ఐషర్ నుంచి స్కైలైన్ ప్రో బస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాఠశాల విద్యార్ధులు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐషర్ స్కైలైన్ ప్రో సిరీస్‌లో రెండు కొత్త బస్సులను ఐషర్ వీఈ కమర్షియల్ వెహికల్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐషర్ మోటర్స్, వోల్వో గ్రూపు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వీఈ కమర్షియల్ వెహికల్స్ ఈ కొత్త బస్సులను శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేసింది. తక్కువ ఇంధన వ్యయంతో అధిక మైలేజీ వచ్చే విధంగా రూపొందించిన స్కైలైన్ ధరల శ్రేణి రూ. 17 - 18 లక్షలుగా ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీఈ కమర్షియల్ వెహికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ మాలర్ మాట్లాడుతూ ఈ ఏడాది లైట్ వెహికల్ బస్సుల్లో 21 శాతం, హెవీ వెహికల్ బస్సుల్లో 6 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఈ రెండు విభాగాల్లో దేశవ్యాప్తంగా 48,000 వాహనాలు అమ్ముడుకాగా, ఇందులో ఐషర్ 15.7 శాతం వాటాతో 7,400 యూనిట్లను విక్రయించింది.
బస్ మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందుకోసం రూ. 250 కోట్లతో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జేఎన్ఎన్యూఆర్ఎం కింద వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల నుంచి ఆర్డర్లను దక్కించుకుంటున్నామని, ఈ మధ్యనే బీహార్ నుంచి 560 బస్సులు, ఇండోర్ నుంచి 65 బస్సుల ఆర్డర్లు లభించినట్లు తెలిపారు.