ఇంధనం-కొవిడ్ ఎఫెక్ట్.. ఇక ఈవీ బస్సులపై ఫోకస్
చెన్నై: కోవిడ్–19 ముందు వరకు దేశవ్యాప్తంగా ఏటా సుమారు 80,000 బస్‌లు అమ్ముడయ్యేవి. మహమ్మారి కారణంగా బస్సుల డిమాండ్ గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 15,000 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో ఈ సంఖ్య 5,000 మాత్రమే. దీనినిబట్టి పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 2021లో డిమాండ్ నెమ్మదిగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుత తరుణంలో ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు, నూతన మోడళ్ల అభివృద్ధికి కొత్త పెట్టుబడులు పెట్టేందుకు తయారీ సంస్థలు సుముఖంగా లేవు. పరిస్థితులు చక్కబడే వరకు వేచి చూస్తామని అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ చెబుతున్నాయి. అయితే ఎలక్ట్రిక్ బస్‌ల తయారీపై కంపెనీలు ఫోకస్ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఎలక్ట్రిక్ వాహనాలపై..
పూర్తి స్థాయి తయారీ సామర్థ్యాన్ని వినియోగించనప్పుడు కొత్త పెట్టుబడులు కనీసం మరో రెండేళ్లు వాయిదా పడే అవకాశం ఉందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ రోహన్ గుప్తా వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్ వాహనాల నిర్మాణంపై దృష్టిసారించిన తయారీ సంస్థలు మాత్రమే కొత్త పెట్టుబడులు చేస్తాయని అన్నారు. అశోక్ లేలాండ్ ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించిన ప్లాంటులో ఈ ఏడాది మార్చిలో ఉత్పత్తి ప్రారంభం అయింది. దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో అదనపు సామర్థ్యం జోడించడానికి ఈ కంపెనీకి అవకాశం లేదు. రూ.966 కోట్లలో అత్యధికం యూకేకు చెందిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ స్విచ్‌లో పెట్టుబడి చేసింది. ఎలక్ట్రిక్ విభాగంలో తేలికపాటి వ్యాన్స్, బస్‌లను భారత్‌లో అశోక్ లేలాండ్ ప్రవేశపెట్టనుంది.
దక్షిణ కొరియా ముందంజ..
పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా మూతపడడంతో బస్‌లకు డిమాండ్ తగ్గిపోయింది. సొంత వాహనాల వల్ల ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం తగ్గింది. ఆయా అంశాల నేపథ్యంలో తయారీ సామర్థ్యాన్ని పెంచే అవసరం లేదని వోల్వో ఐషర్, దైమ్లర్ స్పష్టం చేశాయి. బస్‌లకు డిమాండ్ పూర్తిగా పడిపోయిందని టాటా మోటార్స్ సీఎఫ్‌వో పి.బాలాజీ తెలిపారు. ‘కొంత కాలం కంపెనీ వేచి చూస్తుంది. బస్‌ల తయారీ సామర్థ్యం పెంచే ఆలోచన లేదు. కొత్త ఉత్పాదనలపై పెట్టుబడులను దశలవారీగా ఉపసంహరించుకుంటున్నాం’ అని తెలిపారు. పాఠశాలలు తిరిగి తెరుచుకున్న తర్వాత డిమాండ్ పెరుగుతుందని అన్నారు. రోడ్డు రవాణా సంస్థల వద్ద ఉన్న బస్‌లకు వయసు మీరుతోందని గుర్తుచేశారు. 1,000కి భారత్‌లో 1.5 బస్‌లు మాత్రమే ఉన్నాయి. దక్షిణ కొరియాలో 70, జపాన్ 30, చైనాలో ఈ సంఖ్య 6 ఉంది. దేశంలో 11 లక్షల బస్‌లకు కొరత ఉందని పరిశ్రమ అంచనా.
భారత్‌లో ఎలక్ట్రిక్ బస్‌ల జోరు
దేశంలో 2025 నాటికి కొత్త బస్‌ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాటా 8–10 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ప్రజా రవాణా వ్యవస్థ ఒత్తిడిలో ఉన్నప్పటికీ కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ బస్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించింది. ‘దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఫేమ్ పథకం రెండేళ్లపాటు పొడిగించడం ఈ రంగానికి తోడుగా నిలవనుంది. ఈ పథకం కింద 7–12 మీటర్ల పొడవున్న బస్‌లకు రూ.35–55 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. ఇంధనం విషయంలో సాధారణ బస్‌లతో పోలిస్తే ఈ–బస్‌లకు అయ్యే వ్యయం అయిదింతలు చవక కూడా. మొత్తం వ్యయం చూస్తే సబ్సిడీల కారణంగా సీఎన్జీ బస్‌లకు సమానంగా ఈ–బస్‌లు ఉంటాయి. దేశీయంగా తయారీ, బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు, నిర్వహణ వ్యయాల నియంత్రణ ఈ–బస్‌ల అమ్మకాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఫేమ్–2 పథకం కింద సబ్సిడీ కారణం గా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానానికి కాంట్రాక్టర్లు మొగ్గు చూపుతున్నారు’ అని వివరించింది.