువల్, కొత్త భవన నిర్మాణానికి అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చును. కొత్త ఎసెస్మెంట్ కోసం అభ్యర్థన పత్రాలు దాఖలు చేయవచ్చు. ఎసెస్మెంట్ల సబ్ డివిజన్ కోసం మీసేవ ద్వారా అభ్యర్థన పత్రం దాఖలు చేయవచ్చు. పన్ను మినహాయింపు, వేకెన్సీ రెమిషన్ అభ్యర్థనలు, స్థల అనుభవ, స్వాధీన ధ్రువ పత్రాలతో పాటు ఆస్థి యాజమాన్య బదలాయింపులకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.
అవగాహన కార్యక్రమాలు
ట్రేడ్ లెసైన్సులు, భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, తదితర సేవలు అందించాలంటే మీసేవ నిర్వాహకులకు తగిన అవగాహన అవసరం అని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం మున్సిపల్ రీజియన్ల వారీగా సిబ్బందికి శిక్షణలు ఇవ్వనున్నారు. రాజమండ్రి రీజియన్ పరిధిలోకి వచ్చే ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల మీ సేవా కేంద్రాల సిబ్బందికి కొత్త సేవలపై ఈ నెల 27న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషణ్ ప్రాంగణంలో ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. శిక్షణ అనంతరం కొత్తగా ప్రవేశ పెట్టిన పది సేవలు కొత్త సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తాయి. పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు పురపాలక శాఖ అధికారులు కొత్త సేవలకు సన్నాహాలు చేస్తున్నారు.